అమిత్ షాను కలవగానే సీఎం యూటర్న్ : భట్టి

అమిత్ షాను కలవగానే సీఎం యూటర్న్ : భట్టి

ధాన్యం కొనుగోలుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్రంపై యుద్ధానికి వెళ్లినందుకు సంతోషంగా ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద భట్టి  మీడియాతో మాట్లాడుతూ రైతు ఉద్యమ అమరులకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలనుకోవడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ సాధనలో అమరులైన కుటుంబాలకు ఏడున్నర ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటికీ న్యాయం జరగలేదన్నారు. వారికి రూ.10 లక్షలు, రెండు పడకగదుల ఇళ్లు ఇస్తామని చెప్పి మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతు చట్టాలకు వ్యతిరేకంగా యుద్ధమే అని రోడ్లపై నిరసన తెలిపి అమిత్‌ షాను కలవగానే యూటర్న్‌ తీసుకున్నారని ఆరోపించారు. మళ్లీ ఇప్పుడు ఢిల్లీపై యుద్ధమే అని మళ్లీ అమిత్‌ షాను కలుస్తా అంటున్నారన్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనేవారు లేరన్నారు. ఢిల్లీలో కేసీఆర్‌ యుద్ధం తేల్చుకుని వచ్చేసరికి ఇక్కడ వడ్లన్నీ మొలకలు వచ్చేలా ఉన్నాయని ఎద్దేవా చేశారు. అమిత్‌ షాను కలవగానే యూటర్న్‌ తీసుకోవద్దు. ప్రభుత్వం చేయాల్సిన పనులు చేయకుండా రాజకీయ పబ్బం గడుపుతున్నారు. ఏడున్నరేళ్ల నుంచి నీటీ వాటా తేల్చలేదని సీఎం అంటున్నారు. మరి సీఎం కేసీఆర్‌ ఇన్నేళ్ల నుంచి ఏం చేస్తున్నారు? ప్రాజెక్టులపై క్లారిటీ ఇవ్వమని అడిగితే ఎన్ని అసెంబ్లీ సమాశాలు పోయినా డీపీఆర్‌లు ఇవ్వరు. కేంద్రం ఏపీ, తెలంగాణకు మధ్య జరుగుతున్న అంశాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు.

 

Tags :