నన్నూ, లోకేశ్‌ను చంపాలనుకుంటున్నారట..! చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

నన్నూ, లోకేశ్‌ను చంపాలనుకుంటున్నారట..! చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

ఇదేం ఖర్మ ప్రోగ్రామ్ తో ప్రజల్లోకి వెళ్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇప్పటివరకూ బాదుడే బాదుడు ప్రోగ్రామ్ తో గ్రామాల్లో తిరిగారు టీడీపీ నేతలు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా ఇదేం ఖర్మ రాష్ట్రానికి పేరుతో ఒక ప్రోగ్రామ్ చేపట్టింది టీడీపీ. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఇందులో భాగంగా ఏలూరు జిల్లా దెందులూరులో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్నారు చంద్రబాబు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను, లోకేశ్ ను చంపేందుకు కుట్ర చేశారని ఆరోపించారు. చంద్రబాబు వ్యాఖ్యలతో టీడీపీ శ్రేణులన్నీ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాయి. మేం తలుచుకుంటే మొద్దు శీనుతో చంద్రబాబును ఇంటికెళ్లి చంపించే వాళ్లమని సాక్షి జీతగాడు చెప్తున్నాడన్నారు చంద్రబాబు. బాబాయ్ ని చంపినంత సులువుగా నన్నూ చంపొచ్చనుకుంటున్నారని చంద్రబాబు అన్నారు. ఇప్పుడు లోకేశ్ ను చంపేందుకు టార్గెట్ గా చేసుకున్నారట.. అన్నారు. వీళ్ల తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

ఈ మధ్య అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హత్యా రాజకీయాలు మొదలుపెడితే చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ నుంచే మొదలుపెడతామన్నారు. మొద్దుశీనుకు చెప్పి ఉంటే చంద్రబాబును ఇంటికెళ్లి చంపేవాడన్నారు. తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆయనపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశాయి. ఈ పరిణామాలతో రాప్తాడులో తోపుదుర్తి వర్గీయులకు, పరిటాల వర్గీయులకు మధ్య రోజూ యుద్ధమే జరుగుతోంది. అయితే వివాదం ముదురుతోందని భావించిన తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి క్షమాపణ చెప్పారు. అయితే ఆ తర్వాత కూడా పరిటాల వర్గీయులపై పోలీసులు కేసులు నమోదు చేయడంతో ఈ వివాదం కొనసాగుతూనే ఉంది.

ఇప్పుడు దెందులూరులో చంద్రబాబు ఇదే విషయాన్ని ప్రస్తావించారు. తనను, లోకేశ్ ను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వాళ్ల బెదిరింపులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా ఆయన సీఎం జగన్ పైనా తీవ్ర కామెంట్స్ చేశారు. బాబాయ్ ని చంపిన వాళ్లు రాష్ట్రాన్ని పరిపాలిస్తుండడం ఖర్మ అన్నారు. బాబాయ్ ని చంపి అబద్దాలు అల్లిన జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత లేదన్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసు తెలంగాణకు బదిలీకావడం జగన్మోహన్ రెడ్డికి చెంపదెబ్బ అన్నారు చంద్రబాబు. తండ్రి హత్య కేసుపై సుప్రీంకోర్టు వరకూ వెళ్లి పోరాడిన సునీతను అభినందించాలన్నారు. పోలీసుల మెడమీద జగన్ కత్తి పెట్టి పని చేయిస్తున్నాడని ఆరోపించారు. వివేకా హత్యకేసు నిందితుల్లో ఇప్పటికే ముగ్గురు చనిపోయారన్నారు.

ఎన్నికలు సమీపిస్తున్నందున జగన్ మళ్లీ ప్రజల నెత్తిన చేయి పెట్టేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని.. అలాంటివాటిని ప్రజలు ఈసారి నమ్మొద్దని సూచించారు చంద్రబాబు. ప్రజాచైతన్యంతో తన నెత్తిన తానె జగన్ చెయ్యి పెట్టుకునేలా చేయాలని సలహా ఇచ్చారు. ప్రజాస్వామ్యం ఇచ్చిన ఓటు అనే ఆయుధంతో ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి పట్టిన ఖర్మ పోవాలని పిలుపునిచ్చారు. తాను అధికారంలోకి వస్తే సంక్షేమ కార్యక్రమాలను ఆపకుండే రెట్టింపు చేస్తానని హామీ ఇచ్చారు. తానొస్తే సంపదను పెంచి ప్రజలకే ఖర్చు పెడతానన్నారు. ఇప్పుడు కావాల్సింది ప్రజా చైతన్యం కాదని.. ప్రజల తిరుగుబాటు అని చెప్పారు చంద్రబాబు.

 

Tags :