అదే జరిగి ఉంటే వైసీపీ 150 సీట్లు గెలిచేదే కాదు

అదే జరిగి ఉంటే వైసీపీ 150 సీట్లు గెలిచేదే కాదు

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి కోసం ప్రధాని మోదీ రూ.2,500 కోట్లు కేటాయించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. బీజేపీ పెనుమాక సభలో సోము వీర్రాజు మాట్లాడుతూ ఐదేళ్ల పాలనలో రూ.వేల కోట్లు ఖర్చు చేసి రాజధాని నిర్మాణం కొంత వరకే చేశారన్నారు. రాజధాని కడతానని చెప్పిన జగన్‌ అధికారంలోకి రాగానే మాట మార్చి మూడు రాజధానుల ప్రస్తావన తీసుకొచ్చారన్నారు. ప్రధాని మోదీ రాష్ట్రానికి ఏం చేశారని చాలా మంది అడుగుతున్నారు. విజయవాడలో ఐదు ఫ్లైఓవర్లు కట్టించారు. అమరావతి నుంచి మచిలీపట్నం మధ్య నాలుగు వరుసల రహదారి వేశాం. జాతీయ రహదారులు అభివృద్ధి చేస్తున్నారు. ఇవన్నీ కేంద్రం చేస్తున్న పనులు కావా? మోదీ తలుచుకుంటే రాజధాని నిర్మాణం కాదా అని  చాలామంది అడుగుతున్నారు.

వైసీపీ ప్రభుత్వ పాలనలో రైతులకు అన్యాయం జరిగిందన్నారు. కేంద్రం ఇచ్చే నిధులు దారి మళ్లిస్తున్నారు. పంచాయతీలకు కేంద్రం మంజూరు చేస్తున్న నిధులను కూడా రాష్ట్రం ఇవ్వడం లేదు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రధానితో కలిసి ఉంటే ఏపీ రాజధాని నిర్మాణం ఎప్పుడో జరిగిపోయేది. అదే జరిగి ఉంటే వైసీపీ 150 సీట్లు గెలిచేది కాదన్నారు. అభివృద్ధి మా అజెండా, వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించి బీజేపీ నాయకత్వలోని ప్రభుత్వాన్ని తీసుకురావాలి. అప్పుడే రెండేళ్లలో రాజధానిని నిర్మించే బాధ్యత బీజేపీది. మేం సీఎం జగన్‌ను రక్షిస్తున్నామని ఓ పెద్దాయన అన్నారు. మేం ఎవరినీ రక్షించడం లేదు. సరైన సమయంలో జరగాల్సినవన్నీ జరుగుతాయి అని అన్నారు.

 

Tags :