MKOne TeluguTimes-Youtube-Channel

ఉత్తరాంధ్ర వైసీపీ నేతలకు వణుకు..? ఏం సమాధానం చెప్తారు..?

ఉత్తరాంధ్ర వైసీపీ నేతలకు వణుకు..? ఏం సమాధానం చెప్తారు..?

ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానంలో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. ఇక్కడ ప్రతిపక్ష టీడీపీ అభ్యర్థి ఘన విజయం సాధించారు. పైగా రెండు పార్టీల మధ్య ఓట్ల తేడా భారీగా ఉంది. వైసీపీ కనీసం టీడీపీకి అందనంత దూరంలో నిలిచింది. దీంతో ఉత్తరాంధ్ర ప్రజల నాడి వైసీపీ నేతలకు అంతు చిక్కడం లేదు. ఎక్కడ వ్యవహారం బెడిసికొట్టిందనేదానిపై ఆరా తీయడం మొదలు పెట్టారు.

ఉత్తరాంధ్రలో ఈసారి వైసీపీకి తిరుగుండదనే ఇన్నాళ్లూ ఆ పార్టీ నేతలు బావిస్తూ వచ్చారు. ఎందుకంటే విశాఖను రాజధానిగా ప్రకటించినందున ఆ ప్రాంత ప్రజలు వైసీపీని అక్కున చేర్చుకుంటారనేది వాళ్ల నమ్మకం. అందుకే గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో కలిగే నష్టాన్ని ఈసారి ఉత్తరాంధ్ర, రాయలసీమ భర్తీ చేస్తాయని అంచనా వేసుకున్నారు. అయితే ఉత్తరాంధ్ర పట్టభద్రులు అధికార వైసీపీకి భారీ షాక్ ఇచ్చారు. వైసీపీ నేతలు కనీసం ఊహించలేనంత షాక్ ఇచ్చారు.

కొన్నాళ్ల కిందటే విశాఖ రాజధానికి మద్దతుగా అక్కడ గర్జన నిర్వహించింది వైసీపీ. ఆ సమయంలో ఉత్తరాంధ్ర వాసులంతా విశాఖ రాజధానికి మద్దతు పలికారని ఆ పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. అంతేకాదు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీని గెలిపించకపోతే విశాఖ రాజదానికి ఈ ప్రాంత ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని టీడీపీ ప్రచారం చేస్తుందని.. అదే జరిగితే విశాఖ రాజధాని కాకుండా పోతుందని మంత్రి ధర్మాన హెచ్చరించారు. అయినా ధర్మాన హెచ్చరికలను పట్టభద్రులు అస్సలు పట్టించుకోలేదు. టీడీపీకే జైకొట్టారు.

అసలు ఉత్తరాంధ్రలో ఓటమికి కారణాలేంటి.. అనే దానిపై ఇప్పుడు వైసీపీ నేతలు ఆరా తీయడం మొదలు పెట్టారు. విశాఖ రాజదానిని చేస్తామన్నా అక్కడి ప్రజలు ఓట్లేయకపోవడానికి కారణమేంటని తెలుసుకుంటున్నారు. పట్టభద్రుల ఫలితాల సరళి ప్రారంభం కాగానే అమరావతిలో ఆ ప్రాంత పట్టభద్రులంతా సమావేశమై చర్చించుకున్నారని సమాచారం. దీనిపై పార్టీ అధినేత జగన్ కు ఏం సమాధానం చెప్పాలో తెలియక సతమతమవుతున్నారట. మొత్తానికి ఉత్తరాంధ్ర నాడి పట్టుకోవడంలో వైసీపీ విఫలమైందనే టాక్ బలంగా వినిపిస్తోంది.

 

Tags :