విద్యాలయాలు నేర్పిస్తున్నది ఇదేనా..?

విద్యాలయాలు నేర్పిస్తున్నది ఇదేనా..?

దేశంలో కులం, మతం రాజ్యమేలుతున్నాయి. ఒకవైపు కులమతరహిత సమాజం కోసం పాటు పడాలని అందరూ లెక్చర్లు మాత్రం ఇస్తూ ఉంటారు. పిల్లలు స్కూల్లో తొలిరోజు అడుగు పెట్టింది మొదలు యూనివర్సిటీల్లో చివరి రోజు విద్య పూర్తి చేసుకునేంత వరకూ ఇదే మాట ప్రతి చోటా వినిపిస్తూ ఉంటుంది. అంటరానితనం అమానుషం అని.. కులమతరహిత సమాజమే మన ధ్యేయం.. అని మంచి మంచి కొటేషన్లు పుస్తకాలపై కనిపిస్తూ ఉంటాయి. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల గోడలపై పెద్ద పెద్ద రంగురంగుల అక్షరాలతో దర్శనమిస్తుంటాయి.. కానీ నిజానికి ఈ మాటలను ఎవరైనా పట్టించుకుంటున్నారా..? ఎవరైనా వీటిని పాటిస్తున్నారా..? పుస్తకాల్లోని మంచి జ్ఞానాన్ని ఆచరణలో పెడుతున్నారా..? అంటే లేదనే చెప్పాలి.. అడుగడుగునా కుల, మత, ప్రాంత విద్వేషాలే.! సమాజం సంగతి పక్కనపెడితే విద్యాలయాలే ఇందుకు వేదికగా నిలుస్తున్నాయి.

విద్యార్థులను విద్యాలయాలు సన్మార్గంలో పెడతాయని నమ్ముతాం. మంచి స్కూళ్లు, కాలేజీల్లో మన పిల్లలు చదవాలని, ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కలలు కంటూ ఉంటాం.. కానీ ఇది వాస్తవంలో జరుగుతోందా.. అంటే లేదనే చెప్పాలి. అడుగడుగునా వివక్షే కనిపిస్తోంది. స్కూళ్లో పిల్లాణ్ణి చేర్చుకునేటప్పుడే ఆ విద్యార్థిది ఏ కులం.. ఏ మతం అని సంతకం చేసి మరీ నిర్ధారించాల్సి వస్తోంది. అప్పటి నుంచి అత్యున్నమైన యూనివర్సిటీల్లో చదువు పూర్తయ్యే వరకూ విద్యార్థులకు అడుగడుగునా కులం, మతం, ప్రాంతం గురించి నూరిపోస్తూనే ఉన్నారు. ఎవరీ పని చేస్తున్నారంటూ పర్టిక్యూలర్ గా ఫలనావాళ్లు అని చెప్పలేం. తోటి విద్యార్థులు కావచ్చు, వారితో సన్నిహితంగా ఉండే టీచర్లు కావచ్చు.. సామాజిక అసమానతలు తీసుకొచ్చిన వివక్ష కావచ్చు.. ఇలాంటివి పెరిగి పెద్దవై యూనివర్సిటీల్లో వాతావరణాన్నే దెబ్బతీస్తున్నాయి. ఇప్పుడు ఇలాంటి సంఘటనే ఒకటి ఢిల్లీ యూనివర్సిటీలో జరిగింది.

ఢిల్లీలో జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీకి ఎంతో పేరుంది. ఇక్కడ చదవాలని ఎంతోమంది విద్యార్థులు కలలు కంటూ ఉంటారు. ఇక్కడ చదివితే భవిష్యత్ బాగుంటుందని అనుకుంటూ ఉంటారు. కానీ అప్పుడప్పుడూ ఇక్కడ జరిగే విద్యార్థి ఉద్యమాలు ఆందోళనకు గురి చేస్తూ ఉంటాయి. తాజాగా JNU గోడలపై కొంతమంది ఆకతాయిలు రాసిన రాతలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బ్రాహ్మణులు క్యాంపస్ వీడాలంటూ చేసిన హెచ్చరికలు విద్యార్థుల మధ్య తీవ్ర విభేదాలకు కారణమవుతున్నాయి. గో బ్యాక్ టు శాఖ అంటూ ఎర్రటి అక్షరాలతో పలుచోట్ల గోడలపై ఇలాంటి హెచ్చరికలు కనిపిస్తున్నాయి. ఈ రాతలపై ఏబీవీపీ తీవ్రంగా స్పందించింది. ఎవరు రాశారో తేల్చాలని డిమాండ్ చేసింది. దీనిపై యూనివర్సిటీ అధికారులు విచారణకు ఆదేశించారు.

యూనివర్సిటీలో బ్రాహ్మణ- బనియా వ్యతిరేక వార్తల వెనుక మతఛాందస విద్యార్థి సంఘాలు ఉన్నాయని ఏబీవీపీ ఆరోపిస్తోంది. హిందువుల మధ్య గొడవలు సృష్టించేందుకే ఇలాంటి పన్నాగాలు పన్నుతున్నారని అనుమానం వ్యక్తం చేసింది. బ్రాహ్మణ వ్యతిరేక రాతలతపై అటు లెఫ్ట్ విద్యార్థి సంఘాలు కూడా వివరణ ఇచ్చాయి. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో లబ్దికోసమే కొన్ని యూనియన్లు తమపై నిందవేసి లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించాయి. మొత్తానికి ఇప్పుడు ఈ వివాదం ఢిల్లీని కుదిపేస్తోంది. యూనివర్సిటీ అధికారులు విచారణకు ఆదేశించారు. అయితే ఇప్పటికే చాలా సందర్భాల్లో యూనివర్సిటీలో ఇలాంటి గొడవలు సర్వసాధారణం అయిపోయాయి.విద్యకు ఆలయాలగా ఉండాల్సిన ఇలాంటి సంస్థలు.. వర్గ వ్యతిరేకతకు, కులాలు మతాల మధ్య చిచ్చుకు కారణమవుతున్నాయి. ఇదే బాధాకరం.

 

 

Tags :