క్రాస్ రోడ్స్‌లో పవన్ కల్యాణ్..! తుది పయనం ఎటో..?

క్రాస్ రోడ్స్‌లో పవన్ కల్యాణ్..! తుది పయనం ఎటో..?

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. కానీ అక్కడ పార్టీలు మాత్రం ఇప్పటి నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభించేసినట్లు కనిపిస్తోంది. అధికార వైసీపీ పాలనలో భాగంగా పలు కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తోంది. అటు ప్రభుత్వ కార్యక్రమాలను, ఇటు పార్టీ వ్యూహాలను ఏక కాలంలో అమలు చేస్తూ దూసుకెళ్తోంది. మరోవైపు టీడీపీ కూడా ఈ మధ్య దూకుడు పెంచింది. పార్టీ అధినేత చంద్రబాబు ఇదేం ఖర్మ పేరుతో కొత్త ప్రోగ్రామ్ చేపట్టారు. పార్టీ శ్రేణులన్నీ ఈ ప్రోగ్రామ్ ద్వారా ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా తన పాలిటిక్స్ ను స్పీడప్ చేసినట్లు కనిపిస్తోంది. ఒకవైపు సినిమా షూటింగుల్లో పాల్గొంటున్నా... రాజకీయాలకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. విశాఖ గర్జన తర్వాత పవన్ దూకుడు మరింత పెరిగిందని అర్థమవుతోంది. అయితే కార్యక్రమాల్లోనే కాదు.. మాటల తూటల్లోనూ పవన్ జోరు పెరిగింది. బీజేపీతో సంబంధం లేకుండా తాను ఒంటరిగా తేల్చుకునేందుకు సిద్ధమయ్యానంటూ ఆయన తాజాగా చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆసక్తి కలిగిస్తున్నాయి.

విశాఖ గర్జన రోజు పవన్ ను నిర్బంధించడంతో ఆయనలో ఎక్కడలేని కోపం వచ్చేసింది. అప్పటి నుంచి ఆయన వైసీపీ ప్రభుత్వంపై ఒంటికాలిపై లేస్తున్నారు. వైసీపీ నేతలను తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. అదే సమయంలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. విశాఖలో రుషికొండను సందర్శించారు. అనంతరం విజయనగరం జిల్లాలో జగనన్న కాలనీలను పరిశీలించారు. ఇక ఇప్పటంలో రెండుసార్లు పర్యటించిన పవన్.. తాను అండగా ఉంటానని బాధితులకు హామీ ఇచ్చారు. వైసీపీని ఢీకొట్టేది జనసేనే అంటూ ప్రకటనలు చేస్తున్నారు. వైసీపీని గద్దె దించడమే లక్ష్యమని పదే పదే ప్రకటిస్తున్నారు.

ఇప్పటం బాధితులకు ఆర్థిక సాయం చేసే సమయంలో పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. వైసీపీ నాయకులు ఇప్పటం వాసుల ఇళ్లు కూల్చారని.. వైసీపీ నేతల ఇళ్లు కూల్చేవరకూ జనసేన నిద్రపోదని శపథం చేశారు. వైసీపీని దెబ్బ కొట్టేందుకు బీజేపీ పర్మిషన్ అవసరం లేదని.. ప్రధానికి, బీజేపీ నేతలకు చెప్పి ఈ పని చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. అంటే బీజేపీతో సంబంధం లేకుండా పవన్ ఒంటరిగా వెళ్లనున్నారా ఆనే ఊహాగానాలకు మరోసారి తెలలేచినట్లయింది. బీజేపీతో జనసేన దూరం కావడం ఖాయమని.. పవన్ కల్యాణ్ కచ్చితంగా టీడీపీతో కలిసి ముందుకెళ్తుందని అందరూ భావిస్తూ వస్తున్నారు. అయితే ప్రధాని విశాఖ పర్యటనలో మోదీని కలిసిన తర్వాత పవన్ కల్యాణ్ బీజేపీతోనే కలిసి ఉంటారని.. ఆ మేరకు డీల్ సెట్ అయిందని ఊహాగానాలు వినిపించాయి. అయితే ఇప్పుడు పవన్ కల్యాణ్ మళ్లీ బీజేపీ మాట ఎత్తడంతో గందరగోళం నెలకొంది.

ఒక్కటి మాత్రం నిజం. ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తనను వైసీపీ నేతలు వ్యక్తిగతంగా పదే పదే కించపరిచేలా విమర్శిస్తుండడం ఆయనకు కోపం తెప్పిస్తోంది. అందుకే చెప్పు చూపించి మరీ వార్నింగ్ ఇచ్చారు వైసీపీ నేతలకు. ఎలాగైనా వైసీపీని ఓడించాలని.. వైసీపీ నేతల నోళ్లు మూయించాలని పవన్ కల్యాణ్ గట్టిగా కోరుకుంటున్నారు. అయితే బీజేపీతో కలిసి వెళ్తే వైసీపీని ఓడించడం సాధ్యమయ్యే పని కాదనే విషయం కూడా ఆయనకు తెలుసు. ఆయన టీడీపీతో కలిసి వెళ్లేందుకే మొగ్గు చూపొచ్చు. జనసేన శ్రేణులు కూడా ఇదే కోరుకుంటున్నాయి. అయితే బీజేపీ నుంచి పవన్ కల్యాణ్ కు ఊహించని హామీ ఏదైనా వస్తే తప్ప ఆయన కమలంతో కలిసి ప్రయాణించడం కష్టమేనని అర్థమవుతోంది. మరి చూడాలి ఎన్నికల ముందు ఏం జరుగుతుందో..!

 

 

Tags :