సీదిరి అప్పలరాజు మంత్రి పదవి ఊడబోతోందా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి త్వరలోనే మంత్రివర్గాన్ని విస్తరిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. వీలైతే ఈ వారంలోనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని భావిస్తున్నారు. దీనికోసం సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుత క్యాబినెట్ నుంచి ముగ్గురిని తొలగించి.. కొత్తగా మరో ముగ్గురికి స్థానం కల్పిస్తారని సమాచారం అందుతుంది. ఈ ఊహ గణాల నేపథ్యంలో మంత్రి సీదిరి అప్పలరాజు కు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు రావడంతో హడావుడి నెలకొంది.
ఈ ఉదయం ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మంత్రి సీదిరి అప్పలరాజుకు ఫోన్ వెళ్ళింది శ్రీకాకుళం జిల్లా పలాస లో ఉన్న ఆయన్ను హుటాహుటిన తాడేపల్లి వచ్చి ముఖ్యమంత్రి వైయస్ జగన్ ను కలవాలని ఆ ఫోన్ సారాంశం. దీంతో సీదిరి అప్పలరాజు తన కార్యక్రమాలు అన్నింటినీ రద్దు చేసుకొని తాడేపల్లి బయలుదేరారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఉదయాన్నే ఫోన్ రావడం, ఆ వెంటనే మంత్రి అప్పలరాజు హుటాహుటిన విజయవాడకు బయలుదేరడం ఆయన అనుచరుల్లో ఆందోళన కలిగించింది.
మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో సీదిరి అప్పలరాజును తొలగిస్తారని ప్రచారం కొంతకాలంగా వినిపిస్తోంది.. ఇప్పుడు ఆయనకు సీఎంవో నుంచి పిలుపు రావడంతో ఆ ప్రచారానికి బలం చేకూరుతోంది. మూడో తేదీ ప్రజా ప్రతినిధులు అందరితో సీఎం జగన్ సమావేశం కాబోతున్నారు. ఈలోపే మంత్రివర్గ విస్తరణ పై ఒక క్లారిటీ వస్తుందని తెలుస్తోంది. అందులో భాగంగా మొదట సీదిరి అప్పలరాజును పిలిపించి సీఎం జగన్ మాట్లాడుతున్నారని భావిస్తున్నారు. సిదిరి అప్పలరాజు చేత సీఎం జగన్ రాజీనామా చేయిస్తారని జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
పలాస నుంచి ప్రతినిత్యం వహిస్తున్న సిదిరి అప్పలరాజు మత్స్యకార వర్గానికి చెందిన నేత.2017లో వైసీపీలో చేరారు.2019లో ఎమ్మెల్యేగా గెలిచారు.2020లో జగన్ క్యాబినెట్లో స్థానం పొందారు. అయితే సీదిరి అప్పలరాజు పై స్థానికంగా నేతలే అసంతృప్తిగా ఉన్నారు. దానికి తోడు అవినీతి ఆరోపణలు అప్పలరాజు పై ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే జగన్కు అందిన సర్వేల్లో అప్పలరాజు ఈసారి ఓడిపోతారని సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో క్యాబినెట్లో ఉంచడం కంటే తొలగించడం మేలని జగన్ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో అప్పలరాజుకు టికెట్ కూడా దక్కకపోవచ్చు అని జిల్లా నేతలే చెప్పుకుంటున్నారు.