కేంద్ర ఎన్నికల కమిషన్ బూజు దులిపే టైమ్ వచ్చిందా?

కేంద్ర ఎన్నికల కమిషన్ బూజు దులిపే టైమ్ వచ్చిందా?

ఎన్నికల కమిషన్ పై సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఎన్నికల కమిషనర్ల నియామకంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును తప్పుబట్టింది. ఎన్నికల కమిషనర్లు కూడా ప్రభుత్వాలకు వత్తాసు పలుకుతూ తలూపుతున్నారని.. ప్రధానిని సైతం ప్రశ్నించగలిగే కమిషనర్లు ఉండాలని హితవు పలికింది. ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియపై సుదీర్ఘ విచారణ జరిపిన రాజ్యాంగ ధర్మాసనం.. ఎలాంటి తీర్పు వెలువరుస్తుందోననే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామకంపై ఎప్పుడూ ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. కమిషనర్ల ఎంపిక నిష్పక్షపాతంగా జరగట్లేదనే విమర్శలు ప్రతిసారీ వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా అలాగే జరిగింది. ఎన్నికల కమిషనర్ల నియమకానికి కొలీజియం లాంటి వ్యవస్థ ఏర్పాటు చేసేలా ఆదేశాలివ్వాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరుపుతోంది. జస్టిస్‌ కె.ఎం. జోసెఫ్‌ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం దీన్ని విచారణ చేపట్టింది. నవంబర్‌ 18న జరిగిన చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ అరుణ్‌ గోయల్‌ నియామకాన్ని కూడా ధర్మాసనం ప్రశ్నించింది. ధర్మాసనం ఆదేశాల మేరకు అరుణ్‌ గోయల్ నియామక పత్రాలను గురువారం కోర్టుకు సమర్పించారు అటార్నీ జనరల్‌ వెంకటరమణి. వీటిని పరిశీలించిన ధర్మాసనం అవాక్కయింది. ఒక్కరోజులోనే సీఈసీ పోస్టులో అరుణ్‌ గోయల్‌ నియామకం ఎలా జరిగిందని ప్రశ్నించింది. మే 15 వ తేదీ నుంచి ఖాళీగా ఉన్న సీఈసీ పోస్టును అంత మెరుపు వేగంతో ఎలా నియమించారని ప్రశ్నించింది. తాము అరుణ్‌ గోయల్ సామర్థ్యాన్ని ప్రశ్నించడం లేదని.. ఎంపిక ప్రక్రియపై అనుమానాలు నివృత్తి చేసుకునేందుకేనని అడుగుతున్నామని వెల్లడించింది.

కేంద్ర ఎన్నికల కమిషనర్ పోస్టుకు నలుగురి పేర్లు సిఫార్సు చేస్తే వారిలో అరుణ్‌ గోయల్‌ పేరును మాత్రమే ఎందుకు పరిగణనలోకి తీసుకున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రతిపాదించిన నలుగురు వ్యక్తుల్లో అరుణ్‌ గోయల్‌ చిన్నవాడైనా.. మిగిలిన వారిని కాదని ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారని నిలదీసింది. సీఈసీ పోస్టుకు న్యాయ శాఖ మంత్రి నలుగురి పేర్లను సిఫార్సు చేశారని.. అందుకు ఆయన ఏ పద్ధతిని అనుసరించారని అడిగింది. అత్యంత జూనియర్‌ స్థాయిలో ఉన్న అరుణ్‌ గోయల్‌ ను.. పదవీ విరమణ వరకూ కూడా ఆగకుండా ఎలా తీసుకున్నారని ధర్మాసనం అడిగింది. అలాగే.. వీఆర్‌ఎస్‌ తీసుకున్న వ్యక్తిని నియమించడానికి ఎందుకు ఉత్సాహం చూపారని ధర్మాసనం ప్రశ్నించింది. ఇలా అరుణ్ గోయల్ నియామకంపై ప్రశ్నల వర్షం కురిపించింది ధర్మాసనం.

అయితే.. కేంద్ర ఎన్నికల కమిషనర్‌ ఎంపిక ప్రక్రియలో ఎక్కడా తప్పు జరగలేదని అటార్నీ జనరల్‌ వెంకటరమణి ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. గతంలో కూడా 12 నుంచి 14 గంటల్లో నియామకాలు జరిగిన సందర్భాలున్నాయని గుర్తు చేశారు. కేంద్ర న్యాయ శాఖ మంత్రి ప్రతిపాదించిన నాలుగు పేర్లు డీవోపీటీ డేటాబేస్‌ నుంచే తీసుకున్నారని.. ఆ వివరాలు బహిరంగంగా అందరికీ అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఓ వ్యక్తిని పరిగణనలోకి తీసుకునేటప్పుడు వయసుకు బదులు బ్యాచ్ ఆధారంగా సీనియారిటీని పరిగణిస్తారని అటార్నీ జనరల్ కోర్టుకు వివరించారు. ఎగ్జిక్యూటివ్‌లోని చిన్న చిన్న విషయాలను కూడా ఇక్కడ సమీక్షిస్తారా అనే ప్రశ్న తలెత్తుతోందని అటార్నీ జనరల్‌ వ్యాఖ్యానించారు. అందుకు స్పందించిన ధర్మాసనం.. తాము మొత్తం నియామక ప్రక్రియను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని.. న్యాయస్థానం మీకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుందని అనుకోవద్దన్నారు న్యాయమూర్తులు. ఇలా సీఈసీ నియామకంపై సుప్రీంకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి.

మొత్తానికి ఎన్నికల కమిషన్ వ్యవహారంపై రాజ్యాంగ ధర్మాసనం సుదీర్ఘ విచారణ పూర్తి చేసింది. దీనిపై త్వరలోనే తుది తీర్పు వెల్లడించనుంది. అయితే విచారణ సందర్భంగా ధర్మాసనం చేసిన కామెంట్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల వ్యవస్థ ప్రమాదంలో పడిందని వ్యాఖ్యానించింది. టి.ఎన్.శేషన్ లాగా సీఈఈ ఎందుకు నిర్ణయాలు తీసుకోలేకపోతోందని అనుమానాలు వ్యక్తం చేసింది. 

 

Tags :