ఒక సమీక్ష: “మొట్టమొదటి కెనడా తెలుగు సాహితీ సదస్సు & 12వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు”

ఒక సమీక్ష: “మొట్టమొదటి కెనడా తెలుగు సాహితీ సదస్సు & 12వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు”

మిత్రులారా,

గత వారాంతం లో ..అనగా సెప్టెంబర్ 25-26, 2021 (శనివారం, ఆదివారం) తారీకులలో కెనడా ప్రధాన కేంద్రంగా అంతర్జాలంలో జరుగుతున్న “మొట్టమొదటి కెనడా తెలుగు సాహితీ సదస్సు  & 12వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు”  అత్యంత విజయవంతంగా జరిగింది.

స్వర్గీయ ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం గారికి అంకితం ఇవ్వబడిన ఈ సాహితీ సదస్సుని కెనడా లోని ఆల్బెర్టా రాష్ట్ర మంత్రి గౌ. శ్రీ ప్రసాద్ పండా గారు ప్రారంభిస్తూ తన రాజకీయ ప్రస్థానం లో అక్కడి వారికి తెలుగు భాష గురించి చెప్పే అవకాశం తనకు లభించింది అనీ, ఇటువంటి సదస్సుల నిర్వహణ ఉభయ దేశాలలో తెలుగు భాష మనుగడకి దోహదం చేస్తాయి అనీ ప్రశంశించారు. ప్రముఖ రచయిత, నటుడు శ్రీ తనికెళ్ళ భరణి నిర్వాహకుల ప్రశ్నలకి సమాధానాల రూపం లో తన సందేశాన్ని వినిపిస్తూ ఇండియాలో ముందు ముందు తెలుగు నేర్చుకోవాలి అంటే కెనడా-అమెరికా దేశాలలోని తెలుగు వారి నుంచే నేర్చుకునే పరిస్థితి వస్తుందేమో అని చమత్కరిస్తూ, తెలుగు రాష్ట్రాలలో భాషా సాహిత్యాల పరిస్థితిని వివరించారు. మొదటి రోజు ప్రారంభ సభలో కెనడా తెలుగు సాహిత్య వికాసం గురించి శ్రీమతి సరోజ కొమరవోలు సాధికారంగా సమీక్షించగా, సాహిత్య పోషణ లో తాత్వికత చోటు చేసుకోవలసిన ఆవశ్యతని డా. శారదా పూర్ణ శొంఠి వివరించారు. కెనడాలో అధికార భాష అయిన ఫ్రెంచ్ బాష లోనే కాక తెలుగులో కూడా ప్రావీణ్యత ఉన్న ఫ్రెంచ్ పౌరుడు, ప్రొఫెసర్ డెనియల్ నెజెర్స్ మాట్లాడుతూ ఆ రెండు బాషల అనువాద ప్రక్రియలో తన నిరంతర కృషిని సాదోహరణగా వివరించారు.  కెనడా రచయితల తొలి కథా సంకలనం “కెనడా కతలు”, “డయాస్పోరా తెలుగు కథానిక-15వ సంకలనం ఈ ప్రారంభ సభలో ఆవిష్కరించబడ్డాయి.

రెండవ రోజు ప్రారంభ సభలో ప్రముఖ సినీ కవి సుద్దాల అశోక్ తేజ మహాకవి దాశరధి గారి కవిత్వం, వ్యక్తిత్వ మీద ఉత్తేజకరమైన ప్రసంగం చేశారు. ఇంటర్ నెట్ సదుపాయం లేని చోట ఉన్నా, ఆ ఆటంకాన్ని అధిగమించి శ్రీ భువన చంద్ర వీడియో ద్వారా రెండు గ్రంధాలు ఆవిష్కరించి, ఈ సదస్సు ప్రాముఖ్యతని గుర్తించి ప్రసంగించడం ఆయన సహృదయతకి నిదర్శనం. ఈ వేదికలో చరిత్ర, స్వీయ అనుభవం, ఆవేదన అన్నీ కలగలిపి ఉన్నమాట ఉన్నట్టుగా ఈ నాడు ప్రసారం అవుతున్న వెబ్ సీరీస్ లో తెలుగు భాష దిగజారుతున్న వాస్తవాన్ని శ్రీమతి బలభద్రపాత్రుని రమణి ప్రసంగం ఎంతో ఆకట్టుకుంది.

