సిట్టింగ్ స్థానంలో డిపాజిట్టూ దక్కించుకోలేకపోయిన బీజేపీ!

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో టీడీపీ అభ్యర్థి చిరంజీవ రావు ఘన విజయం సాధించారు. అధికార వైసీపీ రెండో స్థానంలో నిలిచింది. వాస్తవానికి ఇది బీజేపీ స్థానం. ఆ పార్టీ నేత మాధవ్ ఇన్నాళ్లూ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన పదవీకాలం పూర్తవడంతో ఇక్కడ ఎన్నిక జరిగింది. ఇలా సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు ఏ పార్టీ అయినా తీవ్రంగా శ్రమిస్తుంది. అయితే ఇక్కడ మాత్రం రివర్స్ అయింది. సిట్టింగ్ స్థానంలో బీజేపీ ఎక్కడో ఉండిపోయింది. పోటీ కాదు కదా.. కనీసం రేసులోనే లేదని చెప్పొచ్చు.
సిట్టింగ్ ఎమ్మెల్సీ మాధవ్ కు ఇక్కడ కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. పోలైన ఓట్లలో 1/6 శాతం ఓట్లు వస్తే డిపాజిట్ దక్కుతుంది. కానీ సిట్టింగ్ ఎమ్మెల్సీ మాధవ్ కు ఆ మేరకు కూడా ఓట్లు రాలేదు. దీన్ని బట్టి ఇక్కడ బీజేపీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. మాధవ్ సౌమ్యుడిగా పేరొందారు. ఆ ఏరియాలో ఆయనకు మంచి పేరు కూడా ఉంది. అయినా మాధవన్ ను పట్టభద్రులు కనీసం పట్టుంచుకోలేదు. ఇందుకు కారణాలేంటనేది బీజేపీ అంతర్మథనం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది.
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఎప్పుడూ ఒంటరిగా గెలిచిన దాఖలాలు లేవు. ఇప్పుడు కూడా బీజేపీ – జనసేన కలిసి ప్రయాణం చేస్తున్నాయి. అయితే పైకి మాత్రమే ఈ కలయిక ఉంది. రెండూ కలిసి ప్రచారం కూడా చేయలేదు. కనీసం జనసేనాని పవన్ కల్యాణ్ నుంచి బీజేపీ అభ్యర్థికి ఓటేయాలనే ప్రకటనా రాలేదు. దీంతో రెండు పార్టీల మధ్య గ్యాప్ ఉందని అర్థమైంది. దీంతో బీజేపీ ఒంటరైంది. ఒంటరిగా వెళ్తే బీజేపీకి ఎలాంటి ఫలితం వస్తుందో ఇప్పుడు అర్థమైంది.
అయితే జాతీయ పార్టీ, అది కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ సిట్టింగ్ స్థానాన్ని ఇంత దారుణంగా కోల్పోవడం ఏపీలో బీజేపీ పరిస్థితికి అద్దం పడుతోంది. అభ్యర్థి మంచి తనం చూసైనా ఓట్లేస్తారని అందరూ భావించారు. కనీసం 3-4 స్థానాల్లో అయినా నిలబడతారని ఊహించారు. కానీ అనూహ్యంగా డిపాజిట్ కూడా గల్లంతవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మాధవ్ కంటే కొంతమంది ఇండిపెండెంట్లకు ఎక్కువ ఓట్లు వచ్చాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మరి ఈ ఫలితాన్ని బీజేపీ ఎలా తీసుకుంటుందో వేచి చూడాలి.