MKOne TeluguTimes-Youtube-Channel

కర్నాటకలో పక్కచూపులు చూస్తున్న బీజేపీ!

కర్నాటకలో పక్కచూపులు చూస్తున్న బీజేపీ!

కర్నాటక ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార బీజేపీ, కాంగ్రెస్ ఈసారి సీఎం పీఠం కోసం సీరియస్ గా ఫైట్ చేస్తున్నాయి. గతంలో తమ నుంచి లాక్కొన్న సీఎం పీఠాన్ని ఈసారి దర్జాగా చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ గట్టి పట్టుదలతో ఉంది. అయితే తమ దగ్గరున్న అన్ని అస్త్రాలను ప్రయోగించయినా అధికార పీఠాన్ని కాపాడుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇక తామే కింగ్ మేకర్ అవుతానని జేడీఎస్ నమ్మకంగా ఉంది. ఇలా త్రిముఖ పోటీలో అధికారానికి చేరువయ్యేదెవరు..?

దక్షిణ భారతదేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన ఏకైక రాష్ట్రం కర్నాటక. ఇప్పుడు కూడా అక్కడ ఆ పార్టీనే అధికారంలో ఉంది. మరో రెండు నెలల్లో జరిగే ఎన్నికల్లో మరోసారి నెగ్గాలని కమలం పార్టీ ప్రయత్నిస్తోంది. గతంలో కాంగ్రెస్, జేడీఎస్ లను చీల్చి పాలనా పగ్గాలను చేపట్టింది బీజేపీ. ఇప్పుడు అలా కాకుండా సొంతంగానే మ్యాజిక్ ఫిగర్ దాటాలనుకుంటోంది. అయితే ప్రీపోల్ సర్వేలన్నీ కమలం పార్టీకి ఈసారి గట్టి షాక్ తగలడం ఖాయమని చెప్తున్నాయి. దీంతో కమలం పార్టీ ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది.

సొంతంగా ఈసారి కూడా అధికారంలోకి రావడం కలేనని బీజేపీకి అర్థమైంది. అందుకే తమ పార్టీకి లబ్ది చేకూరేలా ఇతరత్రా మార్గాలను అన్వేషిస్తోంది బీజేపీ. ఇప్పటికే గాలి జనార్ధన్ రెడ్డి పార్టీని బీజేపీయే రంగంలోకి దింపిందనే ఊహాగానాలు ఉన్నాయి. బళ్లారి ఏరియాలో వీలైనన్ని సీట్లను చీల్చి లబ్ది పొందాలనుకుంటోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే తమకే లాభమని బీజేపీ నమ్ముతోంది. అయితే బీజేపీ, గాలి పార్టీల కొట్లాట తమకే మేలు చేస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఏదేమైనా గాలి పార్టీ ద్వారా తమకు 10-15 సీట్లు కలిసొస్తాయని బీజేపీ అనుకుంటోంది. అయితే గాలి పార్టీకి 2-3 సీట్లకు మించి వచ్చే ఛాన్స్ లేదంటున్నాయి సర్వేలు.

మరోవైపు గోడమీద పిల్లివాటం ప్రదర్శించే జేడీఎస్ ను చివరి నిమిషంలో తమ దగ్గరకు చేర్చుకోవాలనుకుంటోంది బీజేపీ. మ్యాజిక్ ఫిగర్ ను చేరుకోని పక్షంలో జేడీఎస్ మద్దతు తీసుకుని సీఎం కుర్చీ కైవసం చేసుకోవాలనుకుంటోంది. అయితే గతంలో తన సీఎం సీటును కబ్జా చేసింది బీజేపీయేనని కుమారస్వామికి తెలుసు. అందుకే తనకు సీఎం సీటు ఎవరిస్తే వాళ్లకే జైకొట్టేందుకు కుమారస్వామి సిద్ధమయ్యారు. మరి బీజేపీ దీనికి ఓకే అంటుందా..? లేదంటే కేంద్రంలోని అస్త్రాలను ప్రయోగించడం ద్వారా అందరినీ తమ దారికి తెచ్చుకుంటుందా..?

 

 

Tags :