వివరణా..? విచారణా..? కవిత ఇంటికే సీబీఐ ఎందుకు వెళ్తోంది?

వివరణా..? విచారణా..? కవిత ఇంటికే సీబీఐ ఎందుకు వెళ్తోంది?

ఊహించినట్లుగానే ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం కేసీఆర్ ఫ్యామిలీలోకి వచ్చేసింది. కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో తన వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా ఆదేశాల్లో పేర్కొంది. ఢిల్లీలో మొదలైన ఈ స్కామ్ లో మొదటి నుంచి కవిత పేరు వినిపిస్తూనే వచ్చింది. అయితే ఇంతకాలం సీబీఐ కానీ, ఈడీ కానీ నోటీసులు ఇవ్వలేదు.. విచారించలేదు.. కానీ ఇప్పుడు మాత్రం కవితకు నోటీసులు అందడంతో మున్ముందు ఏం జరుగుతుందనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది.
 
ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో వివరణ ఇవ్వాలని ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. సీఆర్పీసీ సెక్షన్ 160 కింద నోటీసులు జారీ చేసిన సీబీఐ.. ఈ నెల ఆరో తేదీన హైదరాబాద్ లేదా ఢిల్లీలో వివరణ ఇవ్వాలని సూచించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి విచారణ జరుపుతున్న క్రమంలో మీకు పరిచయం ఉన్న పలువురు వ్యక్తులకు ఇందులో భాగస్వామ్యం ఉన్నట్టు గుర్తించామని.. ఇందులో మరిన్ని వాస్తవాలు తెలుసుకునేందుకు మీ వివరణ అవసరమని నోటీసుల్లో సీబీఐ పేర్కొంది. ఆరో తేదీ 11 గంటలకు ఎక్కడ వివరణ ఇస్తారో తెలపాలంటా ఛాయిస్ ను కవితకే ఇచ్చింది సీబీఐ. వాస్తవానికి ఎలాంటి కేసుల్లో అయినా తమ ఆఫీసుకు వచ్చి వివరణ ఇవ్వాలని సీబీఐ ఆదేశాలు ఇస్తూ ఉంటుంది. కానీ కవిత విషయంలో మాత్రం ఎక్కడ విచారణకు రావాలో చెప్పాలంటూ కవితకే ఛాయిస్ ఇచ్చింది. పైగా తామే మీరు చెప్పిన చోటుకు వచ్చి వివరణ తీసుకుంటామని వెల్లడించింది. ఇదే ఇప్పుడు ఆశ్చర్యం కలిగిస్తోంది.
 
సీబీఐ నోటీసులపై కవిత వెంటనే స్పందించారు. తనకు నోటీసులు అందాయని.. దానిపై వివరణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని ఆమె వెల్లడించారు. హైదరాబాద్ లోని తన నివాసంలోనే వివరణ తీసుకోవాలని సీబీఐని కోరింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ హైదరాబాద్ కేంద్రంగానే జరిగిందని కేంద్రంలోని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్లో జరిగిన మీటింగ్ లో కవిత నేరుగా పాల్గొన్నారని వారు చెప్తున్నారు. ఈ వ్యవహారంలో సీబీఐ, ఆ తర్వాత ఈడీ రంగంలోకి దిగి పలువురిని విచారించాయి. ఇందులో పలువురు వ్యక్తులు కవితతో మాట్లాడినట్లు ఆధారాలున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా అమిత్ అరోరా అరెస్ట్ తర్వాత కవిత పేరు వెలుగులోకి వచ్చింది. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరును కూడా చేర్చింది ఈడీ.
 
ఢిల్లీ లిక్కర్ స్కాంలో మొత్తం 36మందికి పాత్ర ఉన్నట్టు గుర్తించామని ఈడీ చెప్తోంది. అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డితో పాటు కవిత, మనీశ్ సిసోడియా.. తదితరులు ఈ డీల్ లో పార్టిసిపేట్ చేసినట్లు ప్రస్తావించింది. ఈ మొత్తం వ్యవహారంలో సౌత్ గ్రూప్ కంపెనీ నుంచి ఢిల్లీ ప్రభుత్వ పెద్దలకు సుమారు వంద కోట్లు ముట్టినట్లు ఈడీ ఆరోపిస్తోంది. సౌత్ గ్రూప్ ను శరత్ చంద్రారెడ్డి, కవిత, మాగుంట.. తదితరులు నియంత్రిస్తున్నారని రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. ఇప్పటికే ఈ కేసులో కవిత సన్నిహితుడు, వ్యాపారవేత అభిషేక్ బోయినపల్లి అరెస్టయ్యారు. తీహార్ జైల్లో ఉన్నారు. కవిత ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును కూడా ఈడీ ఇప్పటికే విచారించింది. ఇలా ఒక్కొక్కరిని విచారిస్తూ వెళ్తున్న సీబీఐ, ఈడీ.. ఎవరెవరి పాత్ర ఎంత ఉందో రాబట్టే పనిలో ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు కవితకు నోటీసులు అందినట్లు తెలుస్తోంది. మరి కవిత వివరణ తీసుకున్న తర్వాత ఏం జరుగుతుందనేది వేచి చూడాలి.

 

 

Tags :