రివ్యూ: బింబిసారుడుగా కళ్యాణ్ రామ్ మెప్పించాడు

రివ్యూ: బింబిసారుడుగా కళ్యాణ్ రామ్ మెప్పించాడు

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 3.5/5
నిర్మాణ సంస్థ: యన్టీర్ ఆర్ట్స్,
నటీనటులు: నందమూరి కళ్యాణ్ రామ్, కేథరిన్ త్రెసా, సంయుక్త మీనన్, ప్రకాష్ రాజ్, బ్రహ్మాజీ,  వారినా హుస్సేన్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి,సాయి కిరణ్, అయ్యప్ప పి శర్మ తదితరులు నటించారు.  
సినిమాటోగ్రఫీ: ఛోటా కె. నాయుడు, ఎడిటర్: తమ్మి రాజు,
మాటలు :వాసుదేవ్ ముణెప్పగారి, పాటల రచయితలు: శ్రీ మణి, ఎం ఎం కీరవాణి, వరికుప్పల యాదగిరి,
పాటల సంగీత దర్శకులు : ఎం ఎం కీరవాణి, చిరంతన్ భట్, వరికుప్పల యాదగిరి,
నేపధ్య సంగీతం: ఎం ఎం కీరవాణి, నిర్మాత: హరికృష్ణ కొసరాజు
దర్శకత్వం : మల్లిడి వశిష్ట్
విడుదల తేదీ: 05.08.2022

హీరోగా, నిర్మాత‌గా న్యూ టాలెంటెడ్ డైరెక్టర్స్ ని టాలీవుడ్ కి పరిచయం చేస్తూ... వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న హీరోల్లో సెల్యులాయిడ్ సైంసిస్ట్ నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ఒక‌రు. క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌తో పాటు ఓం వంటి త్రీడీ సినిమాను కూడా చేశారు. జ‌యాప‌జ‌యాలకు సంబంధం లేకుండా డిఫ‌రెంట్ రోల్స్ చేస్తూ వ‌చ్చారు. ఈ క్ర‌మంలో నందమూరి క‌ళ్యాణ్ రామ్ చేసిన మ‌రో కొత్త ప్ర‌య‌త్న‌మే ‘బింబిసార’ మూవీ. ఫాంటసీ, పీరియాడిక్ సినిమాగా తెరకెక్కిన ‘బింబిసార’లో క‌ళ్యాణ్ రామ్ టైటిల్ పాత్ర‌లో న‌టించారు. క‌ళ్యాణ్ రామ్ వశిష్ట్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ...  ఒక యూనిక్ కాన్సెప్ట్ తో ఫాంటసీ చిత్రం ఇది. ఈ చిత్రం టీజ‌ర్‌, ట్రైల‌ర్ల అంచ‌నాల‌ను మ‌రింత‌గా పెంచాయి. గత కొన్నాళ్ల నుంచి టాలీవుడ్ లో ఎలాంటి పరిస్థితి నెలకొందో చూస్తున్నాము. ఇటీవల  విడుదల అయిన సినిమాలు వచ్చినవి వచ్చినట్లే ఫాస్ట్ గా  ఓటిటి లో రిలీజ్ అవుతున్నాయి.  మరి ఈ చిత్రం అంచనాలు అందుకుందా లేదా అనేది సమీక్షలో చూద్దాం రండి.

క‌థ‌:

