పవన్ వెంటే చిరంజీవి..! మెగాస్టార్ క్లారిటీ ఇచ్చేసినట్లేనా..?

పవన్ వెంటే చిరంజీవి..! మెగాస్టార్ క్లారిటీ ఇచ్చేసినట్లేనా..?

రాజకీయాలను నేను దూరమయ్యానేమో కానీ.. రాజకీయం నా నుంచి దూరం కాలేదు.. అనేది ఇటీవల విడుదలైన గాడ్ ఫాదర్ లో చిరంజీవి డైలాగ్. ఈ డైలాగ్ ను నిజం చేస్తూ చిరంజీవి పలు సందర్భాల్లో రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో నిజంగానే ఆయన నుంచి రాజకీయం దూరం కాలేదని అందరూ అనుకుంటున్నారు. పాలిటిక్స్ కు చిరంజీవి దూరమై చాలాకాలమైపోయింది. యాక్టివ్ పాలిటిక్స్ లో ఆయన లేరు. కాంగ్రెస్ పార్టీ ఆయన్ను తమవాడిగా చెప్పుకుంటున్నా.. చిరంజీవి మాత్రం తాను కాంగ్రెస్ వాడిగా చెప్పుకోవట్లేదు. ఆ పార్టీ సమావేశాలకూ వెళ్లట్లేదు. ఇలాంటి సమయంలో చిరంజీవి వచ్చే ఎన్నికల్లో ఎవరికి మద్దతిస్తారోననే ఆసక్తి, ఉత్కంఠ అందరిలోనూ ఉంది. ఇలాంటి అనుమానాలను నివృత్తి చేసేందుకేనేమో.. చిరంజీవి అడపాదడపా లీకులు ఇస్తున్నారు.

ఏపీ పాలిటిక్స్ ఎంతటి రసవత్తరంగా సాగుతున్నాయో మనకు తెలిసిన విషయమే. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో ఉన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఇందుకోసం ఎవరితోనైనా కలసి వెళ్తానని ఇప్పటికే ప్రకటించారు కూడా. అటు టీడీపీ కూడా పవన్ కల్యాణ్ తో కలిసి వెళ్లేందుకు రెడీగానే ఉంది. ఆ రెండు పార్టీలూ కలిసి పోటీ చేయడం ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక బీజేపీ ప్రయాణం ఎటు అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఈ పార్టీల పాలిటిక్స్ సంగతి పక్కనపెడితే పవన్ కల్యాణ్ కు మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి మద్దతు లభిస్తుందా.. అనే ఆసక్తి జనసేన వర్గాల్లో కనిపిస్తోంది.

పవన్ కల్యాణ్ కు చిరంజీవి బహిరంగంగా మద్దతు పలకాలని జనసేన శ్రేణులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి. అయితే చిరంజీవి ఎప్పుడూ ఓపెన్ గా పవన్ కల్యాణ్ కే నా మద్దతు అని ప్రకటించలేదు. అయితే తమ్ముడికి మద్దతుగా పలు సందర్భాల్లో ఆయన కామెంట్స్ చేశారు. గతంలో ఓ సినిమా వేడుకలో మాట్లాడిన చిరంజీవి.. పవన్ కల్యాణ్ ఎంతైనా నా తమ్ముడు.. తను ఏం చేసినా మంచే చేస్తాడు.. అతనికే మద్దతు ఇస్తానేమో.. అంటూ కామెంట్ చేశారు. దీంతో జనసేన శ్రేణులు ఉబ్బితబ్బిబ్బయిపోయాయి. చిరంజీవి జనసేనకు జై కొట్టారంటూ ప్రచారం చేసుకున్నారు. ఆ పార్టీ నేతలు కూడా చిరంజీవి ఎప్పటికైనా పవన్ కల్యాణ్ గెలుపుకోసం కృషి చేస్తారని చెప్పుకొచ్చారు..

తాజాగా చిరంజీవి మరోసారి పాలిటిక్స్ పై మాట్లాడారు. రాజకీయాల్లో సున్నితంగా ఉంటే కష్టమని.. రాణించలేమని తన స్వానుభవాన్ని వ్యక్తపరిచారు. తన క్లాస్ మేట్స్ తో జరిగిన గెట్ టుగెదర్ లో చిరంజీవి ఈ కామెంట్స్ చేశారు. రాజకీయాల్లో రాణించాలంటే రాటుదేలాలి.. సున్నితంగా ఉండకూడదు.. మాటలు అనాలి.. అనిపించుకోవాలి.. ఇవన్నీ మనకు అవసరమా... అంటూనే పవన్ కల్యాణ్ ఇలాంటి అన్ని అంశాల్లో రాటుదేలాడని చెప్పుకొచ్చారు చిరంజీవి. మాటలు అంటాడని.. అనిపించుకునేందుకు కూడా సిద్ధంగా ఉంటాడని చెప్పారు. ఏదో ఒక రోజు పవన్ కల్యాణ్ ను మంచి పొజిషన్లో చూస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో జనసేన శ్రేణులు సంతోషంలో మునిగిపోయాయి. చిరంజీవి వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ కోసం ప్రచారం కూడా చేస్తారని భావిస్తున్నాయి. అయితే పవన్ కల్యాణ్ తమ్ముడు కాబట్టి చిరంజీవి ఇలా మాట్లాడి ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. సీఎం జగన్ తో చిరంజీవికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని.. సినిమాలను ఫణంగా పెట్టి చిరంజీవి జనసేనకు మద్దతిస్తారని భావించలేమని కొంతమంది అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో..!

 

Tags :
ii). Please add in the header part of the home page.