నోరు జారుతున్న టీడీపీ నేతలు..! ప్రత్యర్థులకు ఆయుధాలిస్తున్నారా..?

నోరు జారుతున్న టీడీపీ నేతలు..! ప్రత్యర్థులకు ఆయుధాలిస్తున్నారా..?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పోల్చితే తెలుగుదేశం పార్టీకి ఎంతో సుదీర్ఘ చరిత్ర ఉంది. ఎన్నో డక్కామొక్కీలు తిని నిలబడుతూ వచ్చింది. ఆటుపోట్లు ఆ పార్టీకి కొత్త కాదు. 2024 ఎన్నికలు టీడీపీకి చావారేవో నిర్దేశిస్తాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. అలాంటి సమయంలో తెలుగుదేశం పార్టీ తన శక్తియుక్తులన్నింటినీ ఒడ్డి పోరాడాల్సి ఉంది. కానీ అలా జరుగుతోందా.. అనేది ఇప్పుడు అనుమానాస్పదంగా మారింది. ఆ పార్టీ నేతలు చేస్తున్న కొన్ని కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అధినేత చంద్రబాబు మొదలు ఆ పార్టీ నేతలు కూడా నోరు జారుతుండడం పార్టీని ఇబ్బందులకు గురిచేస్తోంది.

కర్నూలు జిల్లాలో చంద్రబాబు టూర్ కు విశేష స్పందన లభించింది. మూడు రోజులపాటు అక్కడ పర్యటించిన చంద్రబాబు సభలకు అక్కడ జనం పెద్దఎత్తున తరలివచ్చారు. ఆ జనాన్ని చూసి టీడీపీ శ్రేణులు వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదేననే ధీమాకు వచ్చేశారు. విపక్షాలు, విశ్లేషకులు కూడా చంద్రబాబు సభలకు వచ్చిన జనాన్ని చూసి ఇవన్నీ ఓట్లుగా మారితే టీడీపీ గెలుపు ఖాయమనే అంచనాకు వచ్చారు. అయితే ఈ పర్యటనలో చంద్రబాబును అడుగడుగునే అడ్డుకున్నాయి వైసీపీ, ప్రజాసంఘాలు. ఈ సందర్భంగా చంద్రబాబు చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. వైసీపీ నేతలపై చంద్రబాబు తిట్ల వర్షం కురిపించారు. తాను కూడా అందరిలాగా నోటికి పని చెప్పగలనని నిరూపించారు చంద్రబాబు. వాస్తవానికి చంద్రబాబు ఎప్పుడూ అలా నోరు జారరు. కానీ అక్కడ పరిస్థితుల వల్ల వచ్చిన ఫ్రస్టేషనో.. లేకుంటే ఇలా స్పందించకపోతే పార్టీ శ్రేణులకు భరోసా కల్పించలేమనే ఫీలింగో.. తెలీదు కానీ చంద్రబాబు కామెంట్స్ మాత్రం హాట్ టాపిక్ గా మారాయి.

గతంలో ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు సీఎం జగన్ ను ఉద్దేశించి చేసిన కామెంట్స్ ఏ స్థాయి వరకూ వెళ్లాయో తెలుసు. దీన్ని సీరియస్ గా తీసుకున్న జగన్ ప్రభుత్వం ఆయనపై కేసు నమోదు చేసింది. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయన్ను అరెస్ట్ చేసే స్థాయికి వెళ్లింది. అయితే కోర్టు నుంచి స్టే తెచ్చుకోవడంతో ఆ ముప్పు తప్పింది. ఆ తర్వాత కూడా అయ్యన్నపాత్రుడు నోటికి పని చెప్తూనే ఉన్నారు. పలు వేదికల్లో ఆయన తిట్లదండకం వినిపిస్తున్నారు.

తాజాగా.. టీడీపీ అధికార ప్రతినిధి బత్యాల చెంగల్రాయుడు పార్టీ సమావేశంలో చేసిన కొన్ని కామెంట్స్ విమర్శలకు తావిచ్చాయి. ప్రభుత్వం ఎవరిపనైనా కేసులు నమోదు చేసినప్పుడు .. తప్పించుకునేందుకు మెజిస్ట్రేట్ ముందు అబద్దాలు చెప్పాలంటూ ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. సాక్షాత్తూ పార్టీ కార్యవర్గ సమావేశంలో బహిరంగంగా బత్యాల చెంగల్రాయుడు ఇలాంటి కామెంట్స్ చేయడంతో పార్టీ పెద్దలు కూడా ఆశ్చర్యపోయారు. ఇక ఆపండి చెంగల్రాయుడు గారూ అంటూ అచ్చెన్నాయుడు వారించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆయన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా ట్రోల్ అవుతున్నాయి. బత్యాల కామెంట్స్ పై టీడీపీకి తలపట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

వచ్చే ఎన్నికలు టీడీపీకి అత్యంత కీలకం. ఇలాంటి సమయంలో నేతలు సంయమనంతో వ్యవహరించి వ్యూహాత్మకంగా అడుగులు వేయాల్సి ఉంది. అలా కాకుండా పార్టీ ప్రతిష్టనే ఇలా బజారున పడేశేలా, విపక్షాలకు స్వయంగా ఆయుధాలు ఇచ్చేలా ఉండకూడదు. వైసీపీలో కొంతమంది నేతలు టీడీపీ నేతలపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడేవారు. వారి భాషను చాలా మంది తీవ్రంగా ఖండించేవారు. కానీ ఇప్పుడు ఆలాంటి సంస్కృతి టీడీపీలో కూడా వచ్చేసిందనే ప్రచారం సాగుతోంది. పార్టీలో కొందరు నేతలు ఇలా తప్పటడుగులు వేస్తూ పార్టీ పరిస్థితిని దిగజారుస్తున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు ఎప్పుడూ ఎంతో సంయమనంతో వ్యవహరిస్తుంటారు. పార్టీ నేతలు ఎవరైనా తప్పటడుగులు వేస్తుంటే వారిస్తుంటారు. ఇప్పుడు కూడా పార్టీ నేతలను గీత దాటకుండా చూడాలని చంద్రబాబుకు సూచిస్తున్నారు సన్నిహితులు. మరి చూడాలి మున్ముందు నేతలు మారుతారో లేదో..!

 

Tags :
ii). Please add in the header part of the home page.