త్వరలో జగన్ కేబినెట్ విస్తరణ.. ముగ్గురిపై వేటు ఖాయం?

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో త్వరలోనే మరోసారి మార్పులు చేర్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఈ మేరకు సీఎం జగన్ సంకేతాలిచ్చారు. పనితీరు సరిగా లేని మంత్రులను తొలగించేందుకు ఏమాత్రం సంకోచించబోనంటూ ఆయన చేసిన హెచ్చరికలు ఇందులో భాగమేనంటున్నారు పార్టీ నేతలు. కేబినెట్లో పనితీరు ఆధారంగా ఎప్పటికప్పుడు మార్కులేస్తున్నారు జగన్. ఇందులో పనితీరు సరిగాలేని కొందరిని తొలగించి వారి స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పించాలని భావిస్తున్నారు.
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని జగన్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందులో పాల్గొనని ప్రజాప్రతినిధులను జగన్ పలుమార్లు హెచ్చరిస్తూ వస్తున్నారు. అదే సమయంలో ఆ కార్యక్రమాన్ని లైట్ తీసుకున్న మంత్రులకు కూడా వార్నింగ్ ఇచ్చారు. అంతేకాక.. విపక్ష నేతల ఆరోపణలను సరిగా ఎదుర్కోలేకపోవడం, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలం కావడం, ఆరోపణలు.. లాంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకున్న జగన్... కొంతమంది మంత్రులను తొలగించక తప్పదనే నిర్ణయానికి వచ్చారు.
ప్రస్తుతం కేబినెట్లో సగానికి పైగా మంత్రుల పనితీరు సరిగా లేదు. పాలనపై విపక్షాల నుంచి విమర్శలు ఎదురైనప్పుడు వాటిని తిప్పికొట్టలేకపోతున్నారు. ప్రతి అంశాన్నీ హైకమాండ్ చెప్పాల్సి వస్తోంది. అలాంటివాళ్లను చాలాకాలం భరించలేమనే ఫీలంగ్ కు వచ్చేశారు జగన్. ముఖ్యంగా గుడివాడ అమరనాథ్, సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, రోజా, విడదల రజని, దాడిశెట్టి రాజా, ఉషశ్రీ చరణ్, గుమ్మనూరు జయరాం.. తదితర మంత్రుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి ఉన్నట్టు సమాచారం. అయితే సామాజిక సమీకరణాల దృష్ట్యా అందరినీ కాకుండా కొందరిని తొలగించాలనుకుంటున్నారు. చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, దాడిశెట్టి రాజా, విడదల రజని, గుమ్మనూరు జయరాం.. లపై వేటు ఖాయమని భావిస్తున్నారు.
వీరి స్థానంలో కొత్తగా మరికొందరికి స్థానం కల్పిస్తారని సమాచారం. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. వీరిలో కొందరికి కేబినెట్లో స్థానం కల్పించాలనుకుంటున్నారు. ముఖ్యంగా మర్రి రాజశేఖర్ కు కేబినెట్ బెర్త్ ఖాయమని భావిస్తున్నారు. అలాగే తోట త్రిమూర్తులు, కవురు శ్రీనివాసరావు పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఉగాది రోజు లేదా ఆ తర్వాత కేబినెట్ విస్తరణ ఖాయమని సమాచారం.