MKOne TeluguTimes-Youtube-Channel

టీడీపీలో వైసీపీ కోవర్ట్..? 

టీడీపీలో వైసీపీ కోవర్ట్..? 

నెల్లూరు జిల్లా రాజకీయాలు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతున్నాయి. వైసీపీలో ఆది నుంచి ఉన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆ పార్టీతో అమీతుమీకి సిద్ధమయ్యారు. వచ్చే ఎన్నికల్లో తాను వైసీపీ నుంచి పోటీ చేయబోవట్లేదని, టీడీపీ తరపున బరిలోకి దిగబోతున్నానని ఆయన బహిరంగంగానే వెల్లడించారు. దీంతో ఆయన స్థానంలో పార్టీ అధిష్టానం మరొకరిని ఇన్ ఛార్జ్ గా నియమించింది. అయితే జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీ మారుతున్నారంటే ఎవరికీ ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు. ఆయన జగన్ ను వదిలి వెళ్లబోరని ఇప్పటికే చెప్తున్నారు.

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు జిల్లాలో సీనియర్ రాజకీయ నేత. వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పటి నుంచి ఆయనతో ప్రయాణం చేస్తూ వచ్చారు. వై.ఎస్. మరణానంతరం జగన్ వెంట నడిచారు కోటంరెడ్డి. జగన్ జైల్లో ఉన్నప్పుడు పార్టీ తరపున అసెంబ్లీలో గట్టిగా వాయిస్ వినిపించారు. జగన్ పై ఈగ వాలనీయకుండా చేసేవారు. దీంతో వైసీపీ అధికారంలోకి వస్తే కచ్చితంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమని అందరూ అనుకున్నారు. అయితే అది జరగలేదు. శ్రీధర్ రెడ్డి కూడా ఈక్వేషన్స్ లో తనకు ఛాన్స్ రాకపోయి ఉండొచ్చనుకున్నారు. అయితే రెండోసారి మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించినప్పుడు కూడా శ్రీధర్ రెడ్డి పేరు లేదు. అదే సమయంలో జిల్లాకు చెందిన రెడ్డి సామాజికవర్గం నేత కాకాణి గోవర్ధన్ రెడ్డికి కేబినెట్ లో బెర్త్ దొరికింది. దీంతో శ్రీధర్ రెడ్డి షాక్ కు గురయ్యారు.

రెండోసారి మంత్రివర్గంలో స్థానం దక్కకపోవడంతో శ్రీధర్ రెడ్డి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. మీడియా ఎదుట భోరున విలపించారు. ఆయన బాధనంతా వెలిబుచ్చారు. ఆ దృశ్యాలను చూసినవాళ్లంతా అయ్యో పాపం అనుకున్నారు. జగన్ శ్రీధర్ రెడ్డికి ఇచ్చింటే బాగుండేదని అందరూ అనుకున్నారు. అయినా శ్రీధర్ రెడ్డి ఎక్కడా అధిష్టానంపై నోరు జారలేదు. శ్రీధర్ రెడ్డిని జగన్ పిలిపించి మాట్లాడారు. దీంతో ఆ వ్యవహారం సద్దుమణగింది. అయితే ఆ తర్వాత జిల్లాలో మంత్రుల పెత్తనం అధికం కావడం, తనను పట్టించుకోకపోవడంతో శ్రీధర్ రెడ్డి తట్టుకోలేకపోయారు. అడపాదడపా ఈ అసంతృప్తిని వెలిబుచ్చుతూ వచ్చారు. దీంతో కోటంరెడ్డి వ్యవహారం పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది.

అయితే ఇప్పుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీలోనే తాను అంటరానివాడిగా మారిపోయానని.. తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని చెప్పడం పెద్ద సంచలనమే అయింది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి ముఖ్య నేత ఫోన్లను ఎందుకు ట్యాప్ చేస్తారని అందరూ అనుకున్నారు. అయితే ఇందుకు సాక్ష్యాలున్నాయంటూ ఆయన మీడియా ఎదుట ఆడియో ప్రవేశపెట్టడం, వచ్చే ఎన్నికల్లో తాను వైసీపీ తరపున పోటీ చేయబోవట్లేదని కార్యకర్తలతో చెప్పిన ఆడియో లీక్ కావడం లాంటి పరిణామాలు వైసీపీలో పరిస్థితిని తెలియజేశాయి. ఇదంతా చంద్రబాబు ఆడిస్తున్న డ్రామా అని వైసీపీ నేతలు చెప్తున్నారు. కోటంరెడ్డి ఏదో నెపంతో పార్టీ మారాలనుకున్నారని.. ఇప్పుడు వంకలు పెడ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీలోకి రావడం ఖాయమైంది. ఆయనే ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు. దీంతో టీడీపీలో గుబులు మొదలైంది. జగన్ కు అత్యంత సన్నిహితుడైన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడం మంచిదా.. కాదా.. అనే చర్చ మొదలైంది. బహుశా ఇదంతా జగన్ ఆడిస్తున్న కోవర్టు డ్రామా అయి ఉండొచ్చని పార్టీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి అనుమానం వ్యక్తం చేశారు. తమ్ముళ్లు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. చంద్రబాబు చెప్పినట్లు కోటంరెడ్డి నడుచుకుంటున్నాడని వైసీపీ నేతలు అంటుంటే.. ఆయన కోవర్ట్ ఏమోనని టీడీపీ నేతలు అనుమానపు చూపులు చూస్తున్నారు. 

 

 

Tags :