అంగరంగ వైభవంగా ఆటా డే ఉత్సవాలు

అమెరికాలోని ఆరిజోనాల అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఇక్కడి ఫీనిక్స్ ష్రైన్ ఆడిటోరియంలో ఈ వేడుకలు నిర్వహించారు. సంప్రదాయ నృత్యాలు, ఫోక్ డ్యాన్సులు, ఫ్యూజన్ మ్యూజిక్, పౌరాణిక నాటకాల ప్రదర్శనలతో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. తెలుగు సంవత్సరాది ఉగాది పూజతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఆటా జాతీయాధ్యక్షులు మధు బొమ్మినేని మాట్లాడుతూ.. సమాజంలో సేవ ఎంత ముఖ్యమో వివరించారు. అలాగే తెలుగు సంప్రదాయాలను కాపాడుకోవడం, దాన్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేయడం కూడా చాలా కీలకమని చెప్పారు.
ఈ సందర్భంగా ఆటా బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యురాలు శారద సింగిరెడ్డి మాట్లాడుతూ తెలుగు సంప్రదాయం చాలా ఉన్నతమైనదని కొనియాడారు. కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఈ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ సెలబ్రేట్ చేసుకోవాలన్నారు. ప్రముఖ సంగీతకారులు రఘు కుంచె, అంజనా సౌమ్య ఈ వేడుకలను తమ గానంతో మరో మెట్టు పైకి తీసుకెళ్లారు. స్థానిక ఆర్టిస్టులు కూడా తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. ఆటా డే ఉత్సవాలు ఎంత ఘనంగా జరిగాయంటే.. ఆడిటోరియంలో ప్రేక్షకులు భారీగా చేరడంతో, తాత్కాలిగంగా ఎవరినీ లోపలకు పంపకుండా ఆపేయాల్సి వచ్చింది.
అంతమంది ఈ వేడుకలు చూసేందుకు తరలివచ్చారు. ఈ వేడుకలు చూసిన వారందరూ తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను అత్యద్భుతంగా చూపించారని నిర్వాహకులను మెచ్చుకున్నారు. ఇలాంటి మరికొన్ని కార్యక్రమాలు నిర్వహించే ఆలోచనలో తాము ఉన్నట్లు రీజనల్ డైరెక్టర్ రఘునాథ్ గాడి చేసిన ప్రకటన ప్రేక్షకుల్లో మరింత ఉత్సాహం నింపింది. ఈ కార్యక్రమం విజయవంతం అవడంతో రీజనల్ కోఆర్డినేటర్స్ వంశఈ ఎరువరం, శశి గాడె, చెన్న మద్దూరి, ధీరజ్ పోల, సునీల్ అన్నపురెడ్డి, మదన్ బొల్లారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.