నీ పరువుకే రూ.100 కోట్లయితే.. 30 లక్షల మందికి ఎంత చెల్లిస్తావ్ ?

టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో తనపై నిరాధార, అసత్య ఆరోపణలు చేశారని మంత్రి కేటీఆర్ పంపిన లీగల్ నోటీసుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ స్పందించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. లీగల్ నోటీసులపై న్యాయపరంగానే పోరాడతామని క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కేటీఆర్ పరువుకే రూ.100 కోట్లయితే, 30 లక్షల మంది భవిష్యత్తు ప్రశ్నార్థకమైందని, వాళ్లకు ఎంత మూల్యం చెల్లిస్తారని మంత్రిని ప్రశ్నించారు. పరువు నష్టం పేరుతో కూడా డబ్బులు సంపాదించాలనుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. లీకేజీలో తన కుట్ర ఉందన్న కేటీఆర్‌పై ఎంత దావా వేయాలని సూటీగా ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడి పరువు ప్రతిష్టకు భంగం కలిగించినందుకు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తానని నాకు లీగల్ నోటీస్ జారీ చేసినట్టు వచ్చిన వార్తలను పత్రికల్లో చూశాను. నీ ఉడుత ఊపులకు భయపడేది లేదు. కేటీఆర్‌ను ఒక్కటే అడుగుతున్నా. తెలంగాణ ఉద్యమానికి ముందు అమెరికాలో చిప్పలు కడిగేటోడికి ఇప్పుడు వేల కోట్లు ఎలా సంపాదించారో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని. కేసీఆర్ కొడుకును మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేసేదాకా పోరాడతాం. టీఎస్‌పీఎస్‌సీ కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాల్సిందే అని అన్నారు. నష్టపోయిన నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష చొప్పున పరిహారం ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేశారు.