ఇంత నీచమైన సీఎంను ఎన్నడూ చూడలేదు.. జగన్‌పై చంద్రబాబు ధ్వజం

ఇంత నీచమైన సీఎంను ఎన్నడూ చూడలేదు.. జగన్‌పై చంద్రబాబు ధ్వజం

సీఎం జగన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. సైకో చేతిలో రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందని, అలాంటి సమయాల్లో రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సి బాధ్యత మనమీదే ఉంటుందని చంద్రబాబు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో టీడీపీ నిర్వహించిన ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తన రాజకీయ జీవితంలో ఎన్నడూ ఇంతటి నీచమైన ముఖ్యమంత్రిని చూడలేదని అన్నారు. వైసీపీ పాలనలో ఊరికో సైకోను తయారు చేస్తున్నారని విమర్శించారు. ఈ సీఎం దెబ్బకు రాష్ట్రాన్ని విడిచి ప్రతి కంపెనీ వెళ్ళిపోతుందని, ఇక్కడ నుంచి వెళ్ళిన అమరరాజా బ్యాటరీస్ తెలంగాణలో రూ.9,500 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకుందని తెలిపారు. రాష్ట్రంలో ఇలానే సాగితే యువతకు ఉపాధి ఎలా లభిస్తుందని ప్రశ్నించారు. సీఎం వేధింపులు తట్టుకోలేక ఏపీ వ్యక్తి వేరే రాష్ట్రం వెళ్ళి పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యారని, అదే విధంగా నారాయణ విద్యాసంస్థల అధినేతనూ ఈ సీఎం వేధిస్తున్నారని, రాజకీయ కక్షతో అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని చంద్రబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ కోసం రాత్రింబవళ్లు శ్రమించానని, రైతులకు నీరందించేందుకు దూరదృష్టితో పనిచేశానని, కానీ ఈ సైకో ముఖ్యమంత్రి పోలవరాన్ని గోదావరిలో కలిపేశారని, రాష్ట్ర భవిష్యత్తు నాశనమవుతుందని బాధగా ఉందని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

 

 

Tags :