అమెరికా వీసా ఇక మరింత భారమేనా?

అమెరికా వెళ్లాలనుకునే భారతీయుల కల ఇకపై మరింత భారం కానుంది. ఇమ్మిగ్రేషన్ ఫీజులను భారీగా పెంచుతూ బైడెన్ ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. దీంతో హెచ్ 1బీ సహా పలు రకాల వీసా దరఖాస్తు ధరలు మరింత ప్రియం కానున్నాయి. త్వరలోనే అమలులోకి తెచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇమిగ్రేషన్ ఫీజుల పెంపు ప్రతిపాదనలను అమెరికా పౌరసత్వం, వలస సేవల విభాగం (యూఎస్సీఐఎస్) తమ వెబ్సైట్లో వెల్లడించింది. దాని ప్రకారం, హెచ్-1బీ వీసా దరఖాస్తు ధరను 460 డాలర్ల నుంచి 780 డాలర్లకు పెంచింది. ఎల్-1 వీసా ధర 460 డాలర్ల నుంచి ఏకంగా 1385 డాలర్లకు పెంచాలని ప్రతిపాదించింది. ఇక హెచ్ 2బీ వీసా ధరను 460 డాలర్ల నుంచి 1,080 డాలర్లను పెంచాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదనలను 60 రోజుల పాటు వెబ్సైట్లో ఉంచి వారి అభిప్రాయాలను స్వీకరిస్తారు. ఆ తరువాతే దీన్ని అమలులోకి తెచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఖర్చు భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగానే ఫీజులను పెంచినట్లు యూఎస్సీఐఎస్ వెల్లడించింది.