అద్భుతం..! ఒకే వేదికపై జగన్, చంద్రబాబు..! !

అద్భుతం..! ఒకే వేదికపై జగన్, చంద్రబాబు..! !

ఆంధ్రప్రదేశ్ లో అధికార, ప్రతిపక్షాల మధ్య వైరం ఎలా కొనసాగుతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వైసీపీ, టీడీపీలు రెండూ నవ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయిలో పోట్లాడుకుంటున్నాయి. ప్రతిరోజూ ఆ రెండు పార్టీల నేతల మధ్య ఎక్కడో ఒక చోట ఉద్రిక్త పరిస్థితులు కూడా తలెత్తుతున్నాయి. ఎవరూ వెనక్కు తగ్గట్లేదు. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. ఇప్పుడే రెండు పార్టీల మధ్య ఇలాంటి పరిస్థితి ఉంటే మున్ముందు ఇంకెలా ఉంటుందోననే ఆందోళన ఏపీ ప్రజల్లో ఉంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ అధినేత జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు ఒకే వేదికను పంచుకోబోతున్నారు. వీళ్లిద్దరూ ఒకే వేదికను పంచుకున్న సందర్భాలు ఇటీవలికాలంలో లేవు. కానీ ఇప్పుడు ఆ దృశ్యం కనిపించబోతోంది.

ప్రస్తుతం జీ 20 దేశాల కూటమికి అధ్యక్షత వహిస్తోంది భారత్. వచ్చే ఏడాదిలో ఈ సదస్సు మన దేశంలో జరగనుంది. దీనికి ఇప్పటి నుంచే సన్నాహక సమావేశాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ.. దేశంలోని రాజకీయ పార్టీల అధ్యక్షులతో సమావేశమై అభిప్రాయాలు తెలుసుకోవాలని నిర్ణయించారు. వచ్చే నెల 5వ తేదీన రాజకీయ పార్టీల అధ్యక్షులతో ఢిల్లీలో సమావేశం కానున్నారు ప్రధాని మోదీ. దేశంలోని పలు రాజకీయ పార్టీల నేతలకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు. కాంగ్రెస్ సహా ప్రధాన రాజకీయ పార్టీలన్నింటికీ ఈ ఆహ్వానం అందినట్టు తెలుస్తోంది. ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీకి కూడా ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానం అందింది.

ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే జీ 20 దేశాల సన్నాహక సమావేశం రాష్ట్రపతి భవన్ లో డిసెంబర్ 5న జరగనుంది. ఈ సమావేశానికి హాజరు కావాలని టీడీపీ నిర్ణయించింది. పార్టీ అధినేత చంద్రబాబు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలు ఇప్పటికే వెళ్లడించారు. ఇక వైసీపీ అధినేత జగన్ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారని తెలుస్తోంది. మోదీ అధ్యక్షతన జరిగే ప్రధాన సమావేశం కావడంతో కచ్చితంగా ఈ సమావేశానికి హాజరు కావాలని జగన్ భావిస్తున్నట్టు సమాచారం. పైగా ప్రధాన పార్టీలన్నీ వస్తుండడంతో సమావేశానికి హాజరైతేనే బాగుంటుందనే చర్చ వైసీపీలో నడుస్తోంది. కాబట్టి వైసీపీ అధినేతగా జగన్ కూడా ఈ సమావేశంలో పాల్గొనడం దాదాపు ఖాయమైనట్టే.

ఇదే జరిగితే జగన్ - చంద్రబాబు ఒకే వేదికపై ఆసీనులు కానున్నారు. వీళ్లిద్దరూ కలిసి ఒకే వేదికను పంచుకోవడం ఇటీవలికాలంలో బహుశా ఇదే తొలిసారి కావచ్చు. 2014లో ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడు రాజధాని అమరావతి శంకుస్థాపనకు ప్రతిపక్షనేతగా ఉన్న జగన్ కు ఆహ్వానం పంపించారు. కానీ జగన్ ఆ కార్యక్రమానికి దూరంగా ఉండిపోయారు. ఆ తర్వాత వీళ్లిద్దరూ అసెంబ్లీలో తప్ప ఒకే వేదికపై కనిపించలేదు. గతంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణ కమిటీ సమావేశంలో ప్రధానితో చంద్రబాబు భేటీ అయ్యారు. జగన్ కూడా ఈ సమావేశానికి హాజరైనా వేర్వేరు సమయాలు కావడంతో వీళ్లిద్దరూ ఒకే వేదికపై దర్శనమివ్వలేదు. కానీ ఇప్పుడు జరగబోయే పార్టీ అధ్యక్షుల సమావేశంలో నేతలంతా ఒకే వేదికపై కనిపించబోతున్నారు. మరి వీళ్ల స్థానాలు ఎక్కడుంటాయో.. ఇద్దరూ పలకరించుకుంటారో లేదో.. వేచి చూడాలి.

 

 

Tags :
ii). Please add in the header part of the home page.