తగ్గేదే లేదంటున్న చంద్రబాబు..! పంథా మార్చారా..?

తగ్గేదే లేదంటున్న చంద్రబాబు..! పంథా మార్చారా..?

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ - టీడీపీ మధ్య వార్ ఉధృతంగా సాగుతోంది. టీడీపీ వాళ్లు ఒకటంటే వైసీపీ వాళ్లు రెండంటున్నారు. వైసీపీ వాళ్లు రెండంటే.. టీడీపీ వాళ్లు మూడనేందుకు రెడీగా ఉంటున్నారు. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నరకు పైనా సమయం ఉన్నా ఆ రెండు పార్టీలు మాత్రం ఇప్పుడే ఎన్నికల గోదాలోకి దిగిపోయినట్లు అర్థమవుతోంది. వైసీపీ గడపగడపకు ప్రభుత్వం పేరుతో ఇప్పటికే ఆ పార్టీ ప్రజాప్రతినిధులందరినీ ఇంటింటికీ పంపుతోంది. ఇందుకు ప్రతిగా టీడీపీ కూడా వైసీపీని టార్గెట్ చేస్తూ పలు కార్యక్రమాలను రూపొందించుకుంటోంది. ఇప్పటికే బాదుడే బాదుడు పేరుతో ఒక క్యాంపెయిన్ ను నడిపింది టీడీపీ. ఇప్పుడు ఇదేం కర్మ మన రాష్ట్రానికి పేరుతో మరో ప్రోగ్రామ్ చేపట్టింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు ఫుల్ బిజీగా ఉన్నారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు కూడా ఇదేం కర్మ ప్రోగ్రామ్ లో ఫుల్ జోష్ తో కనిపిస్తున్నారు.

కర్నూలు జిల్లాలో చంద్రబాబు టూర్ కు జనం పెద్దఎత్తున తరలివచ్చారు. దీంతో టీడీపీ శ్రేణుల్లో ఫుల్ జోష కనిపిస్తోంది. చంద్రబాబును వైసీపీ శ్రేణులు కర్నూలు జిల్లాలో పలుచోట్ల అడ్డుకున్నాయి. అయినా ఆయన ఎక్కడా తగ్గలేదు. పైగా మరింత రెచ్చిపోయారు. తన పంథాకు భిన్నంగా నోటికి పని చెప్పారు. వైసీపీ బెదిరింపులకు భయపడేదే లేదని తేల్చి చెప్పారు. రండి తేల్చుకుందాం అని సవాల్ విసిరారు. ఇప్పుడు గోదావరి జిల్లాల్లో ఇదేం కర్మ ప్రోగ్రామ్ లో పాల్గొంటున్నారు చంద్రబాబు. ఇక్కడ కూడా జనం పెద్దఎత్తున తరలివస్తున్నారు. దీంతో చంద్రబాబులో ఉత్సాహం తొణికిసలాడుతోంది. వారిని చూసి చంద్రబాబు వాయిస్ మరింత పెంచుతున్నారు. వై.ఎస్.జగన్ టార్గెట్ గా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ ఒక్క ఛాన్స్ అనగానే అందరూ ఓటేశారని.. ఇప్పుడు ఇదేం కర్మ అని అనుభవిస్తున్నారని సైటైర్స్ వేస్తున్నారు.

మరోవైపు.. తాను అధికారంలోకి వస్తేనే పోలవరం పూర్తవుతుందని చెప్పారు. తాను అధికారంలో ఉన్నప్పుడు 72 శాతం పనులు పూర్తి చేశానని.. కానీ ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం పూర్తిగా పడకేసిందని ఎద్దేవా చేశారు. రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం ప్రాజెక్టును పూర్తిగా రివర్స్ చేసేశారని.. డయాఫ్రం వాల్ పేరుతో సాకులు చెప్తున్నారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టుకోసం తెలంగాణలోని ముంపు మండలాలను కూడా ఏపీకి తీసుకొచ్చిన ఘనత తనదేనని.. ప్రాజెక్టుకు ఆటంకాలు లేకుండా అన్నీ చేశానని చెప్పుకొచ్చారు. అయినా ఈ ప్రభుత్వం పోలవరాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు. పోలవరం పూర్తయితేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందన్నారు. పోలవరం పూర్తి చేసే బాధ్యత తనదేనన్నారు.

మరోవైపు.. ఈసారి జగన్ అధికారంలోకి వస్తే అమరావతి రాజధానిగా పూర్తిగా ఉండదని.. మొత్తాన్నీ తీసేస్తారని హెచ్చరించారు. అమరావతిని కూడా పూర్తి చేసే బాధ్యత తనదేనని.. ఒక గొప్ప రాజధానిని నిర్మించే అవకాశం తనకు వచ్చిందని చెప్పుకొచ్చారు. రైతులు 33వేల ఎకరాల భూమి ఇచ్చారని.. సంపద సృష్టించాల్సింది పోయి ఉన్నదాన్ని నాశనం చేశారని ఆరోపించారు. అందుకే అమరావతిని కూడా తానే పూర్తి చేస్తానని స్పష్టం చేశారు. మరోవైపు పేర్ల మార్పు పైన కూడా చంద్రబాబు స్పందించారు. గతంలో కడపగా ఉన్న జిల్లా పేరును వై.ఎస్.ఆర్. జిల్లాగా మార్చారని.. తాను అధికారంలోకి వస్తే ఈసారి వైఎస్ఆర్ పేరును మార్చేస్తానని చెప్పారు. ఇటీవల ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును జగన్ ప్రభుత్వం వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చింది. ఇందుకు ప్రతీకారంగా తాను కూడా వైఎస్ఆర్ పేరును మారుస్తానని చంద్రబాబు చెప్పారు. గతంలో చంద్రబాబు ఎప్పుడూ ఇలా రివేంజ్ పాలిటిక్స్ జోలికి వెళ్లేవారు కాదు. కానీ ఇప్పుడు మాత్రం బహిరంగంగానే ఇలా ప్రకటిస్తున్నారు. దీంతో టీడీపీ శ్రేణులు మాత్రం ఫుల్ జోష్ లో కనిపిస్తున్నాయి. తమ నాయకుడు ఇప్పుడు దారిలోకి వచ్చారని సంబరపడుతున్నారు. మరి ఈ స్ట్రాటజీ చంద్రబాబుకు వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి.

 

Tags :