MKOne TeluguTimes-Youtube-Channel

వైద్యచరిత్రలో మరో మైలురాయి

వైద్యచరిత్రలో మరో మైలురాయి

మారుమూల పల్లెలకు సైతం 108, 104 సేవలను అందుబాటులోకి తెచ్చిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌­రెడ్డి నిరుపేదల పాలిట ప్రాణదాతగా నిలిచారు. ఎవరైనా అనారోగ్యం బారిన పడినా.. ఎక్కడ ప్రమాదం జరిగినా ‘కుయ్‌.. కుయ్‌..’మంటూ రయ్యిన అంబులెన్స్‌లు వచ్చి వాలిపోయేలా చేసిన ఘనత వైఎస్‌కే దక్కింది. ఆయన తనయుడుగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 108, 104 సేవలను మరింత ముమ్మరం చేశారు. 108 అంబులెన్స్‌లు, ఫీడర్‌ అంబులెన్స్‌లు సైతం వెళ్లలేని మారుమూల కొండ ప్రాంతాలకు సైతం వెళ్లేలా బైక్‌ అంబులెన్స్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నా­రు. కొండలు, గుట్టలు దాటి గిరిజనుల చెంతకు వెళ్లేలా కాకినాడ జేఎన్‌టీయూ ప్రొఫెసర్, డిజైన్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ డైరెక్టర్‌ అల్లూరు గోపాలకృష్ణ రూపొందించిన బైక్‌ అంబులెన్స్‌లను రాష్ట్రవ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాలకు సమకూర్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చర్యలు చేపట్టారు. ఈ వినూత్న కార్యక్రమం త్వరలో సాకారం కానుంది. తొలి దశలో 108 బైక్‌ అంబులెన్స్‌లను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం టెండర్లు కూడా పిలిచింది. ఈ బైక్‌ అంబులెన్స్‌ వాహనం డ్రైవింగ్‌తో పాటు కనీస వైద్య సేవలందించేలా శిక్షణ ఇచ్చేందుకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి.

మారేడుమిల్లి ఘటనతో చలించిపోయి..

ఏజెన్సీ ప్రాంతాల్లో అంబులెన్స్‌లు వెళ్లే దారిలేక సకాలంలో వైద్యమందక కొండలపై ఉండే గిరిజనులు ప్రాణాలు కోల్పోతున్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న కాలంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గ పరిధిలోని మారేడుమిల్లి మండలం చాపరాయిలో 12 మంది మృతిచెందారు. ఆ విషాదకర ఘటనను చూసి చలించిపోయిన జగన్‌ గిరిజనుల ప్రాణాలు కాపాడేందుకు ఏదో ఒక ప్రత్యామ్నాయం ఉండాలని పరితపించారు. అందుకనుగుణంగానే గతేడాది నుంచి ప్రత్యామ్నాయ అంబులెన్స్‌ తీసుకురావాలనే ప్రయత్నంలో ప్రాజెక్టు రూపకల్పన బాధ్యతను జేఎన్‌టీయూ(కాకినాడ)కి అప్పగించారు. ఈ నేపథ్యంలోనే జేఎన్‌టీయూ ప్రొఫెసర్‌ గోపాలకృష్ణ పట్టుదలతో ద్విచక్ర వాహ­నా­న్ని తలపించే బైక్‌ అంబులెన్స్‌ను ఆవిష్కరిం­చారు. ప్రపంచంలోనే ద్విచక్ర వాహనంతో కూడిన అంబులెన్స్‌ సిద్ధం చేయడం ఇదే తొలిసారి కావడంతో దీనికి పేటెంట్‌ హక్కులు కూడా లభించాయి. ఇంతవరకు కొండలపై ఉండే గిరిజన తండాలలో వైద్య సేవలకోసం మూడు చక్రాల(ఫీడర్‌) అంబులెన్స్‌లను వినియోగిస్తున్నా­రు. అసలు రహదారి అంటూ లేకుండా కొండలపై నివసించే గిరిజనుల వద్దకు నేరుగా వెళ్లి వైద్య సేవలందించేందుకు వీలుగా బైక్‌ అంబులెన్స్‌ను రూపొందించారు. అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా చింతలగూడెంలో గర్భిణులను తరలించడం ద్వారా వీటికి ట్రయల్‌ రన్‌ కూడా పూర్తయ్యింది. ఈ వినూత్న ఆవిష్కరణను కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. ఇందుకోసం రూ.5 కోట్లను రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖకు కేటాయించింది.

