కుమారుడిని సీఎం చేయడమే కేసీఆర్ ఏకైక లక్ష్యం

కుమారుడిని సీఎం చేయడమే కేసీఆర్ ఏకైక లక్ష్యం

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ రాజ్యాంగమే నడవాలన్నట్లు ఈ ప్రభుత్వ వైఖరి ఉందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ విమర్శించారు. యాదగిరిగుట్టలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం సందర్భంగా నిర్వహించిన సభలో ఈటల మాట్లాడారు. కుమారుడిని సీఎం చేయడమే కేసీఆర్‌ ఏకైక లక్ష్యంగా ఉందని ఆరోపించారు. బీజేపీపై పూర్తిగా అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ మంత్రుల్లో సగం మంది తెలంగాణ వద్దన్న వాళ్లే. కేసీఆర్‌ పాలనలో సామాజిక న్యాయం  లేదన్నారు. 8 ఏళ్ల పాలనలో ప్రధాని మోదీ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదన్నారు. 8 ఏళ్ల పాలనలో సీఎం కేసీఆర్‌ ఒక్కరోజు కూడా సచివాలయానికి రాలేదు. ఈ 8 ఏళ్లలో సాధారణ ప్రజలు సీఎంను కలిసే భాగ్యం దక్కిందా? అని ప్రశ్నించారు.

టీఆర్‌ఎస్‌ నేతలు దళితుల అసైన్డ్‌ భూములు గుంజుకుంటున్నారు. కేసీఆర్‌ ఉంటే ప్రగతిభవన్‌లో, లేకపోతే పామ్‌హౌస్‌లో ఉంటారు. ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు మాత్రం రారు అన్నారు. ఫారెస్టు భూముల పేరుతో గిరిజనుల భూములు గుంజుకుంటున్నారు. కేసీఆర్‌కు బుద్ధి చెప్పే అవకాశం నల్గొండలో రాబోతోంది. కేసీఆర్‌ పరిపాలన అంతమొందించడమే బీజేపీ కర్తవ్యం అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నేతలు అధికారంలోకి వస్తారని మిడిసి పడుతున్నారు. కాంగ్రెస్‌కు మూలమైన యూపీలోనే 2 సీట్లు వచ్చాయి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ అంతరించపోయింది. కొంత మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సైతం బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు అని అన్నారు.

 

Tags :