ట్విస్ట్ లు ఇస్తున్న పొంగులేటి..! బీజేపీకి హ్యాండ్..?

ట్విస్ట్ లు ఇస్తున్న పొంగులేటి..! బీజేపీకి హ్యాండ్..?

తెలంగాణ పాలిటిక్స్ లో కొంతకాలంగా హాట్ టాపిక్ గా మారారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి. అధికార బీఆర్ఎస్ పార్టీ ఆయన్ను పూర్తిగా పక్కన పెట్టేసింది. ఆయన కూడా ఆ పార్టీ కార్యక్రమాలకు చాలాకాలం నుంచి దూరంగానే ఉంటున్నారు. దీంతో ఆయన భవిష్యత్ ఏంటనేది ఆసక్తి కలిగిస్తోంది. వచ్చే ఎన్నికల్లో తనతో పాటు తన అనుచరులంతా బరిలో దిగుతారని ఇప్పటికే పొంగులేటి ప్రకటించారు. అయితే ఏ పార్టీ నుంచి వీళ్లు బరిలోకి దిగుతారనేది ఆసక్తి కలిగిస్తోంది. బీజేపీ లో చేరడం ఖాయమైపోయిందని ఇన్నాళ్లూ జోరుగా ప్రచారం సాగింది. అయితే ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆయన ఏ పార్టీ కండువా కప్పుకోబోతున్నారు?

పొంగులేటి శ్రీనివాస రెడ్డి 2014లో వైసీపీ తరపున ఎంపీగా గెలిచారు. అయితే రాష్ట్ర విభజనానంతర పరిణామాల నేపథ్యంలో ఆయన అప్పటి టీఆర్ఎస్ లో చేరారు. అయితే 2019లో ఆయనకు సీట్ నిరాకరించింది బీఆర్ఎస్. నామ నాగేశ్వర రావును బరిలోకి దింపింది. అయినా పొంగులేటితో పాటు ఆయన అనుచరగణం మొత్తం బీఆర్ఎస్ కోసం పనిచేసింది. అయితే ఆ తర్వాత పొంగులేటి వర్గాన్ని కేసీఆర్ పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. నాలుగేళ్లయినా కూడా తనకు కానీ, తన వర్గానికి కూడా ఒక్క పదవి కూడా ఇవ్వలేదనే బాధ పొంగులేటికి ఉంది. అందుకే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో ఏదో ఒక కీలక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పొంగులేటి భావించారు. అందుకే బీఆర్ఎస్ నుంచి అధికారికంగా బయటకు రాకపోయినా ఆ పార్టీతో చాలా కాలం నుంచి దూరంగానే ఉంటున్నారు. తాజాగా ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు పొంగులేటికి ఆహ్వానం అందలేదు. పైగా పొంగులేటి పార్టీ మారడం ఖాయమనే ఫీలింగ్ బీఆర్ఎస్ కు ఉంది.

బీఆర్ఎస్ తనను పక్కన పెట్టడంతో ఏదో ఒక కీలక నిర్ణయం తీసుకోవాల్సన సమయం ఆసన్నమైందని పొంగులేటి శ్రీనివాస రెడ్డి భావిస్తున్నారు. వాస్తవానికి ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ రోజే ఢిల్లీలో అమిత్ షాను కలిసి బీజేపీలో చేరుతారని వార్తలు బలంగా వినిపించాయి. అయితే అది జరగలేదు. అసలు బీజేపీలో చేరికపై పొంగులేటి ఎప్పుడూ నోరు తెరవలేదు. అటు బీజేపీ శ్రేణులు కూడా ఎప్పుడు పొంగులేటి తమ పార్టీలో చేరడం ఖాయమని ప్రకటించలేదు. అయితే పొంగులేటి కోసం బీజేపీ తీవ్రంగా శ్రమిస్తోంది. కానీ పొంగులేటి మాత్రం నియోజకవర్గాల వారీగా ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. తన అనుచరుల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. మెజారిటీ అనుచరుల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

అయితే పొంగులేటి శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అవుతున్నారని తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. బీజేపీ కంటే కాంగ్రెస్ లో చేరితేనే పొంగులేటి లాంటి నేతలకు ఎక్కువ ప్రాధాన్యత దక్కుతుందని ఆయన అనుచరులు సూచించినట్లు సమాచారం. బీజేపీలో చేరిన నేతల పరిస్థితులను వాళ్లు ఉదాహరణగా చూపిస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ లో అయితే నేరుగా హైకమాండ్ తో మాట్లాడే అవకాశం ఉంటుందని.. వేరే ఏ పార్టీలో చేరినా ఒకరి కింద పనిచేయాల్సి ఉంటుందని పొంగులేటి భావిస్తున్నట్టు సమాచారం. అందుకే త్వరలోనే ఆయన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోబోతారని ఆయన అనుచరులు చెప్తున్నారు. వచ్చే నెల భద్రాచలం నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ లోపే పొంగులేటి కాంగ్రెస్ లో చేరుతారని తెలుస్తోంది. మరి చూడాలి చివరి నిమిషంలో ఇంకేవైనా ట్విస్టులు బయటికొస్తాయేమో..!

 

 

Tags :