హరీశ్ రావుపై బీజేపీ బరిలోకి దింపుతోంది ఇలాంటి అభ్యర్థినా..?

సిద్దిపేటలో సిట్టింగ్ ఎమ్మెల్యే హరీష్ రావు పైన పోటీ చేసే బిజెపి అభ్యర్థి ఖరారయ్యారు. చక్రధర్ గౌడ్ ను బిజెపి అభ్యర్థిగా బరిలోకి దింపాలని ఆ పార్టీ దాదాపు నిర్ణయించింది. చక్రధర్ గౌడ్ ఢిల్లీలో బిజెపి పెద్దలను కలిసి పార్టీ కండువా కప్పుకున్నారు. తాను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని చక్రధర్ గౌడ్ చాలా కాలంగా చెబుతూ వస్తున్నారు. అయితే బిజెపి చక్రధర్ గౌడ్ ను పార్టీలో చేర్చుకోవడం పై అనేక విమర్శలు వస్తున్నాయి. ఎందుకు అనేక కారణాలు ఉన్నాయి.
చక్రధర్ గౌడ్ తనను తాను సంఘసంస్కర్తగా చెప్పుకుంటూ ఉంటారు. రైతుల సంక్షేమం కోసం తాను పనిచేస్తుంటానని ప్రకటిస్తుంటారు. ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా కౌలు రైతులను ఆదుకుంటూ ఉంటానని చెప్తారు. గతంలో సుమారు కోటి రూపాయల చెక్కును రైతుల కోసం విరాళం కూడా ఇచ్చారు. అప్పుడే చక్రధర్ గౌడ్ పేరు బాగా ప్రచారంలోకి వచ్చింది. అప్పటినుంచి రైతుల కోసం వివిధ కార్యక్రమాల పేరుతో హడావుడి చేస్తుంటారు.
అయితే చక్రధర్ గౌడ్ వాస్తవానికి రియల్ ఎస్టేట్ వ్యాపారి. రియల్ ఎస్టేట్ ద్వారా బాగానే సంపాదించారు. ఆ డబ్బులనే రైతుల కోసం ఖర్చు పెడుతున్నానని చెప్తుంటారు. ఎప్పటికైనా సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనేది చక్రధర్ గౌడ్ కోరిక. అయితే ఏదైనా పార్టీ అండ ఉంటే ఎన్నికల్లో నిలవడం సులభం అందుకే జేపిని ఎంచుకున్నారు. వెంటనే ఆ పార్టీలో చేరిపోయారు. బిజెపికి కూడా అభ్యర్థుల కొరత ఉంది కాబట్టి చక్రధర్ గౌడ్ ను అక్కున చేర్చుకున్నారు.
అయితే ఒక రేప్ కేసులో నిందితుడుగా ఉన్న చక్రధర్ గౌడ్ ను బిజెపి పార్టీలో చేర్చుకోవడం సంచలనం కలిగించడమే కాక విమర్శలకు తావిస్తోంది. ఇలాంటి వ్యక్తులను పార్టీలో చేర్చుకొని తెలంగాణ ప్రజలకు ఏం సమాధానం చెబుతారని సోషల్ మీడియాలో పలువురు ప్రశ్నిస్తున్నారు. బెయిల్ పై ఉన్న వ్యక్తిని పార్టీలో చేర్చుకొని ఎన్నికల్లో పోటీ చేయడం ఎంతవరకూ సబబు అని నిలదీస్తున్నారు. మరి దీనికి బీజేపీ ఏం సమాధానం చెప్తుందనేది వేచి చూాడాలి.