ఇక “తెలుగు సాహిత్యం లో హాస్యం వ్యంగ్యం” (దామరాజు విశాలాక్షి), కథల కన్న అమెరికా జీవితాలు (భాస్కర్ పులికల్), డయాస్పోరా కవిత్వం-స్థానికత" (డా. కె.గీత) అసలు మంచి కథ అంటే ఏమిటి?(దీప్తి పెండ్యాల) వాడుక భాషకు గొడుగు గిడుగు” (తోటకూర ప్రసాద్), వర్తమాన తెలుగు కథ - కొన్ని ఆలోచనలు (కల్పన రెంటాల), నేటి కాలపు తెలుగు కవిత్వము-ఒక పరిశీలన (ఇంద్రాణి పాలపర్తి) ఫెమినిజంతో నా ప్రయాణం-కవయిత్రిగా (మహెజబీన్), ఓరుగంటి గోపాల కృష్ణ గారు అత్యంత అద్భుతంగా చదివిన స్వీయ రచన  “ప్రక్షాళనం” కథ, రామ్ డొక్కా నిర్వహించిన “ఆధునిక కవితా రీతులు” చర్చా వేదిక లో “కవిత్వం -కొన్ని అవసరాలు” అనే విన్నకోట రవిశంకర్ అద్భుతమైన ప్రసంగం, ప్రముఖ సాహితీవేత్త స్వాతి శ్రీపాద “”అనువాద ప్రక్రియ” మీద స్వానుభవంతో చేసిన ప్రసంగం, “హనుమ శతకం” అనే పేరిట ఎంతో హాస్యమూ, సామాజిక స్పృహా ఉన్న కవితలని మనసుకి హత్తుకు పోయేలా వినిపించిన హనుమంత రావు కరవది గారి స్వీయ రచనా పఠనం, తను ఆంగ్లం, మనవరాలు తెలుగు నేర్చుకునే అంశం మీద అల్లిన లక్ష్మీ సుగుణవల్లి చీమలమఱ్ఱి గారి “అక్ష్రరాభ్యాసం” కథ, “ప్రపంచ కథా సంప్రదాయాలు” అనే అంశం మీద డాక్టరేట్ స్థాయి పరొశోధన తో భాస్కర్ రాయవరం ప్రసంగం, మంతెన గ్రామం స్వచ్కమైన తెలంగాణా మాండలీకం లో “ పిల్ల లగ్నం” అనే కథని వింటూ అందరినీ మంత్రముగ్ఢుల్ని చేసిన చేసిన శ్రీమతి విజయ లక్ష్మి సువర్ణ గారి స్వీయ కథా పఠనం...ఇలా చెప్పాలంటే 20 గంటలకి పైగా జరిగిన ఈ సదస్సులో సుమారు 100 ప్రసంగాలూ వేటికవే వాటి ప్రత్యేకత ని చాటుకున్నాయి...అన్నీ సావకాశం గా వినాల్సివే..విని ఆనందించాల్సినవే... అభినందించాల్సినవే....

ఈ సదస్సుకి పరాకాష్టగా రెండు అంశాలు ప్రధానంగా నిలుస్తాయి. మొదటిది..మొదటి రోజు ఆఖరి సమావేశంగా జరిగిన జీవన సాఫల్య పురస్కార వేదిక.  పురస్కార గ్రహీత అయిన డా. తిరుమల కృష్ణ దేశికాచారి గారి స్వగృహం లోనే జరిగిన ఈ వేడుకని దేవి చౌదరి, మైత్రి కల్లూరి, సరోజ & రావు కొమరవోలు దంపతులు, సత్యం పోతంశెట్టి & విజయ తదితరులు మంగళ వాద్యాల మధ్య పుష్పగుచ్చం, దుశ్శాలువా, కర్పూర దండ, పురస్కాత జ్ణాపిక, ప్రసంశాపత్రం, పారితోషికాలతో పండిత సత్కారం చేశారు. రెండవ రోజు ముగింపు సభ నిర్వహించిన శారద కాశీవఝ్ఝుల (వేలీ వేదిక వ్యవస్థాపకురాలు) తన అసాధారణ ప్రతిభతో రూపొందించిన “సరదా సాహిత్యం పోటీ” లో ఈ సదస్సులో ప్రసంగించిన వక్తలు సుమారు అందరూ మళ్ళీ పాల్గొని తమ విషయ పరిజ్ఞానాన్ని చాటుకున్నారు.

12 వేదికలలో జరిగిన ఆయా వేదికల నిర్వాహకులుగా డా. కె.గీత, మధుబాల కరవది, , దీప్తి పెండ్యాల, సూర్యకుమారి ఉపాధ్యాయుల, సాయి సోమయాజుల,  శ్రీవాణి ముప్పాళ్ళ, వాణి ఉప్పుల, రాధిక నోరి, శారద కాశీవఝుల మొదలైన వారు వ్యవహరించగా శ్రీనివాస్ గాదె, రఘు ధూళిపాళ,  వేణు కూరెళ్ళ, శ్రీనివాస్ కస్తూరి, ప్రవీణ్ కోరుకొండ, శశి పట్లోళ్ల, సత్యం పోతంశెట్టి మొదలైన వారు సాంకేతిక నిపుణులుగా సదస్సు విజయానికి ఎంతగానో తోడ్పడ్డారు.

రెండు రోజుల ఈ సదస్సు ప్రధాన నిర్వాహకులుగా వంగూరి చిట్టెన్ రాజు, లక్ష్మి రాయవరపు, శాయి రాచకొండ, త్రివిక్రమ్ సింగరాజు, మధు చెరుకూరి వ్యవహరించగా సింగపూర్ కి చెందిన  RK Videography (రాధాకృష్ణ గణేశ్న & కాత్యాయని) పూర్తి సాంకేతిక బాధ్యతలు వహించి ప్రత్యక్ష ప్రసారం అత్యున్నత స్థాయిలో జరగడానికి ప్రధాన బాధ్యత వహించి సదస్సుని విజయవంతం చేశారు.

మొట్టమొదటి కెనడా-12వ అమెరికా సాహితీ సదస్సు వివరాలని అంతర్జాతీయ ప్రసార మాధ్యమాలలో కొన్ని ఈ క్రింది లంకె లలొ చూడవచ్చును.

METRO TV: https://www.facebook.com/100022705057541/videos/1033450037475055/

ఈ సదస్సు 12 వేదికల వేడుకలనీ, ప్రసంగాలనీ వేటికవే వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి యూ ట్యూబ్ చానెల్ లో శాశ్వత ప్రాతిపదిక మీద నిక్షేపించబడ్డాయి....మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ క్రింది లంకె లో చూసి ఆనందించి, స్పందించవచ్చును.

https://www.youtube.com/channel/UCX9tl92zikUSpHp0MuNTiLQ

 

భవదీయుడు,
వంగూరి చిట్టెన్ రాజు

 

 

Tags :