MKOne TeluguTimes-Youtube-Channel

తగ్గేదే లేదంటున్న సీఎం జగన్..!

తగ్గేదే లేదంటున్న సీఎం జగన్..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ దూకుడు పెంచుతున్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో పెండింగ్ పనులను పూర్తి చేయాలనుకుంటున్నారు. జగన్ ప్రయారిటీగా తీసుకున్న అంశాల్లో రాజధాని ఒకటి. రాజధానిని అమరావతికి మాత్రమే పరిమితం చేయకుండా మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని జగన్ సంకల్పించారు. అయితే ఇది వాస్తవరూపం దాల్చలేదు. అయితే దాన్ని ఇప్పుడు పూర్తి చేసే పనిలో ఉన్నారు జగన్. జులై నుంచి విశాఖ కేంద్రంగా పరిపాలన సాగించడానికి సిద్ధమవుతున్నారు.

2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి మాత్రమే కాకుండా రాష్ట్రానికి 3 రాజధానులు ఉండాలని తీర్మానించారు. విశాఖపట్నం, అమరావతి, కర్నూలు కేంద్రాలుగా 3 రాజధానులు ఏర్పాటు చేస్తే మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని భావించారు. పైగా అధికార వికేంద్రీకరణ జరుగుతుందని.. అప్పుడు ప్రజలకు కూడా పాలన మరింత చేరువవుతుందని వైసీపీ నేతలు చెప్తున్నారు. అందుకు తగ్గట్టుగానే 3 రాజధానుల బిల్లును తీసుకొచ్చారు. అయితే ఇది కోర్టుల్లో నిలవకపోవడంతో వెనక్కు తగ్గారు. అయితే ఇప్పుడు ఇదే అంశంపై కోర్టుల్లో వాదనలు నడుస్తున్నాయి.

కోర్టుల్లో మూడు రాజధానుల అంశం జులై నాటికి కొలిక్కి వస్తుందని జగన్ భావిస్తున్నారు. అందుకే జులైలో విశాఖకు తరలివెళ్తున్నామని మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశంలో జగన్ సహచర మంత్రులకు వివరించారు. అప్పటికల్లా అన్నీ సర్దుకుంటాయని చెప్పడం వెనుక జగన్ ఉద్దేశం అదేనని స్పష్టమవుతోంది. ఒకవేళ అప్పటికి కూడా కోర్టుల్లో క్లారిటీ రాకపోతే విశాఖలో క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసి వారంలో కొన్ని రోజులు అక్కడి నుంచి పాలన సాగించాలని ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తోంది.

ఏదేమైనా 3 రాజధానుల విషయంలో ఎక్కడా వెనక్కు తగ్గకూడదని జగన్ భావిస్తున్నారు. విశాఖ ఇప్పటికే ఎంతో అభివృద్ధి చెందిన నగరం కాబట్టి.. అక్కడి నుంచి పరిపాలన సాగించడానికి, పెట్టుబడులు ఆకర్షించడానికి అదే అనువైన నగరమని సీఎం నిర్ధారణకు వచ్చారు. కోర్టుల్లో ఈ అంశంపై క్లారిటీ వస్తే ఓకే.. లేకుంటే క్యాంప్ ఆఫీస్ పెట్టి పాలనను షిఫ్ట్ చేసేందుకు రెడీ అయిపోతున్నారు.

 

 

Tags :