కేంద్ర మంత్రి నారాయణ్ రాణే బంగళాలో అక్రమ నిర్మాణాలను కూల్చేయాలని హైకోర్టు ఆదేశం

కేంద్ర మంత్రి నారాయణ్ రాణే బంగళాలో అక్రమ నిర్మాణాలను కూల్చేయాలని హైకోర్టు ఆదేశం

కేంద్ర మంత్రి, బీజేపీ నేత నారాయణ్ రాణేకు బోంబే హైకోర్టు షాకిచ్చింది. మహారాష్ట్రలోని జుహూలో ఆయనకు బంగళా ఉంది. దీనిలో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని మంగళవారం నాడు హైకోర్టు తీర్పునిచ్చింది. ఇలా అక్రమ నిర్మాణాలు చేపట్టినందుకు రూ.10 లక్షలు జరిమానా చెల్లించాలని మంత్రిని ఆదేశించింది. ముందుగా అనుమతి పొందిన ప్లాన్‌లో మార్పులు చేసి, నిబంధనలు ఉల్లంఘించినట్లు బృహన్ ముంబై నగరపాలక సంస్థ (బీఎంసీ) నారాయణ్  రాణేకు గతంలో నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ముంబై నగర పాలక సంస్థ చట్టంలోని సెక్షన్ 351 ప్రకారం ఈ నోటీసులు జారీ చేశారు. బంగళా నిర్మాణంలో అనధికారిక మార్పులు చేసి, నిబంధనలు ఉల్లంఘించారని అధికారులు ఆరోపించారు. ఈ క్రమంలోనే జుహులో ఆయన నిర్మించిన బంగళా నిర్మాణంలో కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనలను రాణే ఉల్లంఘించారని సామాజిక కార్యకర్త సంతోష్ దౌండ్కర్ ఫిర్యాదు చేశారు. దీంతో బృహన్ ముంబై నగర పాలక సంస్థ అధికారులు ఈ ఏడాది ఫిబ్రవరిలో సదరు బంగళాలో తనిఖీలు చేశారు. రాణే వద్ద ఉన్న దస్తావేజులు, ఫొటోలను పరిశీలించారు. అప్పట్లో ఈ విషయంపై మాట్లాడుతూ.. నారాయణ్ రాణే బంగళా నిర్మాణంలో తాను అన్ని నిబంధనలను పాటించానని చెప్పారు. అప్పట్లో ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన, నారాయణ్ రాణే కుటుంబం మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. అందుకే ఉద్ధవ్ థాకరే తనకు ఈ నోటీసులు పంపించారని ఆరోపించారు.

 

Tags :