షర్మిల మాటల వెనుక మర్మమేంటి? మైలేజ్ కోసమేనా..?

షర్మిల మాటల వెనుక మర్మమేంటి? మైలేజ్ కోసమేనా..?

వై.ఎస్.షర్మిల.. దివంగత సీఎం వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా సుపరిచితురాలు. అన్న జగన్ కోసం రికార్డు స్థాయి పాదయాత్ర చేసి జనాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న మహిళ. ఇప్పుడు తెలంగాణలో పార్టీ పెట్టి అధికారంలోకి రావాలని పరితపిస్తున్న వనిత. కొంతకాలంగా ఆమె తెలంగాణలో పాదయాత్ర చేస్తున్నారు. తెలంగాణ తనకు మెట్టినిల్లు అని.. వై.ఎస్.ఆర్ అభిమానులంతా తన వైపే ఉన్నారని షర్మిల చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఎలాగైనా గద్దె దించుతానని.. తప్పకుండా అధికారంలోకి వస్తామని ఆమె ప్రకటించారు. అయితే ఈ మధ్య ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు రచ్చకు దారి తీస్తున్నాయి.

వై.ఎస్.రాజశేఖర రెడ్డి మృతి వెనుక కుట్ర దాగి ఉందని ఇటీవల షర్మిల ప్రకటించారు. వాస్తవానికి అప్పట్లోనే ఈ యాంగిల్లో కథనాలు వచ్చాయి. అయితే దానిపై విచారణలు జరిపిన అప్పటి ప్రభుత్వాలు అలాంటిదేమీ లేదని.. వై.ఎస్. మృతి ప్రమాదమేనని తేల్చేశాయి. కానీ ఇన్నాళ్లకు మళ్లీ షర్మిల వై.ఎస్. మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. కుట్ర దాగి ఉందని ఆరోపించారు. అంతేకాదు.. తనను కూడా చంపగలరని చెప్పారు. ఇప్పడు షర్మిల చేసిన ఈ కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి.

వై.ఎస్.రాజశేఖర రెడ్డి 2009 సెప్టెంబర్ 2న చనిపోయారు. అప్పటి నుంచి ఆయన మృతిపై వచ్చిన అనుమానాలన్నింటినీ విచారణ సంఘాలు నివృత్తి చేశాయి. అయితే ఇప్పుడు మళ్లీ షర్మిల ఈ మాటలెందుకన్నారనేదే ఇప్పుడు ఆసక్తి కలిగిస్తున్న ప్రశ్న. ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదు. ఇప్పడు షర్మిల తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటున్నారు. ఇప్పుడు వై.ఎస్.ఆర్ మృతి వెనుక కుట్ర దాగి ఉందని తెలంగాణలో ప్రకటించడం ద్వారా ఆమె ఏమి ఆశిస్తున్నారనేది అంతు చిక్కడం లేదు.

అయితే తెలంగాణలో మాత్రం షర్మిల వ్యాఖ్యలను అధికార, ప్రతిపక్షాలు రెండూ పెద్దగా పట్టించుకోలేదు. అది తమకు సంబంధం లేని వ్యవహారం అన్నట్టు భావిస్తున్నాయి. షర్మిల ఈమధ్య చాలా ఘాటు వ్యాఖ్యలే చేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమె కామెంట్స్ పై స్పీకర్ కు ఫిర్యాదు చేశారు కొంతమంది ఎమ్మెల్యేలు. అయినా తాను బెదిరేది లేదని.. తాను వై.ఎస్.ఆర్ బిడ్డనని షర్మిల చెప్తున్నారు. అసెంబ్లీకి ఎప్పుడు రావాలో మీరు టైం చెప్తారా.. లేకుంటే నన్నే టైం తీసుకుని రమ్మంటారా.. అని సినిమా స్థాయిలో డైలాగులు చెప్తున్నారు. షర్మిల ఎందుకు ఇలా మాట్లాడుతున్నారనేది ఇప్పుడు అంతు చిక్కడం లేదు.

షర్మిల మైలేజ్ కోసమే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారనేది కొందరు చెప్తున్న మాట. తన పార్టీకీ, పాదయాత్రకు పెద్దగా గుర్తింపు రాకపోవడం వల్లే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారని భావిస్తున్నారు. తాను జనాల్లోకి వెళ్లేందుకు, తన పాదయాత్ర పైన జనాల్లో చర్చ జరిగేందుకు ఇలాంటి కామెంట్స్ దోహదం చేస్తాయని భావించే షర్మిల ఇలాంటి కామెంట్స్ చేస్తూ ఉండొచ్చని కొందరు అనుమానిస్తున్నారు. మరి షర్మిల స్ట్రాటజీ ఏంటో.. దీనివల్ల ఆవిడకు ఎంత మైలేజ్ వస్తుందో వేచి చూద్దాం.

 

 

Tags :