బీజేపీతోనే జనసేన..! టీడీపీకి పవన్ కల్యాణ్ హ్యాండ్ ఇచ్చినట్లేనా..?

బీజేపీతోనే జనసేన..! టీడీపీకి పవన్ కల్యాణ్ హ్యాండ్ ఇచ్చినట్లేనా..?

2024 ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలనుకుంటున్నారు పవన్ కల్యాణ్. వైసీపీ సర్కార్ ను గద్దె దించడమే ఏకైక లక్ష్యమని ఆయన పలు సందర్భాల్లో చెప్తూ వస్తున్నారు. జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తోందని.. జోక్యం చేసుకోవాలని కేంద్రానికి కూడా ఆయన ఫిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చాయి. రాష్ట్రంలో తమ పార్టీ నేతలపైన దాడులు చేస్తున్నా.. తన మిత్రపక్షమైన బీజేపీ చూస్తూ ఊరుకుంటోందనే భావన పవన్ కల్యాణ్ లో ఉంది. అందుకే బీజేపీని రోడ్ మ్యాప్ అడిగానని.. అయినా ఆ పార్టీ నుంచి స్పందన లేదని బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. దీంతో ఈసారి పవన్ కల్యాణ్ టీడీపీతో కలిసి పోటీ చేయడం ఖాయమనే నిర్ణయానికి వచ్చారు ఏపీ ప్రజలు. విశ్లేషకులు కూడా ఇది నిజమని భావించారు. కానీ ప్రధాని విశాఖ పర్యటన తర్వాత సీన్ మారినట్టు కనిపిస్తోంది.

ఏపీలో విశాఖ గర్జన తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. గర్జన రోజే పవన్ కల్యాణ్ విశాఖలో పర్యటించారు. అయితే ఆరోజు పవన్ కల్యాణ్ ను పూర్తిగా హోటల్ కే పరిమితం చేశారు పోలీసులు. పూర్తిగా నిర్బంధించారు. దీంతో ఆగ్రహించిన పవన్ కల్యాణ్ మరుసటి రోజు మంగళగిరి చేరుకుని పార్టీ ఆఫీసులో వైసీపీకి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీలోని కాపు నేతలను చెప్పుతో కొడతానని హెచ్చరించారు. విశాఖలో పవన్ కల్యాణ్ పై జగన్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుని నిరసిస్తూ టీడీపీ, బీజేపీ, వామపక్షాలు ఆయనకు సంఘీభావం తెలిపాయి. చంద్రబాబు స్వయంగా పవన్ కల్యాణ్ హోటల్ కు వెళ్లి పరామర్శించారు. దీంతో టీడీపీ - జనసేన మళ్లీ కలిసిపోయాయని.. ఆ రెండు పార్టీలు కలసి ఈసారి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయని అందరూ భావించారు.

ఏపీలో బీజేపీతో కలిసి పని చేస్తున్నారు పవన్ కల్యాణ్. అయితే ఆ రెండు పార్టీల మధ్య సఖ్యత సరిగా లేదు. రెండు పార్టీలూ కలిసి ఉద్యమించిన సందర్భాలు కూడా లేవు. పైగా వైసీపీతో బీజేపీ సన్నిహిత సంబంధాలు కలిగి ఉంది. జగన్ సర్కార్ తమను అణచివేస్తున్నా బీజేపీ పట్టించుకోవట్లేదనే ఫీలింగ్ పవన్ కల్యాణ్ కు ఉంది. అంతేకాక వైసీపీని ఓడించాలంటే బీజేపీతో కలసి వెళ్తే సాధ్యమయ్యే పని కాదని జనసేన శ్రేణులు భావిస్తున్నాయి. టీడీపీతో కలిసి వెళ్తే కొన్ని సీట్లయినా గెలిచే అవకాశం ఉంది. ఒకవేళ వైసీపీ ఓడిపోతే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉంటుంది. అందుకే బీజేపీకి గుడ్ బై చెప్పి టీడీపీతో కలసి వెళ్లాలని జనసేన శ్రేణులు పవన్ కల్యాణ్ కు చెప్తూ వచ్చాయి. పవన్ కల్యాణ్ కూడా ఇదే బెటర్ అనే అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

అయితే ప్రధాని మోదీ విశాఖ పర్యటన తర్వాత పవన్ కల్యాణ్ వ్యూహం మారినట్టు తెలుస్తోంది. ప్రధాని మోదీని విశాఖలో కలవాలంటూ పవన్ కల్యాణ్ కు పీఎంఓ ఆహ్వానం పంపింది. దీంతో పవన్ కల్యాణ్ హుటాహుటిన విశాఖ వెళ్లి మోదీతో సమావేశమయ్యారు. సుమారు అరగంట పాటు వీరిద్దరి భేటీ జరిగింది. ఈ భేటీలో ఏం జరిగిందనేది బయటకు ఎవరూ చెప్పలేదు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై మాట్లాడినట్టు పవన్ కల్యాణ్ చెప్పారు. త్వరలో ఏపీకి మంచి రోజులొస్తాయని ప్రధాని చెప్పినట్టు పవన్ వెల్లడించారు. అయితే వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కాకుండా బీజేపీతోనే కలిసి పని చేయాలని పవన్ కు సూచించినట్లు తెలుస్తోంది. అంతేకాక చిరంజీవిని మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి తీసుకు వచ్చి బీజేపీ - జనసేన సీఎం అభ్యర్థిగా ఎన్నికల బరిలో దూకాలని సలహా ఇచ్చినట్టు సమాచారం. పవన్ - చిరంజీవి - బీజేపీ కలిస్తే కచ్చితంగా ఏపీలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని చెప్పినట్టు ఉహాగానాలు వినిపిస్తున్నాయి. చిరంజీవి సేవలను కేంద్ర స్థాయిలో కూడా వాడుకుంటామని పవన్ కు చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో పవన్ కల్యాణ్ వ్యూహం మారిందని తెలుస్తోంది. మరి చూడాలి ఈ వ్యూహం నిజమవుతుందో లేదో..!

 

Tags :
ii). Please add in the header part of the home page.