తెలంగాణలో అమరరాజా గ్రూప్ భారీ పెట్టుబడి..! ఏంటి సంగతి..?

తెలంగాణలో అమరరాజా గ్రూప్ భారీ పెట్టుబడి..! ఏంటి సంగతి..?

ఆంధ్రప్రదేశ్ లో అమర రాజా గ్రూప్ అతి పెద్ద వ్యాపార సంస్థల్లో ఒకటి. చిత్తూరు జిల్లా కేంద్రంగా ఈ సంస్థ ఎంతోకాలంగా కంపెనీలు నిర్వహిస్తోంది. ముఖ్యంగా బ్యాటరీ తయారీరంగంలో ఈ సంస్థ ఎంతో పేరొందింది. ఆ తర్వాత పల్ప్, జ్యూస్ ఇండస్ట్రీలను కూడా నెలకొల్పింది. ముఖ్యంగా చిత్తూరు జిల్లావాసులు ఎంతోమంది అమర రాజా గ్రూపులో ఉద్యోగాలు, ఉపాధి పొందుతున్నారు. ఇప్పటివరకూ ఆంధ్రప్రదేశ్ ను దాటి ఈ సంస్థ మరెక్కడా పెట్టుబడులు పెట్టిన దాఖలాలు లేవు. అయితే తొలిసారి అమర రాజా గ్రూపు తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.
 
తెలంగాణలో 9వేల 500 కోట్ల పెట్టుబడితో లిథియం బ్యాటరీ తయారీ కంపెనీ ఏర్పాటు చేసేందుకు అమర రాజా గ్రూపు ముందుకొచ్చింది. మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆ గ్రూప్ సీఎండీ గల్లా జయదేవ్ ఒప్పందం కుదుర్చుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లిలో ఈ లిథియం అయాన్ గిగా ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనున్నారు. మొదటి విడతలో మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేయనుంది. రెండు మూడేళ్లలో ఉత్పత్తి ప్రారంభిస్తామని తెలిపింది. దీని ద్వారా 4500 మంది స్థానికులకు ఉపాధి కల్పిస్తామని అమర రాజా గ్రూపు వెల్లడించింది. పెట్టుబడి మొత్తాన్ని పదేళ్లలోపు పెడతామని తెలిపింది.
 
ఎలక్ట్రానిక్ వాహనాలకు గిరాకీ పెరగడం, పర్యావరణహిత వాహనాలపై దృష్టి మరలడంతో అమర రాజా గ్రూపు కూడా ఆ తరహా బ్యాటరీల తయారీ రంగంలోకి ప్రవేశించాలని ఎంతోకాలంగా ప్రయత్నిస్తోంది. ఇప్పుడు ఆ సమయం వచ్చిందని సీఎండీ గల్లా జయదేవ్ వెల్లడించారు. తెలంగాణలో పెట్టుబడులపై పరిశీలించాలని ప్రభుత్వం నుంచి చాలాకాలం కిందటే ప్రతిపాదన వచ్చిందని.. తెలంగాణ పారిశ్రామిక విధానం అనుకూలంగా ఉండడంతో ఇక్కడే ఫ్యాక్టరీ నెలకొల్పాలని నిర్ణయించినట్లు గల్లా జయదేవ్ తెలిపారు. తమిళనాడు, కర్నాటక సహా పలు రాష్ట్రాల నుంచి ఆహ్వానాలు వచ్చినా తెలంగాణకే మొగ్గు చూపినట్లు వెల్లడించారు.
 
అయితే ఆంధ్రప్రదేశ్ ను దాటి అమర రాజా గ్రూపు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి అనేక కారణాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. గల్లా కుటుంబం ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉంది. గ్రూపు సీఎండీ గల్లా జయదేవ్ టీడీపీ ఎంపీగా ఉన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అమరరాజా గ్రూపులోని రెండు యూనిట్లను మూసివేయాలంటూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నోటీసులు ఇచ్చింది. పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయని తెలిపింది. దీనిపై కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంది అమరరాజా గ్రూపు. ఇదే పరిస్థితి కొనసాగితే అమరరాజా గ్రూపు చెన్నైకి తరలిపోతుందని అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే అలాంటి పరిస్థితి రాబోదని అప్పట్లో గల్లా జయదేవ్ స్పష్టం చేశారు. అమర రాజా కంపెనీలు అత్యున్నత ప్రమాణాలు పాటిస్తాయని స్పష్టం చేశారు.
 
అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమపై మున్ముందు కూడా కక్షపూరితంగా వ్యవహరిస్తే కంపెనీలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని భావించడం వల్లే అమరరాజా గ్రూపు తెలంగాణను తమ పెట్టుబడులకు కేంద్రంగా ఎంచుకుందని వ్యాపారవర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడులకు రెడ్ కార్పెట్ పరుస్తుండడం, పారిశ్రామిక ఫ్రెండ్లీగా ఉండడంతో అమరరాజా గ్రూపు ప్రత్యామ్నాయాన్ని ఎంచుకుందని భావిస్తున్నాయి. 

 

Tags :