మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా తెలుగు ఎన్ఆర్ఐ అరుణా మిల్లర్

మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా తెలుగు ఎన్ఆర్ఐ అరుణా మిల్లర్

అమెరికాలోని మేరీల్యాండ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా తెలుగు మూలాలున్న అరుణా మిల్లర్‌ ఎన్నికయ్యారు. దీంతో ఈ ఘనత సాధించిన తొలి భారతీయ-అమెరికన్ రాజకీయవేత్తగా అరుణా మిల్లర్ చరిత్ర సృష్టించారు. ఆమె ప్రమాణ స్వీకారోత్సవం బుధవారం అట్టహాసంగా జరిగింది. ఈ క్రమంలోనే భగవద్గీతపై ప్రమాణం చేసిన మిల్లర్ పదవీ బాధ్యతలను చేపట్టారు.

‘అరుణ కాట్రగడ్డ మిల్లర్ అనే నేను అమెరికా రాజ్యాంగానికి నా పూర్తి మద్దతునిస్తానని, మేరీల్యాండ్ స్టేట్‌కు విధేయత కలిగి ఉంటానని భగవద్గీతపై ప్రమాణం చేసి చెబుతున్నాను’ అని ప్రమాణ స్వీకారం చేసిన అరుణ మేరీల్యాండ్ రాష్ట్ర 10వ లెఫ్టినెంట్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు.

హైదరాబాద్‌లో జన్మించిన 58 ఏండ్ల అరుణ.. 1972 లో కుటుంబంతో కలిసి అమెరికా వెళ్లింది. 2000 సంవత్సరంలో అమెకు అమెరికా పౌరసత్వం లభించింది. అరుణ వృత్తి రీత్యా కెరియర్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజినీర్. మేరీల్యాండ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్‌లో 25 సంవత్సరాలు పనిచేశారు.

ప్రమాణ స్వీకారం అనంతరం ఉద్వేగభరితంగా మాట్లాడిన మిల్లర్.. ‘‘నేను మొదటిసారి అమెరికాకు వచ్చి ఇక్కడ స్కూల్‌లో చేరినప్పుడు అందరికంటే భిన్నంగా ఉన్నాను. నాకు ఇంగ్లీష్ రాదు. ఇక్కడి ఆహారం ఎప్పుడూ తినలేదు. కానీ చుట్టూ ఉన్న స్నేహితులతో కలిసి అదే తిన్నాను. నాకు ఏదో తెలియని అనుభూతి కలిగింది. కానీ ఆ భోజనం పడక క్లాస్‌రూమ్‌కి వెళ్లిన తర్వాత డెస్క్‌పై వాంతి చేసుకున్నాను. నన్ను తీసుకెళ్లడానికి వచ్చిన మా అమ్మను మా టీచర్ పిలిపించి నేను అక్కడ ఇమడలేనని, తిరిగి భారతదేశంలో మా బామ్మ వద్దకు తిరిగి పంపించేయమని చెప్పారు. కానీ నేను ఆ రోజు నుంచి అన్నీ నేర్చుకుంటూ అమెరికాలో గొప్ప పౌరురాలిగా ఎదిగాను. ఇప్పుడు ఇలా ఓ రాష్ట్రానికి లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియామకం కావడం చెప్పలేనంత ఆనందంగా ఉంది” అంటూ చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

 

 

Tags :