వైసీపీకి సవాల్‌గా మారనున్న నెల్లూరు జిల్లా!

నెల్లూరు జిల్లాలో వైసీపీ ఇన్నాళ్లూ చాలా బలంగా ఉండేది. ఆ జిల్లాలో అన్ని అసెంబ్లీ స్థానాలనూ కైవసం చేసుకున్న చరిత్ర వైసీపీది. అయితే నాలుగేళ్లు తిరగకముందే అక్కడ వైసీపీలో అంతర్గత విభేదాలు తారస్థాయికి చేరాయి. దీంతో పార్టీ పరిస్థితి దిగజారుతోంది. ఎన్నికలకు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉంది. ఎన్నికల నాటికి పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందనేది జిల్లా నేతలకే అంతు చిక్కడం లేదు.
మేకపాటి ఫ్యామిలీ, విజయసాయి రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్.. లాంటి నేతలు ఇన్నాళ్లూ వైసీపీకి బలమైన లీడర్లుగా ఉన్నారు. పార్టీని పటిష్టంగా మలిచారు. విపక్షం ఉనికే లేకుండా చేశారు. జిల్లాను వైసీపీ కంచుకోటగా మలిచారు. టీడీపీ లాంటి బలమైన ప్రతిపక్షం కూడా నెల్లూరు జిల్లాలో చాలా వీక్ అయిపోయింది. అయితే ఇదంతా ఒకప్పుడు... ఇప్పుడు కాదు.
నెల్లూరు జిల్లా వైసీపీలో ఇప్పుడు అంతర్గత విభేదాలు తారస్థాయిలో ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే నెల్లూరు జిల్లా నుంచే వైసీపీలో లుకలుకలు ప్రారంభమయ్యాయని చెప్పొచ్చు. విజయసాయి రెడ్డి సీఎం జగన్ తో అంటీముట్టనట్టు ఉంటున్నారు. మేకపాటి ప్యామిలీ కూడా అసంతృప్తితో ఉందనే సమాచారం ఉంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పేశారు. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డిని పార్టీ ఇన్ ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించింది. వీళ్లిద్దరూ పార్టీకి దూరంగా ఉంటున్నారు. పార్టీ కూడా వీళ్లిద్దరిపై ఆశలు వదిలేసుకుంది.
వచ్చే ఎన్నికల నాటికి జిల్లాలో వైసీపీ పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. కోటంరెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి త్వరలోనే టీడీపీ కండువా కప్పుకోబోతున్నారు. అనర్హత వేటు పడదనే సమయం వచ్చినప్పుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి కూడా పార్టీ మారడం ఖాయం. మేకపాటి ఫ్యామిలీ, విజయసాయి రెడ్డి భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా ఉత్కంఠ కలిగిస్తోంది.