ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు ?

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడు ?

రాష్ట్రపతి ఎన్నిక తేదీ సమీపిస్తోన్న వేళ అభ్యర్థి ఎంపికపై బీజేపీ కసరత్తు ముమ్మరం చేసింది. ఈ ఎన్నికకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడిని ఎన్డీయే అభ్యర్థిగా బరిలోకి దించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయమై బీజేపీ పెద్దలు వెంకయ్య నాయుడితో సమావేశమయ్యారు. వెంకయ్య నివాసంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆయనతో భేటీ అయ్యారు. దాదాపు 50 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. రాష్ట్రపతి అభ్యర్థిపై చర్చించేందుకు బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ కానున్న తరుణంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీ ప్రధాన కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగనుంది. ఈ భేటీలో రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై చర్చించనున్నట్లు సమాచారం. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా పలువురు పేరు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అందులో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేరు కూడా పరిశీలనలో ఉంది. ఈ ఎన్నికల కోసం పలువురు కేంద్ర మంత్రులు, ముగ్గురు ప్రధాన కార్యదర్శులు సహా 14 మంది నేతలతో బీజేపీ ఇప్పటికే ఓ కమిటీని ఏర్పాటు చేసింది.

 

Tags :