అమెరికా అంతటా బతుకమ్మ పండుగ సంబరాలు...

అమెరికా అంతటా బతుకమ్మ పండుగ సంబరాలు...

అమెరికాలో హాలిడే సీజన్ ప్రారంభమయ్యే 2 నెలలకు ముందు వచ్చే అక్టోబరు నెల అమెరికా తెలుగు వాళ్ళకి ప్రత్యేకించి తెలంగాణ ప్రజలకు పండుగల నెలగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ నెలల్లో రెండు పెద్ద పండుగలు వస్తాయి. ఈ రెండు పండుగలకు కనీసం పదిహేను రోజులు అటువైపు, ఇటువైపు.. అంతా పండుగ సంబరాలు, కుటుంబ కోలాహలాలతో నిండిపోయుంటుంది.

ఈ పండుగలలో ఒకటి బతుకమ్మ పండుగ కాగా.. మరొకటి దసరా పండుగ (విజయ దశమి). అయితే బతుకమ్మ పండుగ మాత్రం, తెలంగాణకు, తెలుగు వాళ్ళకి ప్రత్యేకమైన పండుగ. తెలంగాణ సాంస్కృతిక ప్రతీక ఈ పండుగ. బతుకమ్మ పండుగ తెలంగాణా రాష్ట్రంలోని ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు.

మొదట తెలంగాణ వాళ్ళకి ఆ తర్వాత అందరు తెలుగు వాళ్ళకి, ప్రస్తుత  రోజుల్లో భారతీయులే కాకూండా అమెరికా లోని ప్రతి ఒక్కరికి ఫెస్టివల్ అఫ్ ఫ్లవర్స్ గా పరిచయమై ఆహ్లాద కరమయిన పండుగ వాతావరణం సృష్టిస్తుంది, ఈ రోజుల్లో బతుకమ్మ పండుగ జరపడానికి  ఉత్సాహం చూయించని తెలుగు సంస్థ లేని పట్టణం అమెరికాలో లేదంటే అతిశయోక్తి ఖచితనగా కాదు.

ఈ పండగ ఈ రోజు ఇంట ఘనంగా జరుపుకోవటానికి తెలంగాణ ప్రవాసీలు మొదటి రోజుల్లో ఎంతో కష్ట పడాల్సి వచ్చింది ఎన్నో అవమానాలను ఎదుర్కోవాల్సి వచ్చింది , అన్ని భరిస్తూ బతుకమ్మ కు ప్రాణం పోసిన తెలంగాణ ప్రవాసీల కృషి ఈ రోజు గణించ దగ్గది. మొదట్లో ఇది శూద్రుల పండగ అని, అశుద్ద మని అన్న వారే ఈనాడు అదే బతుకమ్మని ఆడటానికి అత్యుత్సహం చూపిస్తున్నారు అంటే ఆశ్చర్యం కలగక మానదు.

1999-2000 లో న్యూ జెర్సీ ప్రాంతం లో ప్రారంభమయ్యి, 2002-2003 ప్రాంతంలో చికాగో, సాన్  ఫ్రాన్సికో కి ఆ తర్వాత బోస్టన్, డిట్రాయిట్, అట్లాంటా, డల్లాస్ లాంటి నగరాలకు పాకి, మొదట పాతిక యాభయి మందితో ఆడిన ఈ పండుగ ప్రస్తుతం వేల సంఖ్యల్లో కి ఎదగడం గర్వించ దగ్గ విషయమే మరి మనిషికి, ప్రకృతితో ఉన్న సంబంధానికి ప్రతీకగా బతుకమ్మ పండుగను చెప్పవచ్చు. ప్రతి మనిషి జీవితానికి ప్రకృతితో విడదీయరాని అనుబంధం పెనవేసుకుని ఉంటుంది. ప్రకృతి మనిషికి జీవంతో పాటు ఆహ్లాదాన్ని, ఆనందాన్నిస్తుంది. అలాంటి ప్రాశస్త్యం  బతుకమ్మ పండుగకు ఉంది. 9 రోజులపాటు పూలనే దేవతలుగా ఆరాధించే గొప్ప సంప్రదాయం మనది... 9 రోజులు 9 రూపాల్లో బతుకమ్మను తయారుచేసి, పాటలు పాడుతూ భక్తిశ్రద్ధలతో 'బతుకమ్మ' పండుగను తెలంగాణ వ్యాప్తంగా పిల్లాపెద్ద ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకుంటారు.

