తెలంగాణలో తిష్ట వేసిన ఐటీ, ఈడీ, సీబీఐ, సిట్..! నేతల్లో వణుకు..!!

తెలంగాణలో తిష్ట వేసిన ఐటీ, ఈడీ, సీబీఐ, సిట్..! నేతల్లో వణుకు..!!

తెలంగాణలో ఏం జరుగుతోందో ఎవరికీ అర్థం కావట్లేదు.. ఒకరిపై ఈడీ దాడులంటారు.. ఇంకొకరిపై సీబీఐ రైడ్స్ అంటారు.. మరొకరిపై సిట్ దర్యాప్తు అంటారు.. ఇంకొకరిపై ఐటీ సోదాలంటారు.. ఎప్పుడు ఎవరిపై ఎక్కడ దాడులు జరుగుతాయో తెలియని అయోమయ పరిస్థితి. ఓ వైపు రాజకీయం.., మరోవైపు ఈ సోదాలతో తెలంగాణ మొత్తం హీటెక్కింది. రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు వణికిపోతున్నారు. ఏ రూపంలో ఎవరిపై దాడి జరుగుతుందోనని బెంబేలెత్తిపోతున్నారు. అందుకే కిమ్మనకుండా లోలోపలే మధనపడిపోతున్నారు. మరి ఈ వ్యవహారం ఎప్పటికి కొలిక్కి వస్తుంది..? మున్ముందు ఇంకా ఎవరెవరిపై దాడులు జరిగే అవకాశం ఉంది..? లాంటి అనేక ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణలో వినిపిస్తున్నాయి.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం తెలంగాణ రాజకీయాలను హీటెక్కించిందని చెప్పొచ్చు. ఈ స్కామ్ లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు ఉన్నట్టు సమాచారం రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఢిల్లీలో సీబీఐ దాడుల తర్వాత పలువురిని ప్రశ్నించింది సీబీఐ. సీబీఐ సోదాల్లో ఆర్థిక అవకతవకలు గుర్తించడంతో ఈడీ రంగంలోకి దిగింది. దీంతో ఈడీ తెలంగాణలోనూ అడుగుపెట్టింది. తెలంగాణలోని పలువురు ప్రముఖుల ఇళ్లలో సోదాలు నిర్వహించింది. వీళ్లంతా కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు సన్నిహితులు కావడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ఇలా దాడులు చేస్తోందని అందరూ అనుమానించారు..

ఇంతలోనే ఫామ్ హౌజ్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం వెలుగుచూసింది. తమ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసి తమ సర్కార్ ను కూల్చేందుకు ప్రయత్నించిందని టీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోపించింది. దీనిపై కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్ట్ చేసింది. దీని వెనుక బీజేపీ పెద్దలు ఉన్నారని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయానికొచ్చింది. దీనిపై లోతైన దర్యాప్తు చేయాలంటూ సిట్ ఏర్పాటు చేసింది. సిట్ దూకుడు పెంచడంతో బీజేపీ ప్రముఖుల పేర్లు తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా బి.ఎల్.సంతోష్ నేతృత్వంలోనే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారమంతా జరిగిందని సిట్ కౌంటర్ దాఖలు చేసింది. ఈ వ్యవహారం ఇప్పుడు సంచలనం కలిగిస్తోంది.

బీజేపీకి చెందిన బి.ఎల్.సంతోష్ పేరు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో తెరపైకి రావడం, సిట్ దూకుడు పెంచడంతో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ కూడా జోరు పెంచింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అమిత్ అరోరాను అదుపులోకి తీసుకుని రిమాండ్ రిపోర్ట్ సమర్పించింది. ఇందులో ఎమ్మెల్సీ కవిత పేరును ప్రస్తావించింది. ఇదిప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది.. అయితే ఎన్నికలు సమీపిస్తుండడంతో ఈడీని రంగంలోకి దించడం మోడీకి కామనేనని కవిత ఆరోపించారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని.. వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు..

మరోవైపు టీఆర్ఎస్ నేత, మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన విద్యాసంస్థలు, ఆఫీసులు, ఇళ్లలో ఐటీ దాడులు కూడా కలకలం రేపాయి. ముఖ్యంగా మెడికల్ సీట్లలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలై ఐటీ దాడులు జరిగినట్లు సమాచారం. అంతేకాక సుమారు వంద కోట్ల రూపాయల మేర అక్రమ నగదునుకు కూడా స్వాధీనం చేసుకున్నట్టు ఐటీ వర్గాలు చెప్తున్నాయి. అయితే టీఆర్ఎస్ సర్కార్ పై కక్షసాధింపు చర్యల్లో భాగంగానే తమపై దాడులు జరుగుతున్నాయని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. అన్నీ కేసీఆర్ చూసుకుంటారని.. తగ్గేదే లేదని స్పష్టం చేశారు.

ఇక మరో మంత్రి గంగుల కమలాకర్ ఇళ్లు, ఆఫీసుల పైన కూడా సీబీఐ సోదాలు నిర్వహించింది. మంత్రి గంగుల కమలాకర్ ప్రముఖ గ్రానైట్ వ్యాపారి. గ్రానైట్ అంశానికి సంబంధించి అనేక అవకతవకలు జరుగుతున్నాయంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చాలా నెలల క్రితమే సీబీఐకి ఫిర్యాదు చేశారు. అందులో భాగంగానే ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. అంతేకాక నకిలీ ఐఏఎస్ అధికారితో గంగుల కమలాకర్ కు లింకులపైన సీబీఐ నోటీసులు అందించింది. ఇలా ఐటీ, సీబీఐ, ఈడీ, సిట్... లాంటి సంస్థలన్నీ తెలంగాణలో రోజుకో చోట దిగిపోతున్నాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని నేతలు.. ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీ నేతలు వణికిపోతున్నారు.

 

 

Tags :