రెండు దేశాల ఏర్పాటుకు కట్టుబడి ఉన్నాం : బైడెన్

పాలస్తీనియన్లకు స్వతంత్ర దేశం ఏర్పాటు అనేది చాలా దూరంగా వున్నట్లు అనిపించవచ్చునని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు. పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మహ్మద్ ఆబ్బాస్తో కలిసి బెత్లెహామ్‌లో జరిగిన కార్యక్రమంలో బైడెన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాలస్తీనియన్లకు 3.16 కోట్ల డాలర్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. అయితే ఇజ్రాయిల్‌తో శాంతి చర్యలకు సంబంధించి ఎలాంటి ప్రస్తావన చేయలేదు. చర్చలు పునరుద్ధరించడానికి ఇది సరైన సమయం కానప్పటికీ పాలస్తీనియన్లను ఇజ్రాయిలీలను మరింత సన్నిహితం చేయాలన్న ఆలోచనలను, ఆశలను ఆమెరికా ప్రజలు, మా ప్రభుత్వం వదలుకోదు అని బైడెన్ పేర్కొన్నారు.
పాలస్తీనా ప్రజలు స్వంతంగా, సార్వభౌమాధికారంతో కూడిన దేశం కలిగి వుండేందుకు అర్హులు. రెండు దేశాల ఏర్పాటే పరిష్కారమార్గం. ఇరు వర్గాలూ ఈ భూభాగంలో ప్రాచీన మూలాలు కలిగి వున్నాయి. శాంతి, భద్రలతో పక్క పక్కనే సజీవనం సాగించాలి అని పేర్కొన్నారు.