క్రీస్తు పూర్వం 500 ఏళ్లకు ముందు త్రిగ‌ర్త‌ల సామ్రాజ్యాన్ని అత్యంత క్రూరంగా  పాలిస్తుంటాడు. ఎలాంటి జాలి, దయ లేకుండా తనకి కావాల్సిన దానిని సొంతం చేసుకునే క్రమంలో బింబిసారుడు (నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌) అనుకోని శాపానికి గురవుతాడు. త్రిగ‌ర్త‌ల రాజ్యంలోని స‌రిహ‌ద్దు ప్రాంతంలో, అత‌ని స్నేహితుడిని కొంద‌రు దుండ‌గులు త‌రుముతుంటారు. వారి నుంచి త‌ప్పించుకునే ప్ర‌య‌త్నంలో ఓ గుహ‌లోకి వెళ‌తాడు. అక్క‌డ అనుకోకుండా త‌న‌కొక అద్భుత‌మైన వ‌స్తువు దొరుకుతుంది. అక్క‌డ నుంచి సీన్ క‌ట్ చేస్తే 1974లో శాస్త్రి అనే ఓ సంప‌న్నుడు (భ‌ర‌త్ రెడ్డి) కేతు (అయ్య‌ప్ప పి.శ‌ర్మ‌)తో క‌లిసి ధ‌న్వంత‌రి అనే గ్రంథం కోసం బింబిసారుడుకి సంబంధించిన గుహ వ‌ద్ద‌కు చేరుకుంటాడు. ఆ గుహ త‌లుపును తాక‌గానే శాస్త్రి చనిపోతాడు. అత‌ని కొడుకు సుబ్ర‌మ‌ణ్య శాస్త్రి (వివాన్ భాటేన) పెద్ద డాక్ట‌ర్‌గా ఎదుగుతాడు. అత‌ను కూడా కేతు సాయంతో ధ‌న్వంతరి గ్రంథాన్ని వెతుకుతుంటాడు. ఆ స‌మ‌యంలో ఊహించ‌ని నిజాన్నికేతు అత‌నికి చెబుతాడు. అదేంటంటే బింబిసారుడు కాలాన్ని ఎదురీది ప్రస్తుత కాలంలోకి వ‌స్తాడ‌ని చెబుతాడు. అన్న‌ట్లుగానే బింబిసారుడు భూమ్మీదకి చేరుకుంటాడు.  మరి గతం నుంచి ఈ ఆధునిక యుగానికి వచ్చిన బింబిసారుడికి ఎదురైన సవాళ్లు ఏంటి? తనకి కలిగిన శాపం ఏంటి? క్రూరుడైన బింబిసారుడు మంచి వాడుగా మారాడా? చివరికి మళ్ళీ తాను తన కాలానికి శాశ్వతంగా వెళతాడా లేక ఇదే ఆధునిక ప్రపంచంలో ఉండిపోతాడా అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే.

నటి నటుల హావభావాలు:

