MKOne TeluguTimes-Youtube-Channel

ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబును జగన్ ఎదుర్కోగలరా..?

ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబును జగన్ ఎదుర్కోగలరా..?

ఆంధ్రప్రదేశ్ లో శాసన మండలి ఎన్నికలు రసవత్తరంగా మారాయి. స్థానిక సంస్థల ఎన్నికల కోటా ఎమ్మెల్సీ సీట్లను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అలాగే టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలను కూడా అధికార పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థులే గెలిచారు. కానీ పట్టభద్రుల స్థానాల్లో మాత్రం వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఇప్పుడు ఇదే ఉత్సాహంతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోవాలనుకుంటోంది టీడీపీ.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైసీపీకి భారీ మెజారిటీ ఉంది. ఇప్పుడు జరుగుతున్న 7 ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకునేంత సంఖ్యాబలం ఆ పార్టీకి పుష్కలంగా ఉంది. అయినా టీడీపీ తమ పార్టీ తరపున అభ్యర్థిని బరిలోకి దింపింది. ఆ పార్టీ నేత పంచుమర్తి అనురాధను ఎన్నికల్లో నామినేషన్ వేయించింది. దీంతో ఎన్నిక అనివార్యమైంది. అయితే టీడీపీకి తగినంత సంఖ్యాబలం లేకపోయినా ఎందుకు అభ్యర్థిని బరిలోకి దింపిందనేది అంతుచిక్కడం లేదు.

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా గెలుపొందాలంటే ఒక్కో అభ్యర్థికి 22 మంది ఓటేయాలి. టీడీపీ తరపున గత ఎన్నికల్లో 23 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. వారిలో నలుగురు అధికార పార్టీలోకి వెళ్లిపోయారు. దీంతో 19 మంది మాత్రమే మిగిలారు. వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలతో పాటు టీడీపీ నుంచి వచ్చిన నలుగురి మద్దతు కూడా ఉంది. అయితే వైసీపీ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఆ పార్టీకి దూరమయ్యారు. వీళ్లిద్దరూ టీడీపీకి ఓటేస్తే ఆ పార్టీ బలం 21కి చేరుతుంది. మరో వైసీపీ ఎమ్మెల్యే టీడీపీకి ఓటేస్తే ఆ పార్టీ గెలిచినట్లే.

వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారంటూ టీడీపీ ఎమ్మెల్యే చినరాజప్ప చేసిన కామెంట్స్ ఇప్పుడు అధికార పార్టీకి గుబులు పుట్టిస్తున్నాయి. పొరపాటున ఎవరో ఒకరు ఓటు అటేస్తే అధికార పార్టీ పరువు పోవడం ఖాయం. టీడీపీకి అది ఘన విజయం కింద లెక్క. ఒకవేళ టీడీపీ ఓడిపోయినా ఆ పార్టీకి పెద్దగా కలిగే నష్టం లేదు. కానీ గెలిస్తే మాత్రం వైసీపీకి తీవ్ర పరాభవం కిందే లెక్క. ఎన్నికల మేనేజ్ మెంట్ లో సిద్ధహస్తుడైన చంద్రబాబును జగన్ ఈ ఎన్నికను ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

 

 

Tags :