గుడివాడ నాదే.. తగ్గేదే లే..! నేను లోకల్ అంటున్న కొడాలి నాని..!

గుడివాడ నాదే.. తగ్గేదే లే..! నేను లోకల్ అంటున్న కొడాలి నాని..!

 

తెలుగుదేశం పార్టీకి వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని కొరకరాని కొయ్యగా మారారు. టీడీపీని విమర్శించడంలో కొడాలి నాని తర్వాతే ఎవరైనా.! దీంతో నానిని ఓడించేందుకు తెలుగుదేశం పార్టీ సమర్థుడైన నాయకుడికోసం అన్వేషిస్తోంది. ఈ క్రమంలో వెనిగళ్ల రాము అనే ఎన్నారైని ఇక్కడ బరిలోకి దింపేందుకు టీడీపీ సిద్ధమవుతోందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొడాలి నాని స్పందించారు. తనపై ఎవరు పోటి చేసినా భయపడే ప్రసక్తే లేదని.. నేను ఇక్కడ సింహంలాంటి వాడినని చెప్పుకొచ్చారు. చంద్రబాబు, లోకేశ్, ఇంకెవరు వచ్చినా గుడివాడను వదిలి వెళ్లేదే లేదని తేల్చేశారు.

కొడాలి నానికి ఈసారి ఎలాగైనా చెక్ పెట్టాలనుకుంటోంది టీడీపీ. గత ఎన్నికల్లో దేవినేని అవినాశ్ ను ఇక్కడి నుంచి బరిలోకి దింపింది. స్వల్ప మెజారిటీతో దేవినేని అవినాశ్ ఓడిపోయారు. అయితే ఇప్పుడు దేవినేని అవినాశ్ కూడా వైసీపీ గూటికి చేరిపోయారు. దీంతో సరైన నాయకుడికోసం టీడీపీ అన్వేషిస్తోంది. రావి వెంకటేశ్వర రావు ఎంతోకాలంగా ఇక్కడ పార్టీని నమ్ముకుని పనిచేస్తున్నారు. అయితే కొడాలి నానిని ఎదుర్కొనేందుకు రావి వెంకటేశ్వర రావు స్టామినా సరిపోదనే భావన టీడీపీ అధిష్టానానికి ఉంది. రావి వెంకటేశ్వ రావు కూడా తన కంటే మంచి నాయకుడు వస్తే తాను సంపూర్ణంగా సహకరిస్తానని చెప్తున్నారు. దీంతో ఇక్కడ నానికి చెక్ పెట్టే సత్తా ఉన్న నాయకుడి అన్వేషణలో ఉన్న టీడీపీకి ఎన్నారై వెనిగళ్ల రాము తగిలారు.

విజయవాడ ఎంపీ కేశినాని నాని సోదరుడు చిట్టికి వెనిగళ్ల రాము సన్నిహితుడు. వారిద్దరూ పలు వ్యాపారాల్లో భాగస్వాములని సమాచారం. విదేశాల్లో కూడా పలు సాఫ్ట్ వేర్ కంపెనీలు రాముకు ఉన్నట్టు తెలుస్తోంది. పైగా ఆర్థికంగా బలమైన వ్యక్తి కావడం, స్థానికంగా వారి కుటుంబం కొంతకాలంగా స్వచ్చంధసంస్థ నిర్వహిస్తూ ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోంది. వెనిగళ్ల రాము కూడా డిసెంబర్ నుంచి గుడివాడలోనే పూర్తిగా మకాం వేసి పార్టీ బలోపేతానికి పనిచేయబోతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కొడాలి నాని రియాక్షన్ ఎలా ఉంటుందనే ఆసక్తి అందరికీ ఏర్పడింది. ఇదే అంశంపై కొడాలి నాని మీడియాతో మాట్లాడారు.

గుడివాడలో తనకు తిరుగు ఉండదని.. తనపై ఎవరు పోటీ చేసినా భయపడే ప్రసక్తే లేదని కొడాలి నాని తేల్చి చెప్పారు. తనను ఓడించేందుకు టీడీపీ ఎన్ని కుయుక్తులు చేసినా ప్రజలు తనవైపే ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. తనపై చంద్రబాబు, లోకేశ్ పోటీ చేసినా.. తాను వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉంటానని స్పష్టం చేశారు. డబ్బు, ఎన్నారైలు, రాజకీయ విశ్లేషకులు గెలుపును నిర్ణయించలేరన్న నాని.. ప్రజలే న్యాయ నిర్ణేతలని చెప్పారు. గుడివాడ ప్రజలు డబ్బులకు అమ్ముడుపోయే వ్యక్తులు కాదన్నారు. కులసంఘాలు పెట్టి వేల కోట్లు డబ్బులు వెచ్చించినా తన గెలుపును ఆపలేరని కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు.

 

Tags :
ii). Please add in the header part of the home page.