న‌టీన‌టుల విషయానికి వ‌స్తే.. అత‌నొక్క‌డే, త్రీడీ మూవీగా తెరకెక్కిన ఓం, అవుట్ అండ్ అవుట్ కామెడీ గా పటాస్  వంటి సినిమాల‌ను గ‌మ‌నిస్తే హీరోగా, నిర్మాత‌గా చేసిన క‌ళ్యాణ్ రామ్ స్టైల్‌ను ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు. సినిమా పై  ప్యాష‌న్‌తో బింబిసార సినిమాలో యాక్ట్ చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయన చేయని  చ‌క్ర‌వ‌ర్తి పాత్ర‌ను పోషించి మెప్పించాడు. కానీ ఏదో ఒక వెరైటీని అందించాల‌నే ల‌క్ష్యంతో డిఫ‌రెంట్ లుక్‌, బాడీ లాంగ్వేజ్‌ను ఆపాదించుకుని బింబిసారుడు అనే పాత్ర‌ను క్యారీ చేశాడు. ఆ పాత్ర కోసం త‌ను ఎంత క‌ష్ట‌ప‌డ్డాడ‌నేది సినిమాలో తెర‌పై క‌నిపిస్తుంది. లుక్‌తో పాటు డైలాగ్ డెలివ‌రీని ఆయ‌న చేంజ్ చేసుకున్నారు. అంతే కాకుండా అయన తాతగారు మహా నటులు ఎన్టీర్ దుష్ట పాత్రలకు కూడా హీరోయిజం ఆపాదించి ప్రేక్షకుల చేత జె జె లు కొట్టించారు. అదే విధంగా ఇప్పుడు మనవడు కళ్యాణ్రామ్  నెగిటివ్ ట‌చ్‌లో సాగే ఈ పాత్ర‌లో విల‌నిజాన్ని చూపించ‌డానికి వంద శాతం ట్రై చేశారు. అందులో స‌క్సెస్ అయ్యారు. ఇక కాలాన్ని ఎదురీది ప్ర‌స్తుత కాలానికి వ‌చ్చిన త‌ర్వాత త‌ను ఎదుర్కొనే ప‌రిస్థితులు అత‌నిలో మార్పును తీసుకొస్తున్నప్పుడు ప‌డే సంఘ‌ర్ష‌ణ తాలుకు హావ‌భావాల‌ను కూడా చ‌క్క‌గా చూపించారు. అదే స‌మ‌యంలో బింబిసారుడి నిధి, అత‌ని వ‌ద్ద ఉన్న అమూల్య‌మైన ధ‌న్వంత‌రి గ్రంథం కోసం విల‌న్స్ అత‌న్ని ఇబ్బంది పెట్టాల‌నుకున్న‌ప్పుడు క‌ళ్యాణ్ రామ్ సిల్వ‌ర్ స్క్రీన్‌పై చూపించిన హీరోయిజం బావుంది. యాక్ష‌న్ పార్ట్ బావుంది. ముఖ్యంగా సెంకండాఫ్‌లో పాప‌ను కాపాడేట‌ప్పుడు వ‌చ్చే ఫైట్ ఆక‌ట్టుకుంటుంది. బింబిసారుడు పాత్రలో క‌ళ్యాణ్ రామ్ ఒదిగిపోయారు. సినిమాను త‌నే అయ్యి ముందుకు న‌డిపించారు. ఇక మెయిన్ విల‌న్‌గా న‌టించిన వివాన్  త‌న ప‌రిధి మేర‌కు చ‌క్క‌గా న‌టించారు. హీరోయిన్స్‌గా న‌టించిన క్యాథ‌రిన్ ట్రెసా , సంయుక్తా మీన‌న్ పాత్ర‌లు ప‌రిమితంగానే ఉన్నాయి. జుబేదా పాత్ర‌లో శ్రీనివాస రెడ్డి కామెడీతో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు. అలాగే చ‌మ్మ‌క్ చంద్ర పాత్ర చిన్న‌దే అయినా న‌వ్వించారు. ప్ర‌కాష్ రాజ్‌, రాజీవ్ క‌న‌కాల త‌దిత‌రులు పాత్ర‌ల ప‌రిధి మేర‌కు త‌మ‌దైన న‌ట‌న‌తో అల‌రించారు.

సాంకేతిక వర్గం పనితీరు:

కొత్త  ద‌ర్శ‌కుడు వ‌శిష్ట‌ను ముందుగా అభినందించాలి... కళ్యాణ్ రామ్ మరో టాలెంటెడ్ దర్శకుడిని టాలీవుడ్ కి అందించారనే చెప్పొచ్చు. రెండు టైమ్ పీరియ‌డ్స్‌ను బ్యాలెన్స్ చేస్తూ క‌థ‌ను రాసుకున్న తీరు.. దాన్ని తెర‌కెక్కించిన తీరు బావుంది. నిజంగా కొత్త ద‌ర్శ‌కుడనే భావ‌న లేకుండా సినిమాను చ‌క్క‌గా ముందుకు న‌డింపించ‌టంలో వ‌శిష్ట స‌క్సెస్ అయ్యాడు. సినిమాని గత ఏడాదిలో షాకింగ్ గా అనౌన్స్ చేసినప్పుడే ఈ కథ చాలా ఆసక్తి రేపింది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ ని టైం ట్రావెల్ అనే యూనిక్ పాయింట్ తో ఎలా చూపిస్తారా అనేది ఎగ్జైటింగ్ గా అనిపించింది. మరి దీన్నైతే తాను చాలా మెచ్యూర్ గా సాలిడ్ ఎమోషన్స్ లాజిక్స్ తో ఎస్టాబ్లిష్ చేసి ఆడియెన్స్ కి భారీ విజువల్ ట్రీట్ ని అందించాడు. ఇక సినిమాకు చిరంత‌న్ భ‌ట్ సంగీతం అందించిన పాట‌లు జ‌స్ట్ ఓకే. ఇక కీర‌వాణి  బ్యాగ్రౌండ్ స్కోర్ సన్నివేశాల‌ను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లాయి. ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ బావుంది. వి ఎఫ్ ఎక్స్ టీం ఎఫర్ట్స్ సూపర్బ్. ఇక వీటితో పాటుగా కీరవాణి సంగీతం, స్కోర్ కోసం కూడా ఆల్రెడీ మెన్షన్ చేయడం జరిగింది. చిరంతన్ భట్ అందించిన పాటలు బాగున్నాయి. కిరణ్ కుమార్ మన్నే ఆర్ట్ డైరెక్షన్ టీం వర్క్ బాగుంది. అలాగే డైలాగ్స్ అందించిన వాసుదేవ్ మునెప్పగరి సాలిడ్ వర్క్ అందించారు. ఇంకా ఎడిటర్ తమ్మిరాజు ఎడిటింగ్ కూడా ఎక్కడా కన్ఫ్యూజన్ లేకుండా చాలా క్లీన్ గా ఉంది. నిర్మాతగా కొసరాజు హరి కృష్ణ ఎన్టీర్ ఆర్ట్స్ బ్యానర్ లో మంచి సాంకేతిక విలువ‌ల‌తో ధైర్యంగా సినిమా తీసి బ్యానర్ ప్రతిష్టను మరింతగా పెంచారు.

విశ్లేషణ:

డిఫ‌రెంట్ సినిమాలు చేస్తే ఆడియెన్స్ ఆద‌రిస్తారు. ముఖ్యంగా తెలుగు ప్రేక్ష‌కులు భాష‌తో సంబంధం లేకుండా మంచి సినిమాల‌ను ఆద‌రిస్తార‌న‌టంలో ఎలాంటి సందేహం లేదు. ఆ న‌మ్మ‌కంతోనే హీరో క‌ళ్యాణ్ రామ్ చేసిన ప్ర‌య‌త్నం బింబిసార చిత్రం. ఫాంట‌సీ మూవీ. అందులో రాజులు, రాజ్యాలు అనే పాయింట్‌ను నేటి కాలానికి జ‌త చేస్తూ చెప్ప‌ట‌మ‌నేది చాలా క‌ష్ట‌త‌ర‌మైన విష‌యం. కానీ ద‌ర్శ‌కుడు వ‌శిష్ట చెప్పిన క‌థ‌పై న‌మ్మ‌కంతో క‌ళ్యాణ్ రామ్ హీరోగా టైటిల్ రోల్ చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. అదే న‌మ్మ‌కంతో నిర్మాత హ‌రికృష్ణ సినిమాను భారీ బ‌డ్జెట్‌తో చిత్రాన్ని నిర్మించారు. ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “బింబిసార” తో ఒక్క చిత్ర యూనిట్ కోరుకున్న విజయంతో పాటుగా తెలుగు సినీ పరిశ్రమకు కూడా అత్యవసరంగా ఎదురు చూస్తున్న హిట్ దొరికిందని  అని చెప్పాలి. నందమూరి కళ్యాణ్ రామ్ నట విశ్వరూపం, సినిమాలోని విజువల్స్, సంగీతం ఇలా అన్నిటినీ మించి దర్శకుడు వశిస్థ్ సిన్సియర్ ఎఫర్ట్స్ ఆడియెన్స్ ని ఒక కొత్త లోకానికి తీసుకెళ్తాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాను థియేటర్లో కుటుంబ సమేతంగా చూస్తేనే టికెట్ పై పెట్టిన సొమ్ముకు న్యాయం జరుగుతుందని చెప్పొచ్చు. 

 

Tags :
ii). Please add in the header part of the home page.