యాప్‌తో జీపీఎస్‌కు అనుసంధానం

బైక్‌ అంబులెన్స్‌ను పర్యవేక్షించేందుకు ప్రత్యేక యాప్‌ రూపొందించారు. ఈ యాప్‌ను జీపీఎస్‌కు అనుసంధానించడంతో రోగుల సమాచారం సమీ­పంలోని పీహెచ్‌సీ లేదా 108 వాహనాలకు వివరాలను చేరవేస్తుంది. 4 జీబీ ర్యామ్, 14 జీబీ స్టోరేజ్‌ కలిగిన 7.1 ఇంచ్‌ టచ్‌ స్క్రీన్‌ డిస్‌ప్లేతో కూడిన చిప్, శాటిలైట్‌ బేస్‌ నెట్‌వర్కింగ్‌ సిస్టమ్‌ ఇందులో ఉంటాయి. పేషెంట్‌ వచ్చేలోపు వైద్యానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తారు. అత్యవస­రమైతే డాక్టర్‌తో వీడియో కాల్‌చేసే సౌకర్యం ఇందులో ఉంది. వాహనానికి దు­­­మ్ము, వర్షం, ఎండ నుంచి రక్షణకు టాప్‌ ఏర్పా­టు చేశారు. అంబులెన్స్‌ లైట్లు,సైరన్, గ్లూకోమీటర్, పల్స్‌ ఆక్సీమీటర్, యాంటీ స్కిడ్డింగ్, ట్యూబ్‌లెస్‌ టైర్లు, రక్త పరీక్షల నమూనా కోసం కోల్డ్‌స్టోరేజ్‌ కంటైనర్, మోటార్‌ యాక్టివే­టె­­డ్‌ స్టాండ్‌ ఉంటాయి. ప్రథమ చికిత్సకు అవసరమైన అన్ని పరికరాలు, మందులు ఇందులో ఉంటాయి. 

వైద్యచరిత్రలో మైలురాయిగా నిలుస్తుంది..

బైక్‌ అంబులెన్స్‌ ద్వారా కార్డియాక్‌ అరెస్ట్, పెరాలసిస్‌ వంటి గుండె సంబంధిత రోగులకు తక్షణ వైద్యం అందించే అవకాశం లభిస్తుంది. యూనివర్సిటీలో ఉన్న డిజైన్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ ద్వారా బైక్‌ అంబులెన్స్‌ను రూపొందించడం సంతోషంగా ఉంది. ఇది వైద్య చరిత్రలో ప్రభుత్వానికి మైలురాయిగా మిగులుతుంది. ఇప్పటివరకు దేశంలో మరే రాష్ట్రంలోనూ ఈ తరహా ఆలోచన చేయలేదు. తొలిసారి మన రాష్ట్రంలో చేపట్టిన ఈ వినూత్న బైక్‌ అంబులెన్స్‌  ఇతర రాష్ట్రాల్లో కూడా ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఉన్నాయి.

సాధారణంగా నాలుగు చక్రాల అంబులెన్స్‌ ప్రయాణించాలంటే కనీసం 6 అడుగులు రోడ్డు మార్గం ఉండాలి. అదే 3 చక్రాల ఫీడర్‌ అంబులెన్స్‌కు 3 నుండి 4 అడుగుల రోడ్డు మార్గం ఉండాలి. రెండు చక్రాలతో నడిచే ఈ బైక్‌ అంబులెన్స్‌కు అడుగు నుంచి అడుగున్నర దారి లేదా కాలిబాట ఉన్నా సులభంగా ప్రయాణిస్తుంది. కొండలు, గుట్టల్ని కూడా ఎక్కేస్తుంది. డ్రైవింగ్‌ సీటు వెనుక పేషెంట్‌ కూర్చునేందుకు వీలుగా ఒక సీటును 90 డిగ్రీల కోణంలో రౌండ్‌గా తిరిగేలా అమర్చారు. 110 డిగ్రీల కోణంలో వెనుకకు వంగి సౌకర్యవంతంగా ఉండేలా ఏర్పాటు చేశారు. రోగి కూర్చున్న వెంటనే లాక్‌ అయ్యేలా ఆటోమేటిక్‌ లాకింగ్‌ సిస్టమ్‌ కూడా ఏర్పాటు చేశారు. ఈ వాహనం వ్యయం రూ.4 లక్షలు అవుతుంది. ఇందుకు బజాజ్‌ కంపెనీకి చెందిన అవెంజర్‌ వాహనాన్ని ఎంపిక చేశారు. టైమ్‌ షెడ్యూల్, అలారమ్‌ కోడ్స్, పానిక్‌ బటన్‌ (వైద్య అవసరాన్ని బట్టి వినియోగించే ఎరుపు, పసుపు, నీలం) ఏర్పాటు చేశారు.

 

 

Tags :