రకరకాల పూలతో పేర్చిన బతుకమ్మ ఆకారాలను చూస్తే.. లింగం, భూమి, గర్భం, ధాన్యరాశి ఆకారాల్లో కనిపిస్తుంటాయి. అంటే పూలన్నింటినీ గర్భాకారంలో పేర్చి ఆడి, పాడి, పూజించి పునసృష్టికి స్వాగతం పలకడం ఈ పండుగ అంతరార్థంలో కనిపిస్తుంది. మనిషి పుట్టుకకు ఆధారమైన గర్భాన్ని పూజించడం, గౌరవించడం జానపదుల సంస్కృతి. 'బతుకమ్మ'ను గర్భానికి చిహ్నంగా భావిస్తారు కాబట్టి.. గర్భపూజను, మాతృమూర్తి పూజించడమే 'బతుకమ్మ' అంటారు. తొమ్మిది రోజులపాటు జరిగే బతుకమ్మ పండుగను నవమాసాలకు ప్రతీకగా చెప్పవచ్చు. ఈ కారణంగానే బతుకమ్మ పండుగ మహిళల సంతాన సాఫల్యతకు సంబంధించిన పండుగ అని అంటుంటారు. బతుకమ్మ వేడుకల్లో పాడే పాటల్లోనూ గర్భవతులైనవారు ఏ మాసంలో ఏం తినాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలిపే పాటలు ఎక్కుగా వినిపిస్తుంటాయి.

బతుకమ్మ పండుగ ప్రకృతి పండుగగా, భూదేవి పండుగగా చెప్పవచ్చు. ఎందుకంటే ప్రకృతి, భూదేవి అనేవి రెండూ పునరుత్పత్తి రూపాలే. అందుకే బతుకమ్మ పాటల్లో వైద్యం, సేద్యం రెండూ కనిపిస్తాయి. వీటిలో చివరిదైన సద్దుల బతుకమ్మ పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది.

బతుకమ్మ పండుగ తద్వారా తెలంగాణ సంస్కృతి ని విశ్వవ్యాప్తి చెయ్యాలనే సదుద్దేశంతో, అమెరికాలోని మన బావి తరాలకు మన సంస్కృతి విశిష్టత తెలియ చెయ్యాలనే ఉద్దేశ్యం తో అవతరించిన పుట్టిన మొట్ట మొదటి అమెరికా సంఘాలలో  తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్, తెలంగాణ NRI Forum and తెలంగాణ సాంస్కృతిక సంఘం ముఖ్యమయినవి. ఇవే కాకుండా డల్లాస్, అట్లాంటా డిట్రాయిట్ లాంటి మహా నగరాల్లో తెలంగాణ కు ప్రత్యేక సంస్థలు స్థాపించి పండుగకు ప్రాముఖ్యత కల్పించారు.

బతుకమ్మ పండుగ వెనుక అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా పేర్కొనే కథ ఇది. ఒక బాలిక భూస్వాముల అకృత్యాలను భరించలేక ఆత్మహత్య చేసుకుంది. అప్పుడు ఆ ఊరి ప్రజలు అందరూ ఆమెను కలకాలం ‘బతుకమ్మా’ అని దీవించారట. అప్పటి నుంచి ఆ బాలికను కీర్తిస్తూ, గౌరమ్మని పూజిస్తూ స్త్రీలకు సంబంధించిన పండుగగా ‘బతుకమ్మ’ ప్రాచుర్యం పొందింది. ‘బతుకమ్మ’ వేడుక సందర్భంగా స్త్రీలందరూ తమకు ఎలాంటి ఆపదలు రాకూడని, తమ భర్తకు, పిల్లలకు ఎలాంటి ఆపద రాకూడదని గౌరమ్మని వేడుకుంటారు.

మరో వృత్తాంతం..: అలాగే బతుకమ్మ పండుగకి సంబంధించి మరో వృత్తాంతం కూడా ప్రచారంలో ఉంది. దీనిప్రకారం దక్షిణ భారత దేశాన్ని పాలించిన చోళ వంశ చక్రవర్తి ధర్మాంగదుడు సంతానం కోసం పూజలు చేయగా ఆయన భార్య లక్ష్మీ దేవి అనుగ్రహముతో ఒక కూతుర్ని కన్నది. ఆమెకు లక్ష్మి అనే పేరు పెట్టారు. పసిబిడ్డ అయిన లక్ష్మి అనేక గండములను ఎదుర్కొంది. అప్పుడు తల్లితండ్రులు ఆమెకి ‘బతుకమ్మ’ అని పేరు పెట్టారు. అప్పటినుండి యువతులు మంచి భర్తను ప్రసాదించాలని కోరుతూ బతుకమ్మను ఆనవాయితీ అయిందట.

మరో వృత్తాంతం..: మహిషాసురుని చంపిన తర్వాత అలసి సొలసి మూర్ఛపోయిన అమ్మవారికి, మహిళలంతా కలిసి పాటలతో స్పృహ తెప్పించే ప్రయత్నమని మరో కథ ప్రచారంలో ఉంది. ఆత్మత్యాగంతో తెలంగాణలో ఓ పల్లెను వరద బారినుంచి కాపాడిన త్యాగమూర్తే 'బతుకమ్మఅనేవారూ ఉన్నారు. నేపథ్యం ఏదైనా.. 'బతుకమ్మ' సంప్రదాయం ప్రవాసీల జీవితాల్లో ఓ భాగమైంది.

Vijay Chavva
Founder – Telangana Cultural Association/Hello Telangana Radio in USA

 

Tags :