MKOne TeluguTimes-Youtube-Channel

వేళ్లన్నీ సోము వీర్రాజు వైపేనా..?

వేళ్లన్నీ సోము వీర్రాజు వైపేనా..?

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ బీజేపీలో సెగలు పుట్టిస్తున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడమే పెద్ద పరాభవం. అలాంటిది ఏకంగా డిపాజిట్ కూడా దక్కకపోతే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, దేశంలో తిరుగులేని పార్టీ ఏపీలో సిట్టింగ్ స్థానంలో డిపాజిట్ కోల్పోవడాన్ని ఆ పార్టీ నేతలు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నాయి. ఇందుకు కారణాలేంటి.. అనే దానిపై ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు లెక్కలేసుకుంటున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితంపై మొదట స్పందించాల్సింది ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. కానీ ఆయన దీనిపై ఇంతవరకూ నోరు తెరవలేదు. ఏపీలో పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజారడానికి సోము వీర్రాజే కారణమనేది చాలా మంది నేతల ఆరోపణ. ఇప్పటికే పలువురు నేతలు సోము వీర్రాజుపై రాళ్లు విసిరి పార్టీని వదిలేసి వెళ్లిపోయారు. ఇంతలోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో దారుణ ఓటమి సోము వీర్రాజు పనితీరుకు నిదర్శనంగా మారింది. ఇప్పుడు మరింత మంది నోరు విప్పేందుకు సిద్ధమవుతున్నారు.

ఇప్పటికే పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి విష్ణుకుమార్ రాజు బీజేపీ పనైపోయిందన్నట్టు మాట్లాడారు. వైసీపీకి ఓటేసినా, బీజేపీకి ఓటేసినా అనే ఫీలింగ్ జనాలకు వచ్చేసిందని, అందుకే ఉత్తరాంధ్రలో ఓడిపోయామని విష్ణు కుమార్ రాజు అభిప్రాయపడ్డారు. వైసీపీ-బీజేపీ ఒక్కటే అని జనం ఫిక్స్ అయిపోయారని తేల్చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీని ఎదుర్కోవాలంటే టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయాలని.. లేకుంటే పార్టీ మనుగడ కష్టమని విష్ణు కుమార్ రాజు చెప్పారు.

సహజంగానే ఏపీలో బీజేపీ ఎవరితో పొత్తు పెట్టుకోకుండా సీట్లు, ఓట్లు గెలిచిన చరిత్ర లేదు. ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పడు మాత్రమే బీజేపీకి సీట్లు దక్కాయి. ఇప్పుడు కోల్పోయిన మాధవ్ స్థానం కూడా గతంలో టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు వచ్చిందే. ఇప్పుడు ఏ పార్టీతో పొత్తు లేకుండా ఒంటరిగా వెళ్లింది. దీంతో కనీసం డిపాజిట్ కూడా  దక్కించుకోలేకపోయింది. పార్టీలో ఇది ఇప్పుడు ఇంకెన్ని సంచలనాలకు కారణమవుతుందోననే భయం నెలకొంది.



Tags :