MKOne Telugu Times Youtube Channel

బాలారెడ్డి ఇందుర్తికి ప్రతిష్టాత్మక శంకరరత్న 2023 అవార్డు

బాలారెడ్డి ఇందుర్తికి ప్రతిష్టాత్మక శంకరరత్న 2023 అవార్డు

దేశంలోనే కాకుండా అమెరికాలో కూడా పేరుగాంచిన చెన్నైలోని శంకర నేత్రాలయ సంస్థ ఇచ్చే ప్రతిష్టాత్మక శంకరరత్న అవార్డు 2023 సంవత్సరానికిగాను అమెరికాలో ఉంటున్న బాలారెడ్డి ఇందుర్తికి లభించింది. అట్లాంటాలో ఉంటున్న బాలారెడ్డి ఇందుర్తి పలు సంవత్సరాలుగా శంకర నేత్రాలయ ద్వారా ఎంతోమంది కంటి చికిత్సకోసం విరాళాలను సేకరించి ఇస్తున్నారు. అమెరికాలో ఏర్పాటు చేసిన శంకర నేత్రాలయ ఓం ట్రస్ట్‌ ఇంక్‌.కి ఆయన ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు. శంకర నేత్రాలయ వైద్య సంస్థకు భారతదేశంలోనే కాదు...అమెరికాలో కూడా మంచి ఇమేజ్‌ ఉంది. దేశంలోని దాదాపు పలు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన శంకర నేత్రాలయ ఆసుపత్రుల ద్వారా కోట్లాదిమందికి పేదలకు కంటి చికిత్సను ఉచితంగా చేస్తున్నారు.

పద్మభూషణ్‌ డాక్టర్‌ ఎస్‌ఎస్‌ బద్రీనాథ్‌ 1978లో కంచి కామకోటి మఠం పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి చేసిన ప్రసంగానికి స్పందించి శంకర నేత్రాలయను స్థాపించారు. ఈ సంస్థ యొక్క ఏకైక లక్ష్యం పేదలకు ఉచితంగా కంటి చికిత్సలను చేయడం, ఇతరులకు సరసమైన ధరలో ప్రపంచ స్థాయి కంటి వైద్యాన్ని అందించడం. గ్రామాల్లో ఉన్న పేదలదగ్గరికే మొబైల్‌ వ్యాన్‌ల ద్వారా ఆసుపత్రిని తీసుకెళ్ళి వారికి అవసరమైన చికిత్సను అందించడం అత్యవసరమైన వారికి చెన్నైలోని ప్రధాన కంటి ఆసుపత్రిద్వారా సర్జరీలు వంటివి చేయించడం చేస్తోంది.

అమెరికాలోని శంకర నేత్రాలయ యుఎస్‌ఎ ట్రస్ట్‌ ద్వారా నిధులను సేకరించి వాటి ద్వారా భారతదేశంలో ఉన్న పేదలకు ఉచితంగా వైద్యాన్ని అమెరికాలోని శంకర నేత్రాలయ ఓం ట్రస్ట్‌ చేస్తోంది. ఎన్నో మిలియన్లను ఇప్పటివరకు సేకరించి కోట్లాదిమందికి కంటి శస్త్రచికిత్సలను శంకరనేత్రాలయ చేసి వారికి చూపును ప్రసాదించింది. శంకర నేత్రాలయ సంస్థకు ఉన్న ఇమేజ్‌తోపాటు ఆ సంస్థ ఇచ్చే ప్రతిష్టాత్మక అవార్డు ఈసారి బాలారెడ్డి ఇందుర్తికి ప్రకటించారు.

కమ్యూనిటీకి తనవంతుగా సేవ చేస్తూ, వివిధ అసోసియేషన్‌లలో కీలకమైన పదవులను చేపట్టిన బాలారెడ్డి ఇందుర్తి శంకర నేత్రాలయ సంస్థకోసం నిరంతరం పాటుపడుతున్నారు. విరాళాలను సేకరించి శంకరన నేత్రాలయ సంస్థకు ఆయన అందిస్తూ వస్తున్నారు. ఆయన సేవలను గమనించిన శంకర నేత్రాలయ సంస్థ ఆయనను ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక చేసింది. భారతదేశంలోని నిరుపేద అంధులకు అందించిన సేవలకు శంకర నేత్రాలయ అందించే అత్యున్నత గౌరవం ‘శంకరరత్న’.

గతంలో ఈ శంకరరత్న అవార్డును విశిష్ట ప్రముఖులకు అందించారు ఎస్‌.వి.ఆచార్య, రతన్‌ టాటా, మాధవన్‌ నాయర్‌, ఎస్‌.పి. ముత్తురామన్‌, దీపక్‌ పారిఖ్‌ వంటివారికి ఇచ్చారు. ఈ అవార్డుకు ఉన్న ప్రాముఖ్యత ఏమిటంటే ఈ అవార్డును స్వీకరించడానికి స్వయంగా రతన్‌ టాటా హాజరయ్యారు. అలాగే సినీ దర్శకుడు ముత్తురామన్‌కు అవార్డు ఇస్తున్న వేడుకకు సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ స్వయంగా హాజరుకావడం పలువురు సెలబ్రిటీలను ఆకర్షించింది. ఈ ఆవార్డుకు ఉన్న విశిష్టత ఏమిటో మనం తెలుసుకోవచ్చు. ప్రస్తుతం 2023 సంవత్సరానికిగాను ఈ ఆవార్డును తెలుగువాడైన అమెరికాలో ఉంటున్న బాలారెడ్డి ఇందుర్తికి లభించింది. అమెరికాలో తెలుగువారికి పత్రికాపరంగా సేవలందిస్తున్న ‘తెలుగుటైమ్స్‌’ ఆయనను అభినందిస్తోంది.

 

 

Tags :