టీఆర్ఎస్ కు ఐప్యాక్ మూడంచెల వ్యూహం..! రంగంలోకి దిగిన కేసీఆర్..!!

టీఆర్ఎస్ కు ఐప్యాక్ మూడంచెల వ్యూహం..! రంగంలోకి దిగిన కేసీఆర్..!!

ఐప్యాక్ తో టీఆర్ఎస్ తో తెగదెంపులు చేసుకుందని.. ఇప్పుడు కేసీఆర్ - ప్రశాంత్ కిశోర్ కలిసి పనిచేయట్లేదని చాలా వార్తలు వచ్చాయి. మునుగోడు ఉపఎన్నిక సమయంలో ఐప్యాక్ టీమ్ అక్కడి నుంచి ఏపీకి మకాం మార్చేసిందని జోరుగా ఊహాగానాలు వినిపించాయి. అయితే అది నిజం కాదనేది తాజా సమాచారం. ఇప్పటికీ టీఆర్ఎస్ కు ప్రశాంత్ కిశోర్ కు చెందిన ఐప్యాక్ సేవలందిస్తోందని తెలుస్తోంది. అందులో భాగంగానే ఎప్పటికప్పుడు నివేదికలను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు అందిస్తోందని.. దానికి తగ్గట్టు ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. తాజాగా కేసీఆర్ కు ఐప్యాక్ టీమ్ ఒక నివేదిక ఇచ్చిందని.. దీని ప్రకారం మూడంచల వ్యూహంతో కేసీఆర్ అడుగులు వేయబోతున్నారని తెలుస్తోంది.

ఎన్నికల మేనేజ్మెంట్ లో ఐప్యాక్ కు ఎంతో పేరుంది. దేశవ్యాప్తంగా పలు పార్టీలను అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ఆ టీమ్ కు ఉంది. ఇప్పుడు తెలంగాణలో కూడా టీఆర్ఎస్ కు ఐప్యాక్ టీమ్ సేవలందిస్తున్నట్టు సమాచారం. మునుగోడు ఉపఎన్నిక తర్వాత ఐప్యాక్ తెలంగాణ వ్యాప్తంగా సర్వే చేసి నివేదికను కేసీఆర్ ముందు ఉంచినట్టు తెలుస్తోంది. కచ్చితంగా గెలిచే స్థానాలు, కష్టపడితే గెలిచే స్థానాలు, మరీ బలహీనంగా ఉన్న స్థానాలు.. ఇలా నియోజకవర్గాలను విభజించి నివేదించినట్టు సమాచారం. దీని ప్రకారం 40 స్థానాల్లో టీఆర్ఎస్ కు తిరుగులేదని తెలుస్తోంది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఈ 40 స్థానాల్లో గెలుపు పక్కా అనే నిర్ణయానికి వచ్చింది ఐప్యాక్. ఇక్కడ ఎమ్మెల్యేలను మార్చాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎమ్మెల్యేల పనితీరు కూడా బాగుందని నిర్ధారించినట్టు తెలుస్తోంది.

ఇక.. 35 స్థానాల్లో పార్టీ పటిష్టంగా ఉన్నా అది సరిపోదని ఐప్యాక్ తేల్చినట్లు సమాచారం. ఇక్కడ కాస్త గట్టిగా కృషి చేస్తే టీఆర్ఎస్ విజయం సాధించే అవకాశాలున్నాయని నివేదించినట్టు తెలుస్తోంది. ఈ స్థానాల్లో కొన్నిచోట్ల నేతలు బలహీనంగా ఉండడం, ప్రత్యర్థులు బలంగా ఉండడం.. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు ఇంకూ పూర్తిస్థాయిలో అందకపోవడం లాంటి కారణాలను ఐప్యాక్ గుర్తించింది. అయితే వీటిని  సరిదిద్దుకోవడం తేలికేనని.. ఆ పని చేయగలిగితే ఇక్కడ కూడా విజయం సాధ్యమవుతుందని నిర్ధారించింది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చడం, కొత్తవారికి అవకాశం ఇవ్వడంతో పాటు పార్టీ ఇన్ ఛార్జ్ లను కూడా మార్చాల్సి ఉంటుందని సూచించింది. ఇక మిగిలిన స్థానాల్లో టీఆర్ఎస్ విజయం అంత ఈజీ కాకపోవచ్చని కూడా ఐప్యాక్ వెల్లడించినట్టు తెలుస్తోంది.

ఐప్యాక్ నివేదికలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పలు మార్పులు, చేర్పులు చేయబోతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే పార్టీ ఇన్ ఛార్జ్ లను మార్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. అంతేకాక.. నియోజకవర్గాలను 3 గ్రూపులుగా విభజించి కేటీఆర్, హరీశ్ రావు, కవితలకు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఈ టీమ్ లు పనిచేసేలా క్షేత్రస్థాయి ప్రణాళికలను కూడా వీరికి అందించే అవకాశం ఉంది. వీరి కింద మంత్రులు, పలువురు కీలక నేతలకు కూడా బాధ్యతలు అప్పగించనున్నారు. వారి నేతృత్వంలో క్షేత్రస్థాయిలో లీడర్లు పనిచేసేలా టీమ్ ను విభజించబోతున్నారు. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. అందుకోసం ఇప్పటి నుంచి గ్రౌండ్ లోకి దిగబోతున్నారు.

 

 

Tags :
ii). Please add in the header part of the home page.