కేసీఆర్‌కు కుమారస్వామి హ్యాండివ్వడం వెనుక భారీ స్కెచ్..!

కేసీఆర్‌కు కుమారస్వామి హ్యాండివ్వడం వెనుక భారీ స్కెచ్..!

దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించి సత్తా చాటాలనుకుంటున్నారు కేసీఆర్. అందులో భాగంగా టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చేశారు. బీఆర్ఎస్ కు మొదట మద్దతు తెలిపింది జేడీఎస్ నేత కుమారస్వామి. జాతీయ రాజకీయ ప్రస్థానంపై మొదట కేసీఆర్ చర్చించింది కూడా కుమారస్వామితోనే. అప్పటి నుంచి బీఆర్ఎస్ ఆవిర్భావం వరకూ కేసీఆర్ ప్రతి అడుగులోనూ కుమారస్వామి కనిపిస్తూ వచ్చారు. అయితే బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు మాత్రం కుమారస్వామి డుమ్మా కొట్టారు. ఇంతకూ కేసీఆర్ కు, కుమారస్వామికి మధ్య ఏం జరిగింది..?

మరి కొన్ని నెలల్లో కర్నాటకలో ఎన్నికలు జరగబోతున్నాయి. అన్ని పార్టీలూ అక్కడ హోరాహోరీ తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా కర్నాటక నుంచే తన జాతీయ రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాలనుకున్నారు. తెలంగాణకు పొరుగునే ఉన్న కర్నాటకలో ఎక్కువ ఓట్లు, సీట్లు సాధించేందుకు అవకాశం ఉందని కేసీఆర్ అంచనా వేశారు. ఒంటరిగే వెళ్తే కర్నాటకలో సత్తా చాటలేమని గ్రహించిన కేసీఆర్.. అక్కడ ప్రభావం చూపగల పార్టీలతో పొత్తు పెట్టుకోవాలనుకున్నారు. బీజేపీ, కాంగ్రెస్ లకు సమానదూరం పాటించాలనుకుంటున్న కేసీఆర్ కు .. జేడీఎస్ ఆశాకిరణంలా కనిపించింది. అందుకే బెంగళూరు వెళ్లి జేడీఎస్ అగ్రనేతలు దేవెగౌడ, కుమారస్వామిని కలిసి తన ప్రతిపాదన ముందుంచారు. ఇందుకు వాళ్లు కూడా అంగీకరించడంతో కర్నాటకలో జేడీఎస్, బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయని అందరూ భావించారు.

అయితే అనూహ్యంగా జేడీఎస్, బీఆర్ఎస్ మధ్య గ్యాప్ వచ్చేసింది. ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు జేడీఎస్ నేత కుమారస్వామి రాలేదు. బీఆర్ఎస్ నేతలు కూడా కుమారస్వామికి ఆహ్వానం పంపినట్లు ఎక్కడా చెప్పలేదు. ముగ్గురు ముఖ్యమంత్రులు, ఒక మాజీ ముఖ్యమంత్రి వస్తున్నారని మాత్రమె చెప్తూ వచ్చారు. ఎక్కడా కుమారస్వామి పేరు కూడా ప్రస్తావించలేదు. దీన్ని బట్టి బీఆర్ఎస్ కూడా కుమారస్వామిని లైట్ తీసుకున్నట్టు అర్థమవుతోంది. అయితే కేసీఆర్ కు వెన్నంటి ఉన్న కుమారస్వామి చివరి నిమషంలో ఎందుకు హ్యాండ్ ఇచ్చారనేది ఆసక్తి కలిగిస్తోంది.

కర్నాటక ఎన్నికల్లో జేడీఎస్, బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయని అందరూ భావించారు. ఆర్థికంగా బలహీనంగా ఉన్న జేడీఎస్ ను కేసీఆర్ ఆదుకుంటారని.. అందుకోసం జేడీఎస్ కొన్ని సీట్లను త్యాగం చేస్తుందని అంచనా వేశారు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ తో పొత్తుపై జేడీఎస్ మాట మాట్లాడట్లేదు. పైగా 92 సీట్లలో అభ్యర్థులను కూడా ప్రకటించేశారు కుమారస్వామి. దీన్ని బట్టి పొత్తు లేనట్టేనని అర్థమవుతోంది. కర్నాటకలో ఈసారి పూర్తి మెజారిటీ ఎవరికీ రాదని.. కాంగ్రెస్ ఎక్కువ సీట్లు సాధిస్తుందని సర్వేలు చెప్తున్నాయి. ఇలాంటి సమయంలో జేడీఎస్ కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉంది. గతంలో కూడా చాలాసార్లు జేడీఎస్ కింగ్ మేకర్ పాత్ర పోషించింది. అందులో బాగంగా కుమారస్వామి సీఎం అయ్యారు. ఈసారి కూడా అదే సీన్ రిపీట్ అవుతుందనే ఫీలింగ్ కుమారస్వామికి ఉంది. అందుకే కాంగ్రెస్, బీజేపీని కాదని బీఆర్ఎస్ తో వెళ్తే అసలుకే మోసం వస్తుందని భావించారు కుమారస్వామి. అలా కాకుండా ఒంటరిగా వెళ్లి తగినన్ని సీట్లు సాధించి.. కాంగ్రెస్, బీజేపీలలో ఎవరు తనకు మంచి ఆఫర్ ఇస్తే వాళ్లతో వెళ్లాలని కుమారస్వామి అనుకుంటున్నారు. అందుకే కేసీఆర్ కు కటీఫ్ చెప్పారు. 

 

 

Tags :