అన్నాడీఎంకే - బీజేపీ ఆశలపై స్టాలిన్ నీళ్లు చల్లారా..?

అన్నాడీఎంకే - బీజేపీ ఆశలపై స్టాలిన్ నీళ్లు చల్లారా..?

దేశవ్యాప్తంగా వచ్చే లోక్ సభ ఎన్నికలపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఢిల్లీ పీఠంపై ఎవరు కూర్చుంటారనేదానిపై ఎవరి లెక్కలు వాళ్లు వేసుకుంటున్నారు. అలాగే రాష్ట్రాల్లో కూడా ఎత్తులు పైఎత్తులతో పార్టీలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటేందుకు తమ ముందున్న అన్ని మార్గాలను అన్వేషించుకుంటున్నాయి. ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలి. ఆ విషయంలో తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత ఎం.కె.స్టాలిన్ కాస్త ముందే ఉన్నారనిపిస్తోంది. వచ్చే లోక్ సభ ఎన్నికలకోసం ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు. ప్రతిపక్ష అన్నాడీఎంకేకి, బీజేపీకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా అన్ని స్థానాలను కైవసం చేసుకునే దిశగా స్టాలిన్ ఎత్తుగడలు వేస్తున్నారు.

తమిళనాడు పాలిటిక్స్ ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. గతంలో జయలలిత, కరుణానిధి మధ్య బద్దవైరం ఉండేది. అన్నాడీఎంకే, డీఎంకే మధ్య నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయిలో పోరు జరిగేది. అయితే ఇప్పుడు వాళ్లిద్దరూ లేరు. జయలలితకు వారసులు లేరు కాబట్టి పార్టీ పగ్లాలు వేరే వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోయాయి. జయలలిత నిచ్చెలిగా శశికళగా పేరొందారు. అయినా ఆమెకు పార్టీ పగ్గాలు దక్కకపోగా అనేక అవినీతి ఆరోపణలతో జైలుపాలవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు ఆమె జైలు నుంచి విడుదలై వచ్చే ఎన్నికల నాటికి సత్తా చాటాలనుకుంటున్నారు. అన్నాడీఏంకేని చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అయితే మాజీ ముఖ్యమంత్రులు పళనిస్వామి, పన్నీర్ సెల్వం పార్టీ పగ్గాలను ఆమెకు దక్కకుండా చేస్తున్నారు. మరోవైపు పళనిస్వామి, పన్నీరు సెల్వం మధ్య కూడా విభేదాలు తారస్థాయిలో ఉన్నాయి.

ప్రత్యర్థి వీక్ గా ఉన్నప్పుడే మరింత చావగొట్టాలని రాజకీయ నేతలు భావిస్తుంటారు. ఇప్పుడు తమిళనాడులో ఇదే జరుగుతోందనిపిస్తోంది. అంతర్గత విభేదాలతో అన్నాడీఎంకే సతమతమవుతోంది. శశికళ, పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాలు పార్టీపై పట్టుకోసం కొట్టుకుంటున్నాయి. అయితే ఈ విభేదాలను సొమ్ము చేసుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో ఈ ముగ్గురు నేతలూ సఖ్యతగా ఉంటున్నారు. వచ్చే ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ కలిసి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే అధికార డీఎంకేను ఓడించడం అంత ఈజీ కాదు. అందుకే కమల్ హాసన్, విజయ్ కాంత్ లాంటి చిన్నాచితకా పార్టీలను కూడా కలుపుకుపోవాలని బీజేపీ సూచించినట్లు సమాచారం. అందుకే ఇప్పటి నుంచే ఓ మోస్తరు ప్రభావం చూపించే పార్టీలను కూడా కలుపుకుపోవాలని అన్నాడీఎంకే - బీజేపీ కూటమి భావిస్తోంది.

అయితే అన్నాడీఎంకే - బీజేపీ కూటమి వ్యూహాలకు చెక్ పెడుతూ డీఎంకే అధినేత, సీఎం స్టాలిన్ ముందుకెళ్తున్నారు. ఇప్పటికే డీఎంకే - కాంగ్రెస్ చాలాకాలంగా కలిసి పనిచేస్తున్నాయి. ఇప్పుడు డీఎంకే ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామిగా ఉంది. ఇప్పుడు ఆ కూటమిని మరింత విస్తరించాలనుకుంటున్నారు స్టాలిన్. వచ్చే ఎన్నికల్లో డీఎండీకే అధినేత విజయ్ కాంత్, ఎంఎన్ఎం అధినేత కమల్ హాసన్ లను కూడా తమ కూటమిలో చేర్చుకోవాలనుకుంటున్నారు. తద్వారా అన్నాడీఎంకే - బీజేపీ వ్యూహాలకు చెక్ పెట్టాలనుకుంటున్నారు. డీఎంకే- కాంగ్రెస్ కూటమిలో చేరేందుకు డీఎండీకే, ఎంఎన్ఎం పార్టీలు అంగీకరించినట్లు సమాచారం. పార్లమెంట్ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు ఒకటి రెండు స్థానాలను కేటాయించేందుకు స్టాలిన్ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో అన్నాడీఎంకే ఆశలపై స్టాలిన్ నీళ్లు చల్లినట్లయింది.

 

 

Tags :