టీడీపీకి షాక్..! త్వరలో వైసీపీ గూటికి గంటా శ్రీనివాసరావు..!?

టీడీపీకి షాక్..! త్వరలో వైసీపీ గూటికి గంటా శ్రీనివాసరావు..!?

గంటా శ్రీనివాసరావు ఎప్పుడు ఎక్కడ ఉంటారో ఎవరికీ అర్థం కారని రాజకీయ విశ్లేషకులు చెప్తుంటారు.. టీడీపీ నుంచి ప్రజారాజ్యం.. ఆ తర్వాత మళ్లీ టీడీపీ.. ఇప్పుడు మళ్లీ పక్క చూపులు.. ఇలా ఉంది గంటా తీరు. అయితే ఆయన ఏ పార్టీలో ఉన్నా గెలుపు ఖాయమనే పేరు తెచ్చుకున్నారు. ఈసారి కూడా ఆయన కచ్చితంగా గెలుస్తారనే నమ్మకం ఆయన అనుచరుల్లో ఉంది. పార్టీలతో సంబంధం లేకుండా గంటాకు ఉన్న వ్యక్తిగత ఇమేజ్ వల్లే ఆయన గెలుస్తుంటారని విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతుంటారు. ఇప్పుడు గంటా శ్రీనివాసరావు మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. త్వరలోనే ఆయన వైసీపీ గూటికి చేరే అవకాశం కనిపిస్తోందని విశాఖలో ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి.

గంటా శ్రీనివాసరావు ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వంలో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. అయితే 2019లో టీడీపీ ఓడిపోయింది. గంటా శ్రీనివాసరావు మాత్రం ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి నుంచి ఆయన పార్టీతో అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఈ మూడున్నరేళ్లలో ఒకే ఒకసారి ఆయన విశాఖలో చంద్రబాబు కార్యక్రమంలో పాల్గొన్నారు. విశాఖలో పలు కార్యక్రమాలను టీడీపీ శ్రేణులు నిర్వహిస్తున్నా గంటా మాత్రం దూరంగానే ఉంటున్నారు. విశాఖలో అక్రమాలు తారస్థాయికి చేరాయని టీడీపీ ఉద్యమాలు నిర్వహిస్తోంది. కానీ గంటా మాత్రం తనకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన పార్టీ మారడం ఖాయమని టీడీపీ కూడా నమ్ముతూ వస్తోంది.

అయితే గంటా శ్రీనివాసరావు పార్టీ మారడం ఖాయం అయినా.. ఏ పార్టీలో చేరుతారనేది తెలియట్లేదు. దీనిపై ఆయన ఏనాడూ నోరు విప్పలేదు. అయితే ఈ మధ్య కాలంలో ఆయన చిరంజీవి, పవన్ కల్యాణ్ లతో సన్నిహితంగా మెలుగుతున్నట్టు తెలుస్తోంది. విశాఖ గర్జన సందర్భంగా పవన్ బస చేసిన హోటల్లో గంటా శ్రీనివాసరావు దర్శనమిచ్చారు. పవన్ కల్యాణ్ తో భేటీ అవడానికే ఆయన హోటల్ కు వచ్చారనే ప్రచారం జరిగింది. అయితే వేరే వాళ్లను కలవడానికి వచ్చినట్లు గంటా క్లారిటీ ఇచ్చారు. అదే సమయంలో చిరంజీవితో కూడా ఈ మధ్య గంటా భేటీ అయ్యారు. తన మిత్రులు కాబట్టి భేటీ అయినట్లు చెప్తున్నా.. దీని వెనుక రాజకీయ వ్యూహం ఉన్నట్టు తెలుస్తోంది. పవన్, చిరంజీవిలతో సన్నిహితంగా మెలుగుతుండడంతో గంటా శ్రీనివాసరావు జనసేనలో చేరుతారని అందరూ భావించారు.

అయితే ఇప్పుడు మరో ట్విస్ట్ నెలకొంది. గంటా శ్రీనివాస రావు అధికార వైసీపీలో చేరడం దాదాపు ఖరారైందనే ప్రచారం జరుగుతోంది. డిసెంబర్ లోనే ఆయన పార్టీ మారడం ఖాయమనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. డిసెంబర్ 1వ తేదీ గంటా శ్రీనివాసరావు పుట్టిన రోజు. ఆరోజు ఆయన సన్నిహితులతో ఈ అంశంపై క్లారిటీ ఇస్తారని తెలుస్తోంది. ఆ తర్వాత మంచి రోజు చూసుకుని వైసీపీ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. రాష్ట్రంలో 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలోనే గంటా ఆ పార్టీ గూటికి చేరుతారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే ఎందుకో అది సాకారం కాలేదు. కానీ ఇప్పుడు అది నిజం కాబోతున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే టీడీపీకి గట్టి దెబ్బే అని చెప్పొచ్చు.

 

 

Tags :