వాట్ ఈజ్ దిస్ రాహుల్..? ఎలాగైతే ఎలా..!?

వాట్ ఈజ్ దిస్ రాహుల్..? ఎలాగైతే ఎలా..!?

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఫుల్ బిజీగా ఉన్నారు. కన్యాకుమారిలో మొదలైన ఆయన యాత్ర కాశ్మీర్ లో ముగియనుంది. ప్రస్తుతం తమిళనాడు, కేరళ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ దాటి మహారాష్ట్రలో కొనసాగుతోంది. రాహుల్ పాదయాత్రకు విశేష స్పందన లభిస్తోంది. ఆయన యాత్రకు వస్తున్న స్పందన చూసి భవిష్యత్ తమదేననే ధీమాతో ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. అయితే కీలక సమయంలో రాహుల్ కాడి తన్నేశారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. పార్టీకి ఎంతో ప్రతిష్టాత్మకమైన గుజరాత్ ఎన్నికల్లో ప్రచారం చేయకుండా రాహుల్ గాంధీ కేవలం పాదయాత్రకే ప్రయారిటీ ఇవ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఏ పార్టీకైనా ఎన్నికలే గీటురాయి. ఎన్నికల్లో గెలిస్తేనే పార్టీకి మనుగడ. లేకుంటే పార్టీలు బతికి బట్ట కట్టలేవు. కాంగ్రెస్ లాంటి పురాతన పార్టీ ఇప్పుడు ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటోంది. కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ పార్టీ పలు రాష్ట్రాల్లో అధికారం కోల్పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులూ ఒడ్డి పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. ముఖ్యంగా బీజేపీకి గుజరాత్ కంచుకోట. అలాంటి చోట ఎన్నికలు జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మరిన్ని ఆయుధాలు సమకూర్చుకుని పోరాడాలి. పైగా గత ఎన్నికల్లో బీజేపీని దాదాపు ఓడించనంత పని చేసింది కాంగ్రెస్. ఈసారి మరింత గట్టిగా కృషి చేస్తే గుజరాత్ లో అధికారంలోకి రాగలమనే ధీమా ఆ పార్టీ నేతల్లో ఉంది. ఇక్కడ బీజేపీని ఓడిస్తే నైతికంగా కేంద్రంలో ఓడించినట్లేననే ఫీలింగ్ అందరిలో ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ గుజరాత్ లో ఆ స్థాయిలో పోరాడడం లేదన్నది వాస్తవం.

రాహుల్ గాంధీ గుజరాత్ ఎన్నికలను ఏమాత్రం పట్టించుకోవట్లేదని అర్థమవుతోంది. ఆయన పూర్తిగా పాదయాత్రకే పరిమితం అవుతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ ఒక కీలక నేత, ఎంపీ మాత్రమే. పార్టీ పరంగా ఆయనకు కీలక బాధ్యతలు లేవు. అయినా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల చూపులన్నీ ఆయన వైపే ఉంటున్నాయి. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా రాహుల్, సోనియా వైపే చూస్తుంటారనేది అందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ గుజరాత్ లో పర్యటించి ప్రచారం చేస్తే కచ్చితంగా పార్టీకి మేలు జరిగేది. కానీ ఇప్పుడు అలాంటి సంకేతాలేవీ కనిపించకపోవడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశలో మునిగిపోయాయి.

మరోవైపు గుజరాత్ లో గత ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ ను ఈసారి పాతాళానికి తొక్కేయాలని బీజేపీ భావిస్తోంది. అందుకే ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా నేరుగా రంగంలోకి దిగి ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రధాని మూడు నెలలుగా ఇక్కడ 15కు పైగా పర్యటనలు చేశారు. గతంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ప్రధాని, హోంమంత్రి  ఈ స్థాయిలో ప్రచారం నిర్వహించిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు గుజరాత్ లో మాత్రం ఇప్పుడు ఆ ఇద్దరు నేతలు అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ మరింత అప్రమత్తమై టఫ్ ఫైట్ ఇవ్వాల్సింది పోయి లైట్ తీసుకుంటోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ రాహుల్ గాంధీ కూడా మోదీ, అమిత్ షా లాగా ఇక్కడే మకాం వేసి ప్రచారం నిర్వహించి ఉంటే గుజరాత్ లో అధికారం దక్కేదని ఆ పార్టీ నేతలే చెప్తున్నారు. కానీ రాహుల్ గాంధీ మాత్రం ఇది పార్టీ అధ్యక్షుడి వ్యవహారం అన్నట్టు వ్యవహరిస్తున్నారు. గుజరాత్ ఎన్నికలను ఏమాత్రం పట్టించుకోవట్లేదు. ఇలాగైతే ఎలా రాహుల్..?

 

Tags :
ii). Please add in the header part of the home page.