క్రాస్‌రోడ్స్ లో పొంగులేటి..! పార్టీలో చేరికపై డైలమా..!!

క్రాస్‌రోడ్స్ లో పొంగులేటి..! పార్టీలో చేరికపై డైలమా..!!

తెలంగాణ పాలిటిక్స్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి. పొంగులేటికి బీఆర్ఎస్ లో తగిన ప్రాధాన్యం దక్కట్లేదని.. త్వరలోనే ఆయన బీజేపీలో చేరబోతున్నారని వార్తలు వినిపించాయి. ఇందుకు సంక్రాంతి తర్వాత ముహూర్తం కుదిరిందని కథనాలు వెలువడ్డాయి. ఇప్పుడు సంక్రాంతి ముగిసింది.. కానీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. బీజేపీ కూడా దీనిపై స్పందించట్లేదు. దీంతో పొంగులోటి బీజేపీలో చేరుతారా.. లేకుంటే మరేదైనా పార్టీ వైపు చూస్తున్నారా.. అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

ఖమ్మం జిల్లాలో మంచి బలమున్న నాయకుడు పొంగులేటి శ్రీనివాస రెడ్డి. 2014లో వైసీపీ తరపున ఎంపీగా పోటి చేసిన పొంగులేటి శ్రీనివాస రెడ్డి ముగ్గురు ఎమ్మెల్యేలను కూడా గెలిపించుకున్నారు. దీన్ని బట్టి ఆయన సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. దీంతో ఆయన తన అనుచరగణంతో కలిసి బీఆర్ఎస్ లో చేరిపోయారు. అయితే 2018 నాటికి సీన్ రివర్స్ అయింది. సిట్టింగ్ ఎంపీగా ఉన్న పొంగులేటి శ్రీనవాసరెడ్డికి సీట్ దక్కలేదు. తన అనుచరగణానికి కూడా ఆయన న్యాయం చేయలేకపోయారు. జిల్లాలో బీఆర్ఎస్ కు ఒక్క సీటు మాత్రమే దక్కింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తరపున గెలినవారందరినీ పార్టీలోకి లాక్కొని బలపడింది బీఆర్ఎస్.

వాస్తవానికి ఖమ్మం జిల్లాలో అధికార బీఆర్ఎస్ కు అంత బలం లేదు. ఇప్పుడు పొంగులేటి లాంటి నేతలను దూరం చేసుకోవడం ఆ పార్టీకి కచ్చితంగా మైనస్సే. పొంగులేటిని పట్టించుకోకపోవడంతో ఆయన పార్టీకి దూరమయ్యారు. ఇటీవల జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు కూడా పొంగులేటికి ఆహ్వానం అందలేదు. దీంతో ఆయన దూరంగా ఉండిపోయారు. అదే రోజు ఆయన ఢిల్లీలో బీజేపీ అగ్రనేత అమిత్ షాను భేటీ కాబోతున్నారని.. బీజేపీలో చేరబోతున్నారని ఊహాగానాలు వినిపించాయి. అయితే పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఢిల్లీ వెళ్లలేదు.. అమిత్ షాను కలవలేదు. వాస్తవానికి తాను బీజేపీలో చేరబోతున్నట్టు పొంగులేటి ఎప్పుడూ ప్రకటించలేదు. అటు బీజేపీ వైపు నుంచి కూడా అలాంటి సంకేతాలేవీ రాలేదు. దీంతో పొంగులేటి ఎలాంటి వ్యూహం అనుసరించబోతున్నారనేది ఆసక్తి కలిగిస్తోంది.

ప్రస్తుతం పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో విస్తృతంగా తిరుగుతున్నారు. తన అనుచరగణంతో భేటీ అవుతున్నారు. వారి అబిప్రాయాలు సేకరిస్తున్నారు. వాళ్లందరి ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. ఖమ్మంలో బీఆర్ఎస్, బీజేపీలతో పోల్చితే కాంగ్రెస్ కే కాస్తోకూస్తో ఎక్కువ బలం ఉందని చెప్పొచ్చు. బీజేపీలో చేరితే జిల్లాలోని నేతలందరి భారం తనే మోయాల్సి ఉంటుందని పొంగులేటికి తెలుసు. అర్థికంగానే కాక, తన సత్తా నిరూపించుకోవాలంటే ఎక్కువ శ్రమించాల్సి ఉంటుంది. అదే కాంగ్రెస్ పార్టీలో అయితే అంత కష్టపడాల్సిన అవసరం ఉండకపోవచ్చు. బీజేపీ కంటే కాంగ్రెస్ కు మెరుగైన సీట్లు వస్తాయనే నమ్మకం ఉంది. కొంతమంది పొంగులేటి అభిమానులు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నట్టు సమాచారం. అందుకే పొంగులేటి డైలమాలో పడ్డారని తెలుస్తోంది. కేడర్ నుంచి పూర్తిస్థాయిలో అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకునేందుకు పొంగులేటి సిద్ధమైనట్టు చెప్తున్నారు. గతంలో లాగా తొందరపడి అడుగేస్తే.. అక్కడ మళ్లీ ప్రాధాన్యత దక్కకపోతే ఇబ్బందులు పడాల్సి ఉంటుందనే భయం పొంగులేటికి ఉంది. అందుకే ఆచితూచి అడుగులేయాలని నిర్ణయించుకున్నారు.

 

 

Tags :