మూడు ఈశన్య రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల

మూడు ఈశన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. త్రిపుర లో ఫిబ్రవరి 16న పోలింగ్ జరగనుండగా, మేఘాలయ, నాగాలాండ్ లలో ఫిబ్రవరి 27న ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడిరచారు. మార్చి 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. నాగాలాండ్ అసెంబ్లీ గడువు మార్చి 12తో పూర్తి కానుండగా, మేఘాలయలో మార్చి 15, త్రిపురలో మార్చి 22తో శాసనసభలకు గడువు ముగియనుంది. మూడు రాష్ట్రాల్లో 60 అసెంబ్లీ నియోజకవర్గాల చొప్పున మొత్తం 180 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 9125 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 80 శాతానికి పైగా పోలింగ్ కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లోనేనని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. 70 శాతం పోలింగ్ స్టేషన్లలో వెబ్‌కాస్టింగ్ సదుపాయం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.