టీడీపీ ఈ-పేపర్‌ను ప్రారంభించిన చంద్రబాబు

టీడీపీ ఈ-పేపర్‌ను ప్రారంభించిన చంద్రబాబు

చైతన్య రథం పేరిట రూపొందించిన తెలుగుదేశం పార్టీ ఈ-పేపర్‌ను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కొంతమంది అవినీతి డబ్బుతో పేపర్‌, టీవీ ఛానెల్‌ పెట్టినా టీడీపీ ఎప్పుడూ సొంత మీడియా సంస్థను ఏర్పాటు చేయాలనే ఆలోచన లేదని అన్నారు. కార్యకర్తలు ప్రజలను చైతన్య పరిచే ఆయుధంగా చైతన్య రథం పనిచేస్తుందని అన్నారు.  స్వతంత్రంగా పనిచేసే మీడియాపై వైసీపీ ప్రభుత్వం వేటు వేసిందని విమర్శించారు.  ప్రభుత్వ నియంత్రణలో లేకుంటే తప్పుడు కేసులతో బెదిరిస్తున్నారని ఆరోపించారు. వీళ్ళు పుట్టక ముందు నుంచి ఉన్న మీడియా సంస్థలకు కూడా కుల ముద్ర వేసి వేధిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ వార్తలు రాయకూడదనే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.  60 శాతం మంది ప్రజలు ఇప్పటికే సామాజిక మాధ్యమాలకు అలవాటు పడ్డారు.  సొంతూరు విశేషాలు రియల్‌ టైమ్‌లో తెలుసుకునేందుకు ఇష్టపడుతున్నారు.

తెలుగుదేశం పార్టీకి 70 లక్షల మంది కార్యకర్తలకు సమాచారం చేరవేసేలా చైతన్య రథం ఈ పేపర్‌ను తీర్చిదిద్దుతాం. ఒక్క క్లిక్‌తో 30 లక్షల మంది పార్టీ శ్రేణులకు ఈ-పేపర్‌ను పంపించాం. ఇప్పటికే అనేక సామాజిక మాధ్యమాల ద్వారా పార్టీ సమాచారాన్ని చేరవేస్తున్నాం. ప్రజాస్వామ్యంలో మీడియాకు ఓ విశ్వసనీయత ఉందన్నారు. కొంత మంది అవినీతి సొమ్ముతో పేపర్లు పెట్టారు. విపరీతంగా డబ్బులు దండుకున్నారు. కొంత మంది ఎలక్ట్రానిక్‌ మీడియాను కూడా పెట్టుకున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ 20 ఏళ్లుపైగా అధికారంలో ఉన్నా పేపర్‌ పెట్టాలని టీవీ పెట్టాలనే ఆలోచన ఎప్పుడూ చేయలేదన్నారు.

 